గడువు ముగిస్తే.. ఇక చర్యలే..
న్యూఢిల్లీ:నల్లధనం కుబేరులపై కొరడా ఝళిపించేందుకు కేంద్ర ప్రభుత్వం అస్త్రశస్త్రాలతో సంసిద్దమవుతోంది. సెప్టెంబర్30 తో ముగియనున్న ఇన్ కం డిక్లరేషన్ స్కీం ముగిసిన తరువాత నల్లధనంపై కఠిన చర్యలు చేపట్టేందుకు నరేంద్ర మోదీ సర్కార్ రంగం సిద్ధం చేస్తోంది. ఆదాయ ప్రకటన గడువు పూర్తికాగానే కఠినమైన కార్యాచరణకు దిగనుంది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) నుంచి పన్ను ఎగవేతదారులకు సంబంధించిన డాటాను కూడా సేకరించింది.
దీనిలో భాగంగా ఇప్పటికే జరిగిన లావాదేవీలపై వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు జారీ చేసినట్లు సీనియర్ సీబీడీటీ అధికారి తెలియజేశారు. వ్యక్తులు, వివిధ సంస్థలకు దాదాపు ఏడులక్షలమందికి పైగా ఈ నోటీసులు అందించింది. జూన్ 1 ప్రకటించిన ఈ ఐడీఎస్ పథకంకింద ఆదాయ ప్రకటనకు ఒక అవకాశం ఇచ్చామని, ఇదే ఆఖరి అవకాశమని చెప్పారు. వివిధ మార్గాల ద్వారా తమ దగ్గర భారీ సమాచారం ఉందని ఈ మేరకు చర్యలకు దిగనున్నామని సీబీడీటీ స్పష్టం చేసింది. అయితే ఈ గడువు అనంతరం ఏ రకంగా కార్యాచరణ ఉండబోతోందన్న వివరాలను అధికారులు ప్రకటించలేదు. విదేశీ నల్లధనం పథకం కింద రూ. 4,164 కోట్ల విలువ చేసే 648 డిక్లరేషన్లను సిద్ధంగా ఉంచింది. వాటికి ద్వారా సుమారు 2, 476 కోట్లను పన్నుల రూపంలో వసూలు చేయనుంది.
మరో పక్క నల్లధనం నిల్వచేసే, తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకునే బినామీ చట్టం కూడా త్వరలో అమల్లోకి రానుంది. 2018 తర్వాత చాలా దేశాల్లో సమాచార మార్పిడి ఒప్పందాలు అమల్లోకి రానుండటంతో విదేశాల్లో కూడా నల్లధనం అంశంపై నిబంధనలు కఠినతరం కానున్నాయి ఈ లోపు ప్రభుత్వం కూడా నగదు వినియోగాన్ని పూర్తిగా తగ్గించే చర్యలకు దిగనుంది.