జూన్‌కి ఈ-గవర్నెన్స్ మాస్టర్ ప్లాన్
‘మీ కోసం’ పోర్టల్ ఆవిష్కరణలో సీఎం చంద్రబాబు
హైదరాబాద్: ఈ-గవర్నెన్స్ మాస్టర్ ప్లాన్‌ను జూన్ నాటికి సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘మీ కోసం పోర్టల్’ను మంగళవారం సీఎం తన నివాసంలో ఆవిష్కరించారు. పారదర్శక, సుపరిపాలనలో ఇది మరో ముందడుగని ఈ సందర్భంగా అన్నారు. ప్రస్తుతం సిద్ధం చేసిన 20 శాఖలతోపాటు మిగిలిన విభాగాలను కూడా రెండో దశ కింద ఈ పోర్టల్‌లో పొందుపరచాలని ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కార దినోత్సవం నిర్వహించి వచ్చిన ఫిర్యాదులను అంశాల వారీగా పొందుపరచాలని చెప్పారు. ఆర్థిక సమస్యలు, ఆర్థికేతర సమస్యలను ఎప్పటికప్పుడు సీఎం కోర్ డ్యాష్ బోర్డులో పెట్టాలని సూచించారు. ఆిప్టికల్ ఫైబర్ గ్రిడ్‌లో భాగంగా రాష్ట్రంలో ప్రతి ఇంటికీ బ్రాడ్‌బ్యాండ్ విడ్త్ కనెక్టివిటీ అందించేందుకు రిలయన్స్ సంస్థ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తుందని చెప్పారు. విద్యుత్తు స్తంభాల ద్వారా ప్రతి ఇంటికీ కనెక్టివిటీని డిసెంబర్ నాటికి ఇవ్వాలని ఆదేశించారు.
ఈ-పాస్ పూర్తయితే ఏడాదికి రూ. 1,400 కోట్లు ఆదా
చౌకడిపోలకు ఈ-పాస్ అమర్చితే ఏటా సుమారు రూ. 1,400 కోట్లు ఆదా అవుతుందని సీఎం వివరించారు. ఈ-పాస్ అమర్చడంలో జాప్యమయ్యేకొద్దీ ప్రభుత్వం నష్టపోతుందన్నారు. ప్రజలు తమ సమస్యలను ఆధార్, మొబైల్ నంబర్లతో ఈ పోర్టల్‌లో నమోదు చేయాలని ఐటీ సలహాదారు జె.సత్యనారాయణ సూచించారు. ఫిర్యాదులు ఏ ద శలో ఉన్నాయో ఎప్పటికప్పుడు కాల్ సెంటర్ టోల్‌ఫ్రీ నంబరు 1100/1800 -4254440కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు.