Mathangi movie
-
అమ్మోరు గుర్తుకొస్తోంది – నందినీరెడ్డి
‘నరసింహ’ చిత్రంలో నీలాంబరి, ‘బాహుబలి’ సినిమాలో శివగామి పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు రమ్యకృష్ణ. తాజాగా ‘మాతంగి’గా ప్రేక్షకులను అలరించబోతున్నారు రమ్య. ఆమె ప్రధాన పాత్రలో కన్నన తమ్మార్కులమ్ దర్శకత్వంలో మలయాళ హిట్ మూవీ ‘మాతంగి’ని అదే పేరుతో రమ్యకృష్ణ సోదరి వినయకృష్ణన్ తెలుగులోకి అనువదించారు. ఈ నెల 15న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. దర్శకురాలు నందినీరెడ్డి మాట్లాడుతూ– ‘‘రమ్యగారికి వినయ బిగ్గెస్ట్ క్రిటిక్. ఆమెకు ఏదీ త్వరగా నచ్చదు. ‘మాతంగి’ని ఆమె తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారంటే ఈ చిత్రంలో ఏదో విషయం ఉంటుంది. రమ్యగారి ‘మాతంగి’ లుక్ చూస్తుంటే ‘అమ్మోరు’ సినిమా గుర్తుకొస్తోంది’’ అన్నారు. ‘‘తెలుగులో మేం తొలిసారి చేస్తున్న చిన్న ప్రయత్నం ‘మాతంగి’. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా ఎడిట్ చేసింది కృష్ణవంశీగారే’’ అన్నారు రమ్యకృష్ణ. ఈ వేడుకలో రమ్యకృష్ణవంశీల తనయుడు రిత్విక్ పాల్గొన్నాడు. నటుడు ఓంపురి ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రానికి రచన: వెన్నెలకంటి, సంగీతం: రతీష్ వేగ. -
మాహిష్మతిని వీడిన శివగామి ఇలా..
చిన్నారి మహేంద్ర బాహుబలిని కాపాడే క్రమంలో మాహిష్మతిని వీడిన శివగామి.. నదిలోనే ప్రాణాలు విడిచినట్లు సినిమాలో చూస్తాం. అయితే, నిజంగానే శివగామి చనిపోతుందా? లేక తిరిగొస్తుందా? ట్విస్టులతో కూడిన రాజమౌళి సినిమాలు చూశాక ప్రేక్షకులకు ఇలాంటి సందేహాలురాక మానవు! సాక్ష్యం కావాలంటే రమ్యకృష్ణ కొత్త సినిమా ‘మాతంగి’ ట్రైలర్‌పై నెటిజన్ల కామెంట్లు చూడొచ్చు! ‘మాహిష్మతి నుంచి వెళ్లిపోయిన శివగామి.. మళ్లీ మాతంగిగా వచ్చింది..’ అని కొందరు, ‘ఆవిడ(రమ్య) ఏ పాత్రలోనైనా ఒదిగిపోగలర’ని ఇంకొందరు వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా ప్రేక్షకుల్లో బాహుబలి ఫీవర్ చల్లారకముందే.. రమ్యకృష్ణ నటించిన మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కూతురి సెంటిమెంట్‌తోపాటు క్షుద్రశక్తులతో పోరాటాన్ని ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కిన ‘మాతంగి’లో రమ్య లీడ్‌రోల్ పోశించింది. సీనియర్ నటుడు జయరాం హీరోగా, కన్నం తమరక్కుళం దర్శకత్వంలో మలయాళంలో రూపొందిన ఈ సినిమాలో మిర్చి సంపత్, అక్షర కిషోర్, ఏంజిలీనా అబ్రహామ్లతోపాటు దివంగత ఓమ్పురిలు ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. తెలుగు డబ్బింగ్‌కు వెన్నలకంటి మాటలు రాశారు. జూన్‌లో విడుదలకానున్న ‘మాతంగి’ ట్రైలర్ శనివారం విడుదలైంది..