మ్యాట్రిమోనీ ప్రకటన ఇచ్చి మోసపోయిన మహిళ
మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మ్యాట్రి మోనీ వెబ్సైట్ల ద్వారా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు ప్రకటన చూసి మోసపోతే, మరికొందరు ప్రకటనలు ఇచ్చి మోసపోతుంటారు. పోలీసులు చట్టపరంగా ఎన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నా, మోసపోయే వారి సంఖ్యా మాత్రం తగ్గడం లేదు. మోసం చేసే వారు కూడా పెరిగిపోతున్నారు. ఇప్పుడు మోసపోవడం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ఒక మహిళ వంతైంది.
రాజమండ్రికి చెందిన రమణకుమారికి నలభై ఏళ్లు. తన వయసుకు తగ్గ వరుడు కావాలని మ్యాట్రి మోనీలో ప్రకటన ఇచ్చింది. విజయవాడలో ఆంజనేయ స్వామి గుడి కార్యకలాపాలు చూస్తున్న విజయబాబు ఆమెను సంప్రదించి పెళ్లికి ఒప్పించాడు. పెళ్లికి ముందే 30 వేల రూపాయలు తీసుకున్నాడు. పెళ్లి తర్వాత ఆమె పేర ఉన్న ఇంటిని అమ్మించాడు. ఐదు లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఆ తరువాత విజయబాబు ఆమెని విజయవాడలోని ఆంజనేయ స్వామి గుడి వద్దకు తీసుకొచ్చి, అక్కడ వదిలి మళ్లీ వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. మళ్లీ రాలేదు. మోసపోయిన విషయం ఆమెకు అప్పుడు అర్ధమైంది.
అప్పుడు విజయబాబు గురించి ఆరా తీయడం మొదలు పెట్టింది. ఆసలు విషయం అప్పుడు గానీ ఆమెకు తెలియలేదు. విజయబాబుకు ఇదివరకే పెళ్లి అయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. న్యాయం కోసం విజయబాబు ఉంటున్న అపార్ట్ మెంట్ వద్దే ఆందోళన చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా ఫలితం లేదు. తనకు న్యాయం జరిగే వరకు అపార్ట్మెంట్ వద్ద నుంచి కదలనని అక్కడే భీష్మించుకు కూర్చుంది.