నాకు నువ్వు...నీకు నేను...
ఏడడుగులు వేసిన మరుగుజ్జు జంట
బొబ్బిలి: వారిద్దరూ మరుగుజ్జులే....కలిసి జీవితం పంచుకోవాలని అనుకున్నారు... రాష్ట్రాలు వేరైనా ఆలోచించకుండా మూడుముళ్లబంధంతో ఒక్కటయ్యారు. వివరాలు.... విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం మెట్టవలస గ్రామానికి చెందిన అల్లం శివన్నారాయణ(38) గ్రామంలోనే టైలరింగు వృత్తిని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మూడడుగుల ఎత్తు ఉన్న ఇతను గత పదేళ్లుగా సరిపడే జోడీ గురించి వెతుకులాడుతున్నాడు.
పశ్చిమబెంగాల్ రాష్ర్టంలోని ఖరక్పూర్లో ఉంటున్న అన్నపూర్ణ అనే మహిళ కూడా మరుగుజ్జే. ఈమెకు వివాహప్రయత్నాలు చేస్తున్నారని తెలుసుకున్న శివన్నారాయణ బంధువుల ద్వారా సంప్రదించాడు. రాష్ర్ట సరిహద్దులు దాటైనా అబ్బాయితో జీవనానికి ఆమె సై అనడంతో బొబ్బిలి మండలం మెట్టవలస గ్రామంలో ఆదివారం రాత్రి శివన్నారాయణ, అన్నపూర్ణల వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు.