Maya Bazaar
-
‘సప్తపర్ణ’ శోభితం... సురభి ‘భక్త ప్రహ్లాద’ నాటకం
జంట నగరాలలోని నాటక కళాభిమానులకు మరోసారి కన్నుల విందయింది. ప్రసిద్ధ సాంస్కృతిక సభాంగణం ‘సప్తపర్ణి’ 20వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆరుబయలు ప్రాంగణంలో రెండురోజుల పాటు ‘సురభి’ వారి నాటకాల ప్రత్యేక ప్రదర్శనలు ఆనందాన్ని పంచాయి. శనివారం ‘మాయా బజార్’ నాటకం ప్రదర్శించగా, ఆదివారం క్రిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య ‘భక్త ప్రహ్లాద’ నాటక ప్రదర్శన రెండుగంటల పైచిలుకు పాటు ఆద్యంతం రసవత్తరంగా నడిచింది. భాగవత పురాణ కథే అయినప్పటికీ, సంభాషణల్లో కొత్త తరానికి సులభంగా అర్థమయ్యే సమకాలీనతను జొప్పించడం గమనార్హం. 1932లో రిలీజైన తొలి పూర్తి తెలుగు సినిమా ‘భక్త ప్రహ్లాద’కు సైతం ఈ నాటకమే ఆధారం కావడం విశేషం. కాగా, తాజా నాటక ప్రదర్శనలో రోజారమణి నటించిన ఏవీఎం వారి పాపులర్ ‘భక్త ప్రహ్లాద’ సినిమాలోని ‘నారాయణ మంత్రం...’, ‘జీవము నీవే కదా...’ లాంటి పాటలను సైతం జనాకర్షకంగా సందర్భోచితంగా వాడుకోవడం గమనార్హం. నటీనటులు, సంగీత, లైటింగ్ సహకారం అంతా చక్కగా అమరిన ఈ నాటకంలో ఆరేళ్ళ పసిపాప ప్రహ్లాదుడిగా నటిస్తూ, పాటలు, భాగవత పద్యాలను పాడడం అందరినీ మరింత ఆకర్షించింది. గాలిలో తేలుతూ వచ్చే సుదర్శన చక్రం, పామును గాలిలో ఎగురుతూ వచ్చి గద్ద తన్నుకుపోవడం, మొసలిపై ప్రహ్లాదుడు, స్టేజీ మీద గాలిలోకి లేచే మంటలు లాంటి ‘సురభి’ వారి ట్రిక్కులు మంత్రముగ్ధుల్ని చేశాయి. చిన్న పిల్లలతో పాటు పెద్దల్ని సైతం పిల్లల్ని చేసి, పెద్దపెట్టున హర్షధ్వానాలు చేయించాయి. ఏకంగా 150 ఏళ్ళ పై చిలుకు చరిత్ర కలిగిన ‘సురభి’ నాటక వారసత్వాన్ని కొనసాగిస్తున్న ఆరో తరానికి చెందిన ఆర్. జయచంద్రవర్మ సారథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన దాదాపు 52 మంది దాకా నటీనటులు, సంగీత వాద్యకళాకారులు కలసి ఈ ప్రదర్శనలు చేయడం విశేషం. కిక్కిరిసిన ఆరుబయలు ప్రాంగణం, గోడ ఎక్కి కూర్చొని మరీ చూస్తున్న నాటక అభిమానులు, ఆద్యంతం వారి చప్పట్లు... వేదికపై ప్రదర్శన ఇస్తున్న నటీనటులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చాయి. కరోనా సమయంలో తమను ఎంతో ఆదుకొని, ప్రేక్షకులకూ – తమకూ వారధిగా నిలిచి, ఇప్పుడు మళ్ళీ ఈ ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేసిన రంగస్థల పోషకురాలు – ‘సప్తపర్ణి’ నిర్వాహకురాలు అనూరాధను ‘సురభి’ కళాకారులు ప్రత్యేకంగా సత్కరించి, తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. ఎంబీఏ, సీఏ లాంటి పెద్ద చదువులు చదివిన పెద్దల నుంచి స్కూలు పిల్లల వరకు అందరూ ఈ రెండు రోజుల నాటక ప్రదర్శనల్లో నటించడం చెప్పుకోదగ్గ విశేషం. ఇది తెలుగు వారు కాపాడుకోవాల్సిన ప్రత్యేకమైన ‘సురభి’ కుటుంబ నాటక వారసత్వమని ప్రదర్శనలకు హాజరైన పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. -రెంటాల జయదేవ -
నేడు సినీ మార్గదర్శకుడు కేవీ రెడ్డి వర్ధంతి
సినిమాకు ఒక విధానం ఉందనీ, ఆ విధానానికి ఒక శాస్త్రం ఉందనీ, దాన్ని అనుసరించే సినిమాలు తీయాలని చెప్పి, చేసి చూపిన దర్శక మేధావి కేవీ రెడ్డి. సరైన స్క్రిప్టు సినిమాకు ముఖ్యమనీ, స్క్రీన్‌ప్లే సిద్ధమైతే సినిమా మూడొంతులు పూర్తయినట్టేనని నిరూపించిన దక్షిణ భారతదేశ దర్శకుల్లో అగ్రగణ్యులు. దర్శకునిగా కేవీ రెడ్డి మూడు దశా బ్దాల కాలంలో తీసిన సినిమాల సంఖ్య కేవలం 14. తమిళ, హిందీ వెర్షన్లతో కలిపితే 18. వీటిలో 5 పౌరాణికాలు, నాలుగు జానపదాలు, 3 సాంఘికాలు, రెండు చారిత్రకాలు ఉన్నాయి. ఆయన పేరు చెప్పగానే ‘మాయాబజార్’, ‘పాతాళభైరవి’, ‘గుణసుందరి కథ’, ‘దొంగ రాముడు’ గుర్తొస్తాయి. కేవీ 1937లో తన మిత్రుడు మూలా నారాయణస్వామి భాగ స్వామిగా ఉన్న ‘రోహిణీ పిక్చర్స్’లో ప్రొడ క్షన్ ఎగ్జిక్యూటివ్ గా చేరడంతో సినీ రంగంలోకి ప్రవేశించారు. అప్పట్లో రోహిణీ పిక్చర్స్ హెచ్ఎం రెడ్డి దర్శకత్వంలో ‘గృహలక్ష్మి’ (1938) తీసింది. ఇక్కడే ఆయనకి బీఎన్ రెడ్డి, సముద్రాల, నాగిరెడ్డిలతో పరిచయమైంది. తర్వాత వీరంతా బయటికి వచ్చి వాహినీ పిక్చర్స్ స్థాపించారు. వాహినీ పతాకంపై బీఎన్ తీసిన ‘వందేమాతరం’ (1939), ‘సుమంగళి’ (1940), ‘దేవత’ (1941) చిత్రాలకు కేవీ సహాయ దర్శకులుగా చేశారు. దేవత తరువాత కేవీకి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. అది మూలా నారాయణస్వామి పెట్టుబడితో తీసిన ‘భక్తపోతన’ (1942). అది రజతోత్సవాలు జరుపుకుంది. ‘గుణసుందరి కథ’ (1949) విజయం ఇచ్చిన ప్రేరణతో విజయావారికి మరో అద్భుత జనరంజకం ‘పాతాళభైరవి’ (1951) తీశారు. ‘మాయాబజార్’ (1957) ఒక చరిత్రను సృష్టించింది. కేవీ దర్శకత్వ ప్రతిభకు, పకడ్బందీ స్క్రీన్ ప్లేకు ఈ చిత్రం ఒక తిరుగులేని సిలబస్. తెలుగు చిత్ర రంగంలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కేవీ రెడ్డి (కదిరి వెంకటరెడ్డి) 1912 జులై 1న అనంతపురం జిల్లా తాడిపత్రిలో పుట్టారు. 1972 సెప్టెంబర్ 15న కన్నుమూశారు. కేవీ మనమధ్య లేక పోయినా ఆయన కళకు, వ్యాపారానికి సమన్వయం చేస్తూ తీసిన చిత్రాలు చూస్తున్నంత కాలం చిరంజీవిగా నిలిచే ఉంటారు. తెలుగు సినిమా రంగంలో ఆయనకు ప్రత్యామ్నాయం లేదు. – హెచ్. రమేష్ బాబు, చలనచిత్ర పరిశోధకులు (నేడు కేవీ రెడ్డి వర్ధంతి) -
‘మిస్సమ్మ’ నిర్మాత సత్యనారాయణ కన్నుమూత
ప్రముఖ నిర్మాత బి. సత్యనారాయణ (61) ఇక లేరు. కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం తిరుపతిలో తుది శ్వాస విడిచారు. సత్యం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ‘బాలీవుడ్ కాలింగ్’ ఆనే ఆంగ్ల చిత్రం ద్వారా ఆయన నిర్మాతగా ఎంటరయ్యారు. పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఈ చిత్రం ప్రదర్శితం కావడం విశేషం. ఆ తర్వాత ఆయన ‘ధనలక్ష్మీ ఐ లవ్ యు’, ‘మిస్సమ్మ’, ఇంద్రగంటి మోహనకృష్ణతో ‘మాయాబజార్’ చిత్రాలు నిర్మించారు. శివాజీ, భూమిక కాంబినేషన్లో నీలకంఠ దర్శకత్వంలో రూపొందిన ‘మిస్సమ్మ’ ఆయనకు మంచి పేరు తెచ్చింది. సత్యనారాయణకు భార్య (అన్నపూర్ణ), ఇద్దరు కుమార్తెలు (హరిత, తేజస్వి) ఉన్నారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం తిరుపతిలో జరుగుతాయి. సత్యనారాయణ మరణానికి నిర్మాతల మండలి సంతాపం వ్యక్తం చేసింది.