నీళ్ల కోసం సర్పంచ్ నిర్బంధం
గదిలో పెట్టి తాళం
రెండు గంటల పాటు ఉత్కంఠ
మాయికోడ్‌లో ఘటన
మనూరు: నీటి సమస్యను పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహించిన ప్రజలు సర్పంచ్‌ను నిర్బంధించారు. ఈ ఘటన మనూరు మండలంలోని మాయికోడ్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. పంద్రాగస్టు వేడుకల సందర్భంగా సర్పంచ్ నాయక్ పంచాయతీ కార్యాలయానికి చేరుకోగానే ప్రజలు బయటి నుంచి తలుపులు మూసి ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు.
సమస్య తీవ్రంగా ఉన్నా పంచాయతీ సిబ్బందితో పాటు మండల అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. కాగా, సర్పంచ్ జెండా ఆవిష్కరించగానే గ్రామస్తులంతా మూకుమ్మడిగా పంచాయతీ కార్యాలయంలోనే సర్పంచ్‌ను నిర్బంధించారు. దీంతో రెండు గంటల పాటు ఉత్కంఠత నెలకొంది.
బోరు మోటార్లను వెంటనే రిపేర్ చేయిస్తానని సర్పంచ్ పేర్కొనడంతో గ్రామస్తులు శాంతించారు. కాగా, సర్పంచ్ తండాకు చెందిన వాడు కావడం వల్లే మిగతా గ్రామస్తులకు ఇబ్బంది కలిగిస్తున్నాడని పలువురు మహిళలు ఆరోపించారు. సర్పంచ్ చెక్ పవర్‌ను రద్దు చేసి అధికారులే పంచాయతీ నిధులను పర్యవేక్షించాలని కోరారు.
ఇదిలా ఉండగా, గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ గతంలోనూ సర్పంచ్ నాయక్‌ను గ్రామస్తులు రెండుసార్లు పంచాయతీ కార్యాలయంలో నిలదీశారు. ఇప్పటికైనా జిల్లాస్థాయి అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.