Mazdak Dilshad Baloch
-
'ప్రపంచదేశాలు మోదీ వ్యాఖ్యలను అనుసరించాలి'
న్యూఢిల్లీ: బలూచిస్తాన్లో పాకిస్తాన్ ప్రభుత్వం మానవహక్కులను కలరాస్తున్న విషయాన్ని అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్తామని, అక్కడి ప్రజలకు మద్దతుగా నిలుస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై.. బలూచ్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న నాయకుడు మజ్దాక్ దిల్షాద్ బలూచ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచదేశాలు బలూచిస్తాన్ విషయంలో మోదీ వ్యాఖ్యలను అనుసరించాలని ఆయన మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. అలాగే.. కశ్మీర్ అనేది భారత అంతర్భాగానికి సంబంధించిన విషయం అని, బలుచిస్తాన్ వ్యవహారం అలా కాదన్నారు. అది అంతర్జాతీయ వ్యవహారం అని ఆయన తెలిపారు. భౌగోళికంగా, చారిత్రాత్మకంగా కశ్మీర్ అనేది వందల సంవత్సరాలుగా భారత్లో భాగమని అన్నారు. బలుచిస్తాన్ మాత్రం 700 సంవత్సరాలుగా స్వతంత్ర్య రాజ్యంగా ఉందని, దానికి సొంత పార్లమెంట్.. హౌస్ ఆఫ్ లార్డ్స్, హౌస్ ఆఫ్ కామన్స్ ఉన్నాయని దిల్షాద్ బలూచ్ గుర్తుచేశారు. అరబ్ ప్రపంచం, యూరోపియన్ యూనియన్, నార్త్ అమెరికా లాంటి బలమైన దేశాలు, కూటములు బలూచిస్తాన్ విషయంలో పాక్పై ఆంక్షలను విధించాలని ఆయన కోరారు. -
కుక్క అనండి, కానీ పాకిస్థానీ అనకండి!
'నేను పాకిస్థానీ కాదనే విషయాన్ని ఇమ్మిగ్రేషన్ అధికారులకు వివరిస్తూ ఎంతో వేదనకు గురయ్యాను. నన్ను కుక్క అని పిలువండి కానీ పాకిస్తానీ అని పిలువకండి అని వారిని కోరారు. నేను బలూచ్ వాసిని. నా జన్మస్థలం కారణంగా నేనే ఎన్నో వేధింపులు అనుభవించాను'... బలూచ్ శరణార్థి 25 ఏళ్ళ మజ్దక్ దిల్షాద్ బలూచ్ ఆవేదన ఇది. ఆయన, తన భార్యతో కలిసి ఇటీవల న్యూఢిల్లీకి వచ్చారు. ఆయన కెనడియన్ పాస్ పోర్టు లో జన్మస్థలం పాకిస్థాన్ లోని క్వెట్టా అని ఉండటంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు అనుమానపడ్డారు. దానికి మజ్దక్ ఇచ్చిన సమాధానం అది. బలూచిస్థాన్ కు చెందిన వేలమంది ప్రజలు మజ్దక్ లాగే ప్రపంచంలోని వివిధ దేశాల్లో తలదాచుకుంటున్నారు. వారిని పాక్ ఆర్మీ నిత్యం వెంటాడుతూ హింసిస్తూనే ఉంది. మజ్దక్ తండ్రిని పాక్ ఆర్మీ అపహరించి హత్య చేసింది. అతని తల్లిని నానారకాలుగా హింసించింది. దీంతో మజ్దక్ తన కుటుంబంతోపాటు కెనడాకు శరణార్థిగా తరలిపోయాడు. బలూచిస్థాన్ లో స్వాతంత్ర్యం కోసం జరుగుతున్న పోరాటంపై అవగాహన కలిగించేందుకు తన భార్యతో కలిసి మజ్దక్ న్యూఢిల్లీ వచ్చారు. బలూచిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన గురించి ప్రస్తావించిన ప్రధాని నరేంద్రమోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బలూచిస్థాన్ లో జాతుల నిర్మూలనకు పాక్ ఆర్మీ తెగబడుతున్నదని, పాక్ జాతీయతను ఒప్పుకోనివారిని కిరాతకంగా హతమారుస్తున్నదని ఆయన చెప్పారు.