
కుక్క అనండి, కానీ పాకిస్థానీ అనకండి!
నేను పాకిస్థానీ కాదనే విషయాన్ని ఇమ్మిగ్రేషన్ అధికారులకు వివరిస్తూ ఎంతో వేదనకు గురయ్యాను.
'నేను పాకిస్థానీ కాదనే విషయాన్ని ఇమ్మిగ్రేషన్ అధికారులకు వివరిస్తూ ఎంతో వేదనకు గురయ్యాను. నన్ను కుక్క అని పిలువండి కానీ పాకిస్తానీ అని పిలువకండి అని వారిని కోరారు. నేను బలూచ్ వాసిని. నా జన్మస్థలం కారణంగా నేనే ఎన్నో వేధింపులు అనుభవించాను'... బలూచ్ శరణార్థి 25 ఏళ్ళ మజ్దక్ దిల్షాద్ బలూచ్ ఆవేదన ఇది. ఆయన, తన భార్యతో కలిసి ఇటీవల న్యూఢిల్లీకి వచ్చారు. ఆయన కెనడియన్ పాస్ పోర్టు లో జన్మస్థలం పాకిస్థాన్ లోని క్వెట్టా అని ఉండటంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు అనుమానపడ్డారు. దానికి మజ్దక్ ఇచ్చిన సమాధానం అది.
బలూచిస్థాన్ కు చెందిన వేలమంది ప్రజలు మజ్దక్ లాగే ప్రపంచంలోని వివిధ దేశాల్లో తలదాచుకుంటున్నారు. వారిని పాక్ ఆర్మీ నిత్యం వెంటాడుతూ హింసిస్తూనే ఉంది. మజ్దక్ తండ్రిని పాక్ ఆర్మీ అపహరించి హత్య చేసింది. అతని తల్లిని నానారకాలుగా హింసించింది. దీంతో మజ్దక్ తన కుటుంబంతోపాటు కెనడాకు శరణార్థిగా తరలిపోయాడు. బలూచిస్థాన్ లో స్వాతంత్ర్యం కోసం జరుగుతున్న పోరాటంపై అవగాహన కలిగించేందుకు తన భార్యతో కలిసి మజ్దక్ న్యూఢిల్లీ వచ్చారు. బలూచిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన గురించి ప్రస్తావించిన ప్రధాని నరేంద్రమోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బలూచిస్థాన్ లో జాతుల నిర్మూలనకు పాక్ ఆర్మీ తెగబడుతున్నదని, పాక్ జాతీయతను ఒప్పుకోనివారిని కిరాతకంగా హతమారుస్తున్నదని ఆయన చెప్పారు.