అందరి కృషి వల్లే ‘పుష్కర’ విజయం
– ఎస్పీ రెమా రాజేశ్వరి
మహబూబ్‌నగర్ క్రైం: తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి జరిగిన కృష్ణా పుష్కరాలను అందరి సహకారంతో విజయవంతం చేసినట్లు ఎస్పీ రెమా రాజేశ్వరి పేర్కొన్నారు. కృష్ణా పుష్కర విధులలో పాల్గొన్న డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, ఇతర సిబ్బందికి సోమవారం ఎస్పీ కార్యాలయంలో రెమా రాజేశ్వరి ప్రశంసపత్రాలతో పాటు అవార్డులను ప్రదానం చేశారు. అనంతరం పోలీస్ సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో 52పుష్కరఘాట్లలో దాదాపు 1.80కోట్ల మంది పుణ్యస్నానం చేశారని, ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా సమన్వయంతో విధులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్‌ను దారి మళ్లించడంతో పాటు ఎక్కడా రద్దీగా ఉండకుండా క్లియర్ చేయడంలో పూర్తిగా విజయం సాధించినట్లు తెలిపారు. జిల్లాకు పుష్కరస్నానంలో భాగంగా దాదాపు 5.50లక్షల వాహనాలు వచ్చాయని, వాటన్నింటినీ ఆయా ఘాట్లకు పంపించడం సవాల్‌తో కూడుకున్న వ్యవహారం అయినా, అందులో పూర్తిస్థాయిలో విజయం సాధించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. సిబ్బందితో పాటు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని జిల్లాలో చిన్న సంఘటన జరగకుండా చూడటం పోలీస్‌శాఖ ఉన్నతికి నిదర్శనమన్నారు. అనంతరం పోలీస్ సిబ్బందితో ఎస్పీ గ్రూప్ ఫొటో దిగారు. కార్యక్రమంలో ఓఎస్డీ కల్మేశ్వర్ సింగనవార్, అదనపు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.