ఏసీబీకి చిక్కిన అవినీతి చేప
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మెదక్ ప్రిన్సిపాల్
ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ వెల్లడి
మెదక్: పదిమందికి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ప్రిన్సిపాల్ ఓ లెక్చరర్ వద్ద లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఈ ఘటన మెదక్ పట్టణంలో సోమవారం సంచలనం సృష్టించింది. బాధిత లెక్చరర్ శ్రీనివాస్ కథనం ప్రకారం... శ్రీనివాస్ అనే వ్యక్తి మెదక్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్‌గా 15 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. 2008 నుంచి రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నాడు.
కానీ వేతనం మాత్రం మెదక్ జూనియర్ కళాశాలలోనే పొందాల్సి ఉంది. గతనెలకు సంబంధించి రూ.38,268ల వేతనం రావాల్సి ఉండగా ప్రిన్సిపాల్ రాఘవేంద్రస్వామి తనకు రూ.4 వేలు లంచం ఇస్తేనే ఫైల్‌పై సంతకం చేస్తానని మొండికేశాడు. చేసేది లేక లెక్చరర్ శ్రీనివాస్ ఈనెల 6న ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణను ఆశ్రయించారు. ఆయన సూచన మేరకు సోమవారం శ్రీనివాస్ రూ.4 వేలు లంచంగా ఇవ్వగా ప్రిన్సిపాల్ రాఘవేంద్రస్వామి తీసుకుని ఫైల్‌పై సంతకం చేశాడు.
అప్పటికే మాటువేసిన ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ నవీన్‌కుమార్‌లు ప్రిన్సిపాల్ రాఘవేంద్రస్వామిని పట్టుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. ప్రిన్సిపాల్ రాఘవేంద్రస్వామిని హైదరాబాద్ ఏసీబీ కోర్టుకు తరలిస్తామన్నారు.
లంచం ఇవ్వొద్దు
ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ఎవరు లంచం అడిగినా ఇవ్వకూడదని ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ సూచించారు. సోమవారం మెదక్ పట్టణ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఓ కాంట్రాక్టు లెక్చరర్ వద్ద రూ.4వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ మాట్లాడుతూ... లంచం ఎవరు అడిగినా వెంటనే 9440446149 నంబర్లో తమను సంప్రదించాలని సూచించారు. గత ఏడాది జిల్లాలో 16మంది అవినీతి అధికారులను అరెస్ట్ చేశామన్నారు.
ఈ యేడు జిల్లాలో మూడు కేసులు మాత్రమే నమోదైనట్టు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో మెదక్ కోర్టులో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తించే వ్యక్తి రూ.5వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. సిద్దిపేట మండలం తడ్కపల్లిలో ఓ పంచాయతీ అధికారి లంచం తీసుకుంటూ చిక్కాడు. తాజాగా మెదక్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రాఘవేంద్రస్వామి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఇలా ఈ యేడు మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి.