medal tally
-
ఎనిమిదో స్థానంలో భారత్
ఉత్సాహంగా జరుగుతున్న 17వ ఆసియా క్రీడల్లో భారతదేశం ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇంచియాన్లో జరుగుతున్న ఈ క్రీడల్లో మూడు నాలుగు రోజుల ముందువరకు భారత క్రీడాకారుల ఆటతీరు పెద్దగా చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోయినా వరుసపెట్టి స్వర్ణపతకాలు సాధిస్తూ క్రమంగా పతకాల పట్టికలో దేశం స్థానాన్ని పైకి తీసుకొచ్చారు. భారత దేశానికి ఇప్పటివరకు 11 స్వర్ణ పతకాలు, 10 రజత పతకాలు, 36 కాంస్య పతకాలు వచ్చాయి. మొత్తం 57 పతకాలు భారత ఖాతాలో పడ్డాయి. ఉత్తర కొరియా జట్టుకు 11 స్వర్ణాలు వచ్చి మొత్తం 36 పతకాలే ఉన్నా, రజత పతకాలు మాత్రం మనకంటే ఒకటి ఎక్కువగా 11 రావడంతో ఆ దేశం ఏడో స్థానంలో ఉంది. 149 స్వర్ణ పతకాలు, 107 రజత పతకాలు, 81 కాంస్య పతకాలు కలిపి మొత్తం 337 పతకాలతో చైనా అగ్రస్థానంలో నిలిచింది. దక్షిణ కొరియా, జపాన్ దేశాలు 228, 195 పతకాలతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. భారత జట్టు హాకీ, కబడ్డీ పోటీలలో స్వర్ణపతకాలు సాధించడంతో తన స్థానాన్ని మెరుగు పరుచుకోగలిగింది. -
పతకాల పట్టికలో మూడోస్థానం
ఆసియా క్రీడల్లో భారతదేశం మంచి బోణీ చేసింది. పోటీలు ప్రారంభమైన తొలిరోజే ఒక స్వర్ణం, ఒక రజతంతో మూడో స్థానంలో నిలిచింది. ఎప్పటిలాగే అగ్రస్థానంలో చైనా ఉండగా, రెండో స్థానంలో కొరియా ఉంది. చైనాకు మూడు స్వర్ణాలు, ఒక కాంస్య పతకం కలిపి నాలుగు పతకాలు లభించాయి. కొరియాకు ఒక స్వర్ణం, రెండు రజత పతకాలతో మొత్తం మూడు పతకాలు వచ్చాయి. భారత్ ఒక స్వర్ణం, ఒక రజతంతో రెండు పతకాలు సాధించింది. వియత్నాంకు కూడా రెండు పతకాలే వచ్చినా.. వాటిలో ఒక్కటీ స్వర్ణం లేదు. ఒక రజతం, ఒక కాంస్య పతకం మాత్రమే వచ్చాయి. దాంతో భారత్కు మూడో స్థానం, వియత్నాంకు నాలుగో స్థానం లభించాయి. వియత్నాం తర్వాతి స్థానంలో ఒక పతకంతో మకావు నిలిచింద. ఈ దేశానికి ఒక రజత పతకం లభించింది. ఈసారి ఆసియా క్రీడల్లో టాప్-5లో నిలవాలన్నది భారత జట్టు లక్ష్యంగా కనిపిస్తోంది. చైనా, కొరియా లాంటి దేశాల నుంచి వచ్చే పోటీని తట్టుకుని మరిన్ని అంశాల్లో పతకాలు కొడితే ఆ లక్ష్యం సాధించడం పెద్ద ఇబ్బంది కాబోదు.