
పతకాల పట్టికలో మూడోస్థానం
ఆసియా క్రీడల్లో భారతదేశం మంచి బోణీ చేసింది. పోటీలు ప్రారంభమైన తొలిరోజే ఒక స్వర్ణం, ఒక రజతంతో మూడో స్థానంలో నిలిచింది. ఎప్పటిలాగే అగ్రస్థానంలో చైనా ఉండగా, రెండో స్థానంలో కొరియా ఉంది. చైనాకు మూడు స్వర్ణాలు, ఒక కాంస్య పతకం కలిపి నాలుగు పతకాలు లభించాయి. కొరియాకు ఒక స్వర్ణం, రెండు రజత పతకాలతో మొత్తం మూడు పతకాలు వచ్చాయి.
భారత్ ఒక స్వర్ణం, ఒక రజతంతో రెండు పతకాలు సాధించింది. వియత్నాంకు కూడా రెండు పతకాలే వచ్చినా.. వాటిలో ఒక్కటీ స్వర్ణం లేదు. ఒక రజతం, ఒక కాంస్య పతకం మాత్రమే వచ్చాయి. దాంతో భారత్కు మూడో స్థానం, వియత్నాంకు నాలుగో స్థానం లభించాయి. వియత్నాం తర్వాతి స్థానంలో ఒక పతకంతో మకావు నిలిచింద. ఈ దేశానికి ఒక రజత పతకం లభించింది. ఈసారి ఆసియా క్రీడల్లో టాప్-5లో నిలవాలన్నది భారత జట్టు లక్ష్యంగా కనిపిస్తోంది. చైనా, కొరియా లాంటి దేశాల నుంచి వచ్చే పోటీని తట్టుకుని మరిన్ని అంశాల్లో పతకాలు కొడితే ఆ లక్ష్యం సాధించడం పెద్ద ఇబ్బంది కాబోదు.