MEDCHAL Region
-
నువ్వు నాతో సినిమాకొస్తే.. మీ నాన్న పింఛను ఇస్తా.. ఏమంటావ్ మరి
మేడ్చల్: తండ్రి పింఛనును తనకు మంజూరు చేయాలని కోరుతూ ట్రెజరీ కార్యాలయానికి వెళ్లిన ఓ యువతిని తనకున్న అధికారంతో లోబరచుకోవాలనుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. సదరు యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించగా తీవ్రంగా ప్రతిఘటించడంతో పలాయనం చిత్తగించాడు ఆ అధికారి. నాలుగు రోజుల క్రితం మేడ్చల్ ట్రెజరీ కార్యాలయం లో జరిగి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. బాధిత యువతి కథనం ప్రకారం..నగర శివారు ప్రాంతానికి చెందిన ఓ యువతి తండ్రి ప్రభు త్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్డ్ అయ్యి పింఛనును తీసుకుంటున్నారు. అయితే ఇటీవల అతడు మరణించడం, అంతకుముందే తల్లి కూడా చనిపోవడంతో యువతి అనాథగా మారింది. దీంతో తండ్రికి వచ్చే పింఛను తనకు మంజూరు చేయాలని కోరు తూ నాలుగు రోజుల క్రితం మేడ్చల్ ట్రెజరీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంది. తనతో సినిమాకు వస్తేనే పింఛను మంజూరు చేస్తానంటూ అక్కడ అదనపు ట్రెజరీ అధికారి (ఏటీవో)గా పనిచేస్తున్న పవన్ కుమార్ ఆ యువతిని లైంగికంగా వేధించారు. యువతి తీవ్రంగా ప్రతిఘటించడంతో సదరు అధికారి అక్కడ్నుంచి మెల్లగా జారుకున్నాడు. విషయాన్ని అక్కడి అధికారులకు, టీఆర్ఎస్ నాయకులకు చెప్పగా ఏటీవోకు యువతికి మధ్య రాజీకి ప్రయత్నించారే తప్ప అసలు విషయాన్ని బయటకు రానివ్వలేదు. అంతా అబద్ధం: యువతి వివాహం కాలేదని చెబుతూ పింఛను పొందాలని చూసిందని, నిబంధనల ప్రకారం ఆమె దరఖాస్తును తిరస్కరించి రికవరీకి ఆదేశాలివ్వడంతోనే ఆ యువతి తనపై లేనిపోని ఆరోపణలు చేస్తోందని ఏటీవో పవన్ కుమార్ వివరణ ఇచ్చారు. -
మాజీమంత్రి ఈటలపై మరో దర్యాప్తు
సాక్షి, హైదరాబాద్: మాజీమంత్రి ఈటల రాజేందర్‌పై మరో భూకబ్జా ఫిర్యాదు రావడంతో దర్యాప్తుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రాజేందర్ కుమారుడు నితిన్‌రెడ్డి తన భూమిని కబ్జా చేశారనీ, తనకు న్యాయం చేయాలని మేడ్చల్ మండలం రావల్కోల్ గ్రామానికి చెందిన పీట్ల మహేశ్ ముదిరాజ్ ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణమే దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్‌ను సీఎం ఆదేశించారు. ఏసీబీ, విజిలెన్స్, రెవెన్యూ విభాగాలు సమగ్ర దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని సీఎం సూచించారు. ఈటల బెదిరించారని ఫిర్యాదు సర్వే నంబర్ 77లోని 10.11 ఎకరాల భూమి 1954 ఖాస్రా పహాణి నుంచి 1986 అడంగల్ పహాణి వరకు తన తాత పేరు మీద ఉండగా, 1986 తర్వాత పహాణిలో సత్యం రామలింగారాజు, ఇతరుల పేర్లను రెవెన్యూ అధికారులు నమోదు చేశారని మహేశ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందులోని ఐదెకరాలను ఇటీ వల ఈటల రాజేందర్ తనయడు నితిన్‌రెడ్డి, మరో వ్యక్తి సాదా కేశవరెడ్డి కొనుగోలు చేశారని తెలిపారు. ఈ విషయంపై రాజేందర్‌ను కలసి గోడు వెళ్లబోసుకోగా, ఆయన తనను బెదిరించారని మహేశ్ పేర్కొన్నారు. -
జోరు పెరిగిన ‘టీఎస్’
- ఆర్టీఏ కార్యాలయంలో భారీగా వాహనాల రిజిస్ట్రేషన్లు - మేడ్చల్ రీజియన్‌కు టీఎస్ 07ఈబీ0001 సిరీస్ కేటాయింపు: ఆర్టీఓ శంకర్ మేడ్చల్ రూరల్: మేడ్చల్ ఆర్టీఏ కార్యాలయంలో తెలంగాణ స్టేట్ (టీఎస్) సిరీస్‌తో వాహనాల రిజిస్ట్రేషన్లు జోరుగా కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్రం సమ్మతించి జులై 2న అపాయింటెడ్ డే గా ప్రకటించడంతో వాహన యజమానులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం నిలిపివేశారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన అనంతరం రిజిస్ట్రేషన్ చేసుకొంటే తెలంగాణ సిరీస్ వస్తుందనే ఈ ప్రక్రియను వాయిదా వేసుకున్నారు. ఇటీవల టీఎస్ సిరీస్‌తో వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాకు టీఎస్ 07, 08 సిరీస్‌ను కేటాయించగా మేడ్చల్ ఆర్టీఏ కార్యాలయ పరిధికి టీఎస్ 07 కేటాయించినట్లు స్థానిక ఆర్టీఓ శంకర్ తెలిపారు. ఈ సిరీస్‌తోనే వాహనాలకు ఈ నెల 18 నుంచి రిజిస్ట్రేషన్లు చేపట్టినట్లు ఆయన చెప్పారు. వాహనదారులు ఒరిజనల్ పత్రాలతో కార్యాలయంలో సంప్రందించాలని శంకర్ సూచించారు. పాత వాహనదారులు ఆందోళన చెందవద్దు: ఆర్టీఓ శంకర్ పాత వాహనాల యజమానులు తమ పాత నంబర్ సిరీస్‌ను తొలంగించి టీఎస్ సిరీస్‌గా మార్చుకోవడంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్టీఓ శంకర్ తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్లు మాత్రమే చేస్తున్నామని, పాత వాహనాల సిరీస్ మార్పు చేయడానికి ఎటువంటి ఉత్తర్వులు అందలేదని వివరించారు. ద్విచక్ర వాహనాలకు మేడ్చల్ ఆర్టీఏ పరిధికి టీఎస్07 ఈబీ0001 రిజిస్ట్రేషన్ నంబరు నుంచి ప్రారంభమైందని, ట్రాన్స్పోర్ట్ వాహనాలకు టీఎస్07యూబీ 0001 నుంచిప్రారంభించామని ఆయన తెలిపారు. పాత వాహనాల సిరీస్ మార్పు కోసం ఉత్తర్వులు జారీ అయ్యే వరకు వాహనదారులు ఈ విషయమై ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని సూచించారు. కొందరు పాత వాహనాలకు ఏపీ స్థానంలో టీఎస్‌గా నంబరుప్లేటుపై మార్పు చేస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఆర్సీని మార్పు చేసిన అనంతరమే నంబర్‌ప్లేట్‌పై సిరీస్‌ను మార్పు చేసుకోవాలన్నారు.