medek
-
తెలంగాణలో ఆరో విడత ‘హరితహారం’
సాక్షి, మెదక్: తెలంగాణలో ఆరో విడత హరితహారం కార్యక్రమం ప్రారంభమయింది. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అల్ల నేరేడు మొక్క నాటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం 15 కోట్లుతో నిర్మించిన అర్బన్ పార్కును సీఎం ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు నర్సాపూర్ కు రోడ్డు మార్గాన సీఎం చేరుకున్నారు. రాష్ట్ర వ్యాపితంగా 230 కోట్ల మొక్కలు పెంచాలని నిర్ణయించారు. గత ఐదేళ్ల నుంచి 182 కోట్ల మొక్కలు నాటగా, ఈ సారి 48 కోట్ల మొక్కలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అడవుల పెంపకం పై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం ఒక యజ్ఞంలాగా చేపట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా 30 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. -
గోమాతకు శ్రీమంతం
పాపన్నపేట: మాతృత్వం ఓ వరం. ప్రసవం పునర్జన్మతో సమానం. అందుకే గర్భం దాల్చిన మహిళను ఇంటిల్లిపాది అపురూపంగా చూసుకుంటారు. ఐదో నెలలో శ్రీమంతం చేసి రకరకాల తినుబండారాలు చేసిపెట్టడం ఆనవాయితీ. అయితే లక్ష్మీనగర్ గ్రామ మహిళలు మాత్రం కాస్తా వెరైటీగా ఆలోచించి గోమాతకు శ్రీమంతం చేసి తమ జంతుప్రేమను చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం లక్ష్మినగర్‌లో గ్రామస్తులు తమదైన రీతిలో వినూత్న కార్యక్రమాలు చేపడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల గ్రామపుట్టినరోజు కార్యక్రమం నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించారు. అలాగే పవిత్రంగా పూజించే గోమాతకు గురువారం శ్రీమంతం చేశారు. మహిళలంతా ఒకచోటచేరి గోమాతను పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి తినుబండారాలు చేసి పెట్టారు. 'గ్రామీణ అన్నదాతలకు ఆవు బహుళ ప్రయోజనకారి. అందుకే నోరులేని ఆ సాధుజంతువుకు అపురూపమైన ఆతిథ్యం ఇవ్వాలనే ఆలోచన తమకు వచ్చింది' అని మహిళలు తెలిపారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
దౌల్తాబాద్: అప్పుల బాధ తాళలేక అన్నదాత బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం ముభారస్‌పూర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శేరిపల్లి నర్సింహులు(50) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో.. వాటిని తీర్చే దారికానరాక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.