medical counsil
-
లైబ్రరీ కుదింపు.. రీసెర్చ్ కనుమరుగు!
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో పరిశోధనలకు ఇక మంగళం పాడినట్లేనా? లైబ్రరీల్లో పుస్తకాలు రాన్రాను కనుమరుగేనా? పరిస్థితి చూస్తుంటే అలాగే ఉంది. 2021–22 వైద్య విద్యా సంవత్సరంలో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఎలాంటి నిబంధనలు పాటించాలన్న దానిపై కేంద్రం తాజాగా కొన్ని సవరణలు చేసింది. దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. సవరణ నిబంధనలను తాజాగా జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) విడుదల చేసింది. ఇప్పటివరకు తప్పనిసరిగా సెంట్రల్ రీసెర్చి ల్యాబ్ ఉండాలనే నిబంధనను తాజాగా మార్చేశారు. కాలేజీ అభీష్టం మేరకు దీనిపై నిర్ణయం తీసుకోవచ్చు. ఇది వైద్య పరిశోధనకు విఘాతం కలిగిస్తుందని అంటున్నారు. చదవండి: కొత్తగా 56 పీజీ వైద్య సీట్లు మంజూరు పరిశోధనలకు మంగళం? కొత్త నిబంధనల ప్రకారం మెడికల్ కాలేజీల్లో సెంట్రల్ రీసెర్చ్ లేబొరేటరీలు తప్పనిసరి కాదని పేర్కొన్నారు. అయితే, పూర్తిగా పరిశోధనలు వద్దనలేదని వైద్య నిపుణులు అంటున్నారు. నిజానికి మెడికల్ కాలేజీల్లోని సెంట్రల్ రీసెర్చ్ లేబొరేటరీల్లో జరిగే పరిశోధనల్లో కాలేజీల్లోఅధ్యాపకులుగా పనిచేసే అసిస్టెంట్ ప్రొఫెసర్లు,అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు, పరిశోధక విద్యార్థులు పాల్గొంటారు. బోధనాసుపత్రికి వచ్చే రోగులపై ఈ పరిశోధనలు జరుగుతుంటాయి. బోధనా సిబ్బందికి విలువైన సమాచారాన్ని అందించడానికి హై–స్పీడ్ గ్రాఫిక్ వర్క్‌స్టేషన్, హై–స్పీడ్ స్టాటిస్టిక్స్ డేటా ప్రాసెసింగ్ వర్క్స్టేషన్లు ఉంటాయి. వీటిలో క్లినికల్ ట్రయల్స్ కూడా నిర్వహిస్తారు. కొన్ని రోగాల్లో వచ్చే మార్పులను, కొత్త రోగాలపైనా క్లినికల్ రిసెర్చ్‌లు జరుగుతుంటాయి. వైద్య విద్యార్థుల్లో, బోధకుల్లో నైపుణ్యాన్ని, వ్యాధులపై అవగాహనను పెంచే ఇటువంటి పరిశోధనలను కొనసాగించాలని నిపుణులు అంటున్నారు. చదవండి: తెలంగాణ బ్రాండ్.. సర్కారీ మెడికల్ షాపులు! రెండేళ్లు ఆసుపత్రి నిర్వహిస్తేనే.. ఇప్పటివరకు మెడికల్ కాలేజీకి అనుమతి వచ్చాకే ఆసుపత్రిని ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంది. ఇకపై కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం రెండేళ్ల క్రితం ఏర్పాటుచేసి, అన్ని సౌకర్యాలతో నడుస్తున్న 300 పడకల ఆసుపత్రి తప్పనిసరిగా ఉండాలనేది కొత్త నిబంధన. పైగా రెండేళ్లూ 60 శాతం ఆక్యుపెన్సీ ఉండాలి. ఆసుపత్రి లేని కాలేజీల్లో విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జి కరువవుతోందన్న విమర్శల నేపథ్యంలో ఎన్ఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కనీసం 20–25 ఎకరాల స్థలం ఉండాలన్న నిబంధనను తొలగించారు. మెట్రోపాలిటన్ నగరాల్లో స్థల సమస్య వల్ల బహుళ అంతస్తులు నిర్మించి కాలేజీ నిర్వహించుకోవచ్చు. మెడికల్ కాలేజీల్లో కనీసం 24 శాఖలు ఉండాలి. ప్రతి కాలేజీకి తొలుత 100 – 150 సీట్లతో అనుమతిస్తారు. ఆపై సమకూర్చుకునే సౌకర్యాలనుబట్టి ఆ సంఖ్యను ఏటా పెంచుతారు. కొత్త కాలేజీల్లో లైబ్రరీ–పుస్తకాలు ఇలా.. కొత్తగా ఏర్పాటయ్యే వైద్య కళాశాలల్లో లైబ్రరీకి పెద్దగా స్థలం కేటాయించాల్సిన అవసరం లేదని తాజా సవరణల్లో ఉంది. పైగా వాటిలో పుస్తకాల సంఖ్యనూ తగ్గించేశారు. ప్రస్తుతం వంద సీట్లున్న మెడికల్ కాలేజీ లైబ్రరీలో 7 వేల పుస్తకాలు, 150 సీట్లున్న కాలేజీలో 11 వేలు, 200 సీట్లున్న కాలేజీలో 15 వేలు, 250 సీట్లున్న కాలేజీ లైబ్రరీలో 20 వేల పుస్తకాలు ఉన్నాయి. తాజా నిబంధనల ప్రకారం ఈ పుస్తకాల సంఖ్యను వరుసగా 3 వేలకు, 4,500కు, 6 వేలకు, 7 వేలకు కుదించారు. అలాగే లైబ్రరీ వైశాల్యాన్నీ తగ్గించేశారు. ప్రస్తుతం వంద సీట్ల కాలేజీలో 1,600 చదరపు మీటర్లు, 150 సీట్లున్న కాలేజీలో 2,400 చ.మీ. వైశాల్యంతో లైబ్రరీ ఉండాలి. కొత్త నిబంధనలో 100 నుంచి 150 సీట్లున్న కాలేజీల్లో లైబ్రరీ వైశాల్యాన్ని వెయ్యి చ.మీ.కు కుదించారు. ప్రస్తుతం 200 సీట్లున్న కాలేజీలో 3,200 చ.మీ., 250 సీట్లున్న కాలేజీలో 4 వేల చ.మీ. వైశాల్యంలో లైబ్రరీ ఉండగా, ఇకపై 200 నుంచి 250 సీట్లున్న కాలేజీల్లో 1,500 చదరపు మీటర్ల వైశాల్యంలోనే లైబ్రరీ ఏర్పాటు చేసుకోవచ్చు. అత్యవసర వైద్యం తప్పనిసరి ప్రతి కళాశాలలో 30 పడకలు అదనంగా ఎమర్జెన్సీ మెడిసిన్‌కు కేటాయించాలి. దీంతో అత్యవసర రోగులకు వైద్యసాయం అందుతుంది. అలాగే ఐదు పడకల ఐసీయూ, పీఐసీయూ వేర్వేరుగా ఉండాలి. ఫిజికల్ మెడికల్ రియాబిలిటేషన్ సెంటర్ గతంలో ఆప్షన్‌గా ఉండేది. ఇప్పుడు దాన్ని తప్పనిసరి చేశారు. స్కిల్ లేబొరేటరీని కొత్తగా చేర్చారు. వంద సీట్లున్న కళాశాలకు 19 విభాగాల్లో 400 పడకలు ఏర్పాటుచేయాలి. 150 సీట్లున్నచోట 600 పడకలు, 200 సీట్ల కళాశాలలో 800 పడకలు, 250 సీట్లున్నచోట వెయ్యి పడకలు తప్పనిసరి. వైద్య సిబ్బంది నివాస సదుపాయాలను కుదించారు. ఎమర్జెన్సీ స్టాఫ్ అందుబాటులో ఉండాలన్న నిబంధనను ఆప్షన్‌గా చేశారు. లెక్చర్ హాళ్లను తగ్గించేశారు. ఇక కొన్ని మెడికల్ విభాగాల్లో పడకల సంఖ్యను కుదించారు. అలాగే, ప్రతి ఏటా కాలేజీని తనిఖీ చేయాలనే నిబంధనను తాజాగా మార్చేశారు. వైద్య సిబ్బంది సంఖ్యను తగ్గించారు. డాక్టర్ల విషయం చెప్పలేదు కానీ, పారామెడికల్ సిబ్బందిని తగ్గించారు. ఇంకొన్ని నిబంధనలు విజిటింగ్ ఫ్యాకల్టీ సేవలను వినియోగించుకోవచ్చు. అన్ని మెడికల్ కాలేజీల్లో తప్పనిసరిగా ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు చేసే లేబొరేటరీ ఉండాలి. ఎమర్జెన్సీ విభాగంలో అదనపు ఫ్యాకల్టీని నియమించాలి.అన్ని మెడికల్ కాలేజీల్లో సీసీ కెమెరాల ద్వారా తరగతి గదులు, రోగులకు అందే వైద్యసేవల లైవ్ స్ట్రీమింగ్‌ను జాతీయ వైద్యమండలి ఆధ్వర్యంలో నడిచే డిజిటల్ మిషన్మోడ్ ప్రాజెక్టుతో అనుసంధానించాలి. అనాటమీ విభాగంలో భౌతికకాయాలను కోసి పరిశీలించేందుకు వీలుగా 50 శాతం విద్యార్థుల సామర్థ్యంతో డిసెక్షన్ హాల్ ఏర్పాటుచేయాలి. 400 చ.మీ. వైశాల్యంతో పోస్ట్‌మార్టం/అటాప్సీ బ్లాక్ ఉండాలి. విద్యార్థుల శిక్షణకు ప్రతి మెడికల్ కాలేజీకి అనుసంధానంగా ఒక ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఉండాలి. ఎయిర్ కండీషన్డ్ బ్లడ్‌బ్యాంక్ నిర్వహించాలి. 24 గంటల పార్మసీ సేవలు అందుబాటులో ఉంచాలి. పుస్తకాలు చదివేది తక్కువే డిజిటల్ యుగంలో చాలామంది ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లలో సమాచారం వెతుక్కుంటున్నారు. వాటిలోనే చదువుకుంటున్నారు. కాబట్టి పుస్తకాలు చదివేవారు తగ్గిపోయారు. అందుకే ఎన్ఎంసీ లైబ్రరీల వైశాల్యాన్ని కుదించింది. పుస్తకాల సంఖ్యను తగ్గించింది. పరిశోధనలను పూర్తిగా వద్దని చెప్పలేదు. – డాక్టర్ రమేష్‌రెడ్డి, వైద్యవిద్య సంచాలకుడు పరిశోధనలతోనే మేలు కొన్ని జబ్బులపై అసిస్టెంట్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు పరిశోధనలు చేసి థీసిస్‌లు సమర్పిస్తారు. వాటిని మెడికల్ జర్నల్స్‌ల్లో ప్రచురిస్తారు.ఆ మేరకే వారికి పదోన్నతులు లభిస్తాయి. మెడికల్ కాలేజీల్లో సెంట్రల్ రీసెర్చి లేబొరేటరీలు ఉంటే పరిశోధనలకు ఊపు వస్తుంది. – డాక్టర్ పుట్టా శ్రీనివాస్, డైరెక్టర్, మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీ -
సృష్టి కేసు: వెలుగులోకి కీలక అంశాలు
సాక్షి, విజయవాడ: యూనివర్సల్ సృష్టి ఆసుపత్రి లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చుస్తున్నాయి. పిల్లల అక్రమ విక్రయం, రవాణా ఆరోపణల కేసులో ప్రధాన నిందితురాలు ఆసుపత్రి ఎండీ డాక్టర్ పచ్చిపాల నమ్రతను పోలీసులు విచారిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బెజవాడ పోలీసులు జరిపిన లోతైన విచారణతో కీలక విషయాలు బయటకు వచ్చాయి. 2018లోనే ఇండియన్ మెడికల్ కౌన్సిల్ సృష్టి ఆసుపత్రి లైసెన్స్‌ను రద్దు చేసింది. అయినప్పటికి డాక్టర్ నమ్రతా వేరే వారి లైసెన్స్‌తో సృష్టి ఆసుపత్రిని గుట్టుచప్పుడుగా నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. (చదవండి: పేగుబంధంతో పైసలాట!) తెలంగాణలోని ఓ ఎన్ఆర్ఐకి టెస్ట్ ట్యూబ్ బేబీని ఇస్తామని చెప్పి మోసం చేయడంతో మెడికల్ కౌన్సిల్ చైర్మన్ రవీంద్ర రెడ్డి రద్దు చేసినట్లు పోలీసులు తెలిపారు. 2016 నుంచి ఇప్పటి వరకు సృష్టి ఆసుపత్రిలో 37 మంది పిల్లలు జన్మించారు. అయితే జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి పరిశీలన చేయకుండా, రెగ్యులర్ మానిటరింగ్ లేకుండానే రెన్యూవల్ చేసినట్లు పోలీసులు చెప్పారు. 2015లో సృష్టి అక్రమాలపై అప్పటి కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు స్పత్రిపై విచారణ జరిపి మెడికల్ కౌన్సిల్ రిపోర్టు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసులో ఇంకా విచారణ కొనసాగుతుందని ఈ నేపథ్యంలో మరికొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: ‘సృష్టి’ తీగలాగితే.. ‘పద్మశ్రీ’ డొంక వెలుగులోకి... ) -
సుమోటోగా విశాఖ ‘సృష్టి’ కేసు
సాక్షి, అమరావతి/విశాఖ : అక్రమంగా శిశువులను విక్రయిస్తూ పట్టుబడిన విశాఖపట్నం యూనివర్సల్ సృష్టి టెస్ట్‌ట్యూబ్ బేబీ ఆస్పత్రి కేసును సుమోటోగా విచారణకు స్వీకరించాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ నిర్ణయించింది. గత వారం రోజులుగా తీవ్ర సంచలనం రేపుతున్న ఈ కేసును పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా తీసుకుని విచారణ చేయనున్నారు. అలాగే ఈ కేసులో కీలక ముద్దాయిగా ఉన్న ఆస్పత్రి ఎండీ డాక్టర్ పి.నమ్రత వైద్య డిగ్రీని తక్షణమే సస్పండ్ చేయాలని మెడికల్ కౌన్సిల్ నిర్ణయించింది. ఇలాంటి కేసులను ఉపేక్షించేది లేదని, దీనిపై లోతుగా విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డా.బి.సాంబశివారెడ్డి ‘సాక్షి’తో అన్నారు. (సృష్టి: వెలుగులోకి ముగ్గురు మహిళా వైద్యులు పాత్ర) పోలీస్ కస్టడీకి డాక్టర్ నమ్రత ‘సృష్టి’ హాస్పిటల్ ఎండీ డాక్టర్ పి.నమ్రతను విచారణ నిమిత్తం మహారాణిపేట పోలీసులు గురువారం కేంద్ర కారాగారం నుంచి తమ కస్టడీలోకి తీసుకున్నారు.ఇప్పటివరకు సంతానం కావాలని హాస్పిటల్‌కు వచ్చిన 63 మందితో సరగోసి పద్ధతిలో పిల్లల్ని సమకూర్చేందుకు డా.నమ్రత ఒప్పందం కుదుర్చుకుందని, ఈ మేరకు పద్మజ హాస్పటల్‌కు చెందిన డాక్టర్ పద్మజతో కలసి నేరాలకు పాల్పడినట్లు తెలిసిందని నగర పోలీస్ కమిషనర్ ఆర్.కె.మీనా తెలిపారు.ఇప్పటికే ఈ కేసులో డాక్టర్ తిరుమల, రామకృష్ణ, కోడె వెంకటలక్ష్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు గురువారం డాక్టర్ పద్మజతో పాటు ఏజెంటుగా వ్యవహరించిన ఎన్.నూకరత్నంను అదుపులోకి తీసుకున్నారు. (పేగుబంధంతో పైసలాట!) -
తెలంగాణలో మరో 7 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వైద్య విద్యకు మహర్దశ పట్టనుంది. వైద్య విద్యకు హబ్‌గా రాష్ట్రం ఎదుగుతోంది. కేవలం ప్రైవేటు వైద్య సీట్లే కాకుండా ప్రభుత్వ సీట్లు పెంచుకునే దిశగా సర్కారు అడుగులు వేస్తోంది. దీనికి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే నడుం బిగించారు. రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వస్తే కొత్తగా 7 చోట్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వనపర్తి, జనగాం, జగిత్యాల, సంగారెడ్డి, ఆసిఫాబాద్, రామగుండం, తాండూరుల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచి తిరిగి అధికారాన్ని కైవసం చేసుకోవడంతో హామీని నెరవెర్చే దిశగా ముఖ్యమంత్రి సన్నద్ధం అవుతున్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలే ఉన్నాయి. ఆ తర్వాత మహబూబ్‌నగర్, సిద్దిపేట, సూర్యాపేట, నల్లగొండల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సీఎం శ్రీకారం చుట్టారు. వీటిలో మహబూబ్‌నగర్, సిద్దిపేటల్లో కాలేజీలు ఇప్పటికే ప్రారంభం కాగా, నల్లగొండ, సూర్యాపేటల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. అంతేకాదు బీబీనగర్‌లో ప్రతిష్టాత్మక ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్రం ఇటీవల పచ్చజెండా ఊపింది. అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి అదే ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ ప్రవేశాలు ప్రారంభం కానున్నాయి. దీనికోసం కేంద్రం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. వీటికితోడు ముఖ్యమంత్రి ఎన్నికల హామీ మేరకు మరో 7 మెడికల్ కాలేజీలు ఏర్పాటైతే వైద్య విద్యలో తెలంగాణ కొత్త చరిత్రకు నాంది పలకనుందని వైద్య నిపుణులు అంటున్నారు. ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు రెట్టింపు.. కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటైతే ప్రభుత్వ రంగంలో ఎంబీబీఎస్ సీట్లు దాదాపు రెట్టింపు కానున్నాయి. ఒక్కో కాలేజీకి 150 చొప్పున ఏడింటికి కలిపి రాష్ట్రంలో అదనంగా మరో 1,050 ఎంబీబీఎస్ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని మెడికల్ కళాశాల్లో 1,150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా నల్లగొండ, సూర్యాపేట మెడికల్ కాలేజీల్లో వచ్చే ఏడాది నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. దీంతో మరో 300 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. అలాగే బీబీనగర్ ఎయిమ్స్ ఏర్పాటుతో అక్కడ మరో 100 సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఇవన్నీ కలిపితే మొత్తం ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు 2,600 అందుబాటులోకి వస్తాయి. అంటే రాష్ట్రంలో 15 ప్రైవేటు మెడికల్ కాలేజీలలో ప్రస్తుతం ఉన్న 2,100 ఎంబీబీఎస్ సీట్ల కంటే ప్రభుత్వ సీట్లే అధికం కానున్నాయి. ఆ మేరకు పేద విద్యార్థులు తక్కువ ఫీజుతో ప్రభుత్వ వైద్య విద్య అభ్యసించే అవకాశాలు ఏర్పడతాయి. మొత్తం సీట్లలో 85 శాతం నీట్లో అర్హత పొందిన రాష్ట్ర విద్యార్థులకు దక్కనున్నందున ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే కసరత్తు చేస్తోంది. ముఖ్యమంత్రి హామీ ప్రకారం ఆయా ప్రాంతాల్లో ఎక్కడెక్కడ కాలేజీ ఏర్పాటుకు అవకాశాలున్నాయో పరిశీలన చేస్తున్నారు. సంబంధిత జిల్లాల నుంచి సమాచారం తెప్పించుకుంటున్నారు. ప్రభుత్వ భూమి ఉంటే సేకరించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. కాగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిబంధనల ప్రకారం మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ఒక్కో దానికి రూ.450 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. మౌలిక సదుపాయాల కల్పన, నిర్మాణాల పూర్తికి దాదాపు రెండేళ్ల సమయం పడుతుంది. పెరగనున్న పడకలు.. మెడికల్ కాలేజీల ఏర్పాటుతో వైద్య విద్య మెరుగుపడటమే కాకుండా గ్రామీణ వైద్యానికి మహర్దశ పట్టనుంది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా దానికి అనుబంధంగా 300 పడకల ఆస్పత్రి ఉండాలి. ఒకవేళ లేనట్లయితే ఆ ప్రాంతంలో ఉన్న ఏరియా ఆస్పత్రిని ఆధునీకరించాల్సి ఉంటుంది. అధునాతన పరికరాలు, మెరుగైన వసతులతోపాటు నిపుణులైన వైద్యులతో ఆయా ఆస్పత్రులను ఏర్పాటు చేయాలి. ఇది ఆయా ప్రాంతాల ప్రజలకు వరం కానుంది. -
అవును.. అత్యాచారం జరిగింది!
సౌదీ అరేబియా రాయబారి ఇంట్లో ఇద్దరు నేపాలీ యువతులపై రాయబారి జరిపిన లైంగిక వేధింపులు, అత్యాచారం నిరూపితం అయ్యాయి. బాధిత యువతులపై లైంగిక దాడి జరిగిందని రెండు వైద్య మండళ్లు ఇచ్చిన నివేదికలు వెల్లడించాయి. బాధితులను ఓ గైనకాలజిస్ట్, నలుగురు సభ్యుల వైద్య బోర్డు పరిశీలించింది. పరీక్షల అనంతరం బాధితులపై లైంగిక వేధింపులు, రేప్ జరిగినట్లు వైద్యమండలి ధ్రువీకరించింది. వారి దుస్తులు చిరిగిపోయి ఉన్నాయని, వారి ఒంటి నిండా గాయాలతోపాటు, వారు వివిధరకాల అంటువ్యాధులతో కూడా బాధపడుతున్నారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో హర్యానా పోలీసుల విచారణకు సహకరించాలని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్, సౌదీ దౌత్యవేత్త సౌద్ మహమ్మద్ అల్సాతీని కోరారు. గుర్గావ్ పోలీసులు... ఈ ఘటనపై విదేశీ వ్యవవహారాల శాఖకు పూర్తి నివేదిక అందజేశారు. అయితే దీన్ని సౌదీ దౌత్య కార్యాలయం ఖండించింది. హర్యానా పోలీసులు దౌత్య నిబంధనలు ఉల్లంఘించారని, ఇంట్లోకి అనుమతి లేకుండా వచ్చి దాడిచేశారని అంటోంది. మీడియా నివేదికలపైనా సౌదీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరో అడుగు ముందుకేసి హిందూ మతాధికారాన్ని అవకాశంగా తీసుకొని, దౌత్యవేత్తకు వ్యతిరేకంగా పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తోంది. జరిగినది భయంకర నేరమైనా... కేసులో సున్నితత్వం ఉండటంతో సౌదీ పత్రికలు విషయాన్ని వ్యంగ్యంగా చిత్రీకరిస్తున్నాయి. భారత అధికారుల తీరును విమర్శిస్తున్నాయి. రెండు రోజుల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన హింసాత్మక సంఘటనను రెండు ఇంగ్లీష్ పత్రికలు రెండు రోజులపాటు మొదటి పేజీ వార్తగా ప్రచురించాయి. అయితే, అక్కడ జరిగిన సంఘటన కంటే, అధికారుల ఓవర్ యాక్షన్ ఎక్కువగా ఉందంటూ ఆ కథనాల్లో వ్యాఖ్యనాలు చేశాయి. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న దౌత్యవేత్త భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులను కలిసి.. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, వియన్నా ఒప్పందానికి విరుద్ధంగా పోలీసులు తన నివాసంలోకి చొరబడ్డారని ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం భారత్‌లో సౌదీ దౌత్యవేత్తపై వచ్చిన అత్యాచార ఆరోపణలు మూడు దేశాల నడుమ దౌత్య యుద్ధానికి దారి తీస్తున్నాయి. బాధిత మహిళలు నేపాల్‌కు చెందిన వారు కావడంతో ఆ దేశంతో సంప్రదించి ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని భారత్ విదేశీ వ్యవహారాల శాఖ భావిస్తోంది.