లైబ్రరీ కుదింపు.. రీసెర్చ్‌ కనుమరుగు! | Detailed Note On Medical Colleges Terms In Telangana | Sakshi
Sakshi News home page

లైబ్రరీ కుదింపు.. రీసెర్చ్‌ కనుమరుగు!

Published Mon, Nov 2 2020 8:22 AM | Last Updated on Mon, Nov 2 2020 8:22 AM

Detailed Note On Medical Colleges Terms In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో పరిశోధనలకు ఇక మంగళం పాడినట్లేనా? లైబ్రరీల్లో పుస్తకాలు రాన్రాను కనుమరుగేనా? పరిస్థితి చూస్తుంటే అలాగే ఉంది. 2021–22 వైద్య విద్యా సంవత్సరంలో కొత్త మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు ఎలాంటి నిబంధనలు పాటించాలన్న దానిపై కేంద్రం తాజాగా కొన్ని సవరణలు చేసింది. దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. సవరణ నిబంధనలను తాజాగా జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) విడుదల చేసింది. ఇప్పటివరకు తప్పనిసరిగా సెంట్రల్‌ రీసెర్చి ల్యాబ్‌ ఉండాలనే నిబంధనను తాజాగా మార్చేశారు. కాలేజీ అభీష్టం మేరకు దీనిపై నిర్ణయం తీసుకోవచ్చు. ఇది వైద్య పరిశోధనకు విఘాతం కలిగిస్తుందని అంటున్నారు. చదవండి: కొత్తగా 56 పీజీ వైద్య సీట్లు మంజూరు

పరిశోధనలకు మంగళం? 
కొత్త నిబంధనల ప్రకారం మెడికల్‌ కాలేజీల్లో సెంట్రల్‌ రీసెర్చ్‌ లేబొరేటరీలు తప్పనిసరి కాదని పేర్కొన్నారు. అయితే, పూర్తిగా పరిశోధనలు వద్దనలేదని వైద్య నిపుణులు అంటున్నారు. నిజానికి మెడికల్‌ కాలేజీల్లోని సెంట్రల్‌ రీసెర్చ్‌ లేబొరేటరీల్లో జరిగే పరిశోధనల్లో కాలేజీల్లోఅధ్యాపకులుగా పనిచేసే అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు,అసోసియేట్‌ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు, పరిశోధక విద్యార్థులు పాల్గొంటారు. బోధనాసుపత్రికి వచ్చే రోగులపై ఈ పరిశోధనలు జరుగుతుంటాయి. బోధనా సిబ్బందికి విలువైన సమాచారాన్ని అందించడానికి హై–స్పీడ్‌ గ్రాఫిక్‌ వర్క్‌స్టేషన్, హై–స్పీడ్‌ స్టాటిస్టిక్స్‌ డేటా ప్రాసెసింగ్‌ వర్క్‌స్టేషన్లు ఉంటాయి. వీటిలో క్లినికల్‌ ట్రయల్స్‌ కూడా నిర్వహిస్తారు. కొన్ని రోగాల్లో వచ్చే మార్పులను, కొత్త రోగాలపైనా క్లినికల్‌ రిసెర్చ్‌లు జరుగుతుంటాయి. వైద్య విద్యార్థుల్లో, బోధకుల్లో నైపుణ్యాన్ని, వ్యాధులపై అవగాహనను పెంచే ఇటువంటి పరిశోధనలను కొనసాగించాలని నిపుణులు అంటున్నారు. చదవండి: తెలంగాణ బ్రాండ్‌.. సర్కారీ మెడికల్‌ షాపులు!

రెండేళ్లు ఆసుపత్రి నిర్వహిస్తేనే..
ఇప్పటివరకు మెడికల్‌ కాలేజీకి అనుమతి వచ్చాకే ఆసుపత్రిని ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంది. ఇకపై కొత్త మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం రెండేళ్ల క్రితం ఏర్పాటుచేసి, అన్ని సౌకర్యాలతో నడుస్తున్న 300 పడకల ఆసుపత్రి తప్పనిసరిగా ఉండాలనేది కొత్త నిబంధన. పైగా రెండేళ్లూ 60 శాతం ఆక్యుపెన్సీ ఉండాలి. ఆసుపత్రి లేని కాలేజీల్లో విద్యార్థులకు ప్రాక్టికల్‌ నాలెడ్జి కరువవుతోందన్న విమర్శల నేపథ్యంలో ఎన్‌ఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు కనీసం 20–25 ఎకరాల స్థలం ఉండాలన్న నిబంధనను తొలగించారు. మెట్రోపాలిటన్‌ నగరాల్లో స్థల సమస్య వల్ల బహుళ అంతస్తులు నిర్మించి కాలేజీ నిర్వహించుకోవచ్చు. మెడికల్‌ కాలేజీల్లో కనీసం 24 శాఖలు ఉండాలి. ప్రతి కాలేజీకి తొలుత 100 – 150 సీట్లతో అనుమతిస్తారు. ఆపై సమకూర్చుకునే సౌకర్యాలనుబట్టి ఆ సంఖ్యను ఏటా పెంచుతారు. 

కొత్త కాలేజీల్లో లైబ్రరీ–పుస్తకాలు ఇలా.. 
కొత్తగా ఏర్పాటయ్యే వైద్య కళాశాలల్లో లైబ్రరీకి పెద్దగా స్థలం కేటాయించాల్సిన అవసరం లేదని తాజా సవరణల్లో ఉంది. పైగా వాటిలో పుస్తకాల సంఖ్యనూ తగ్గించేశారు. ప్రస్తుతం వంద సీట్లున్న మెడికల్‌ కాలేజీ లైబ్రరీలో 7 వేల పుస్తకాలు, 150 సీట్లున్న కాలేజీలో 11 వేలు, 200 సీట్లున్న కాలేజీలో 15 వేలు, 250 సీట్లున్న కాలేజీ లైబ్రరీలో 20 వేల పుస్తకాలు ఉన్నాయి. తాజా నిబంధనల ప్రకారం ఈ పుస్తకాల సంఖ్యను వరుసగా 3 వేలకు, 4,500కు, 6 వేలకు, 7 వేలకు కుదించారు. అలాగే లైబ్రరీ వైశాల్యాన్నీ తగ్గించేశారు. ప్రస్తుతం వంద సీట్ల కాలేజీలో 1,600 చదరపు మీటర్లు, 150 సీట్లున్న కాలేజీలో 2,400 చ.మీ. వైశాల్యంతో లైబ్రరీ ఉండాలి. కొత్త నిబంధనలో 100 నుంచి 150 సీట్లున్న కాలేజీల్లో లైబ్రరీ వైశాల్యాన్ని వెయ్యి చ.మీ.కు కుదించారు. ప్రస్తుతం 200 సీట్లున్న కాలేజీలో 3,200 చ.మీ., 250 సీట్లున్న కాలేజీలో 4 వేల చ.మీ. వైశాల్యంలో లైబ్రరీ ఉండగా, ఇకపై 200 నుంచి 250 సీట్లున్న కాలేజీల్లో 1,500 చదరపు మీటర్ల వైశాల్యంలోనే లైబ్రరీ ఏర్పాటు చేసుకోవచ్చు. 

అత్యవసర వైద్యం తప్పనిసరి 
ప్రతి కళాశాలలో 30 పడకలు అదనంగా ఎమర్జెన్సీ మెడిసిన్‌కు కేటాయించాలి. దీంతో అత్యవసర రోగులకు వైద్యసాయం అందుతుంది. అలాగే ఐదు పడకల ఐసీయూ, పీఐసీయూ వేర్వేరుగా ఉండాలి. ఫిజికల్‌ మెడికల్‌ రియాబిలిటేషన్‌ సెంటర్‌ గతంలో ఆప్షన్‌గా ఉండేది. ఇప్పుడు దాన్ని తప్పనిసరి చేశారు. స్కిల్‌ లేబొరేటరీని కొత్తగా చేర్చారు. వంద సీట్లున్న కళాశాలకు 19 విభాగాల్లో 400 పడకలు ఏర్పాటుచేయాలి. 150 సీట్లున్నచోట 600 పడకలు, 200 సీట్ల కళాశాలలో 800 పడకలు, 250 సీట్లున్నచోట వెయ్యి పడకలు తప్పనిసరి.  వైద్య సిబ్బంది నివాస సదుపాయాలను కుదించారు. ఎమర్జెన్సీ స్టాఫ్‌ అందుబాటులో ఉండాలన్న నిబంధనను ఆప్షన్‌గా చేశారు. లెక్చర్‌ హాళ్లను తగ్గించేశారు. ఇక కొన్ని మెడికల్‌ విభాగాల్లో పడకల సంఖ్యను కుదించారు. అలాగే, ప్రతి ఏటా కాలేజీని తనిఖీ చేయాలనే నిబంధనను తాజాగా మార్చేశారు. వైద్య సిబ్బంది సంఖ్యను తగ్గించారు. డాక్టర్ల విషయం చెప్పలేదు కానీ, పారామెడికల్‌ సిబ్బందిని తగ్గించారు.  

ఇంకొన్ని నిబంధనలు 
విజిటింగ్‌ ఫ్యాకల్టీ సేవలను వినియోగించుకోవచ్చు. అన్ని మెడికల్‌ కాలేజీల్లో తప్పనిసరిగా ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షలు చేసే లేబొరేటరీ ఉండాలి. ఎమర్జెన్సీ విభాగంలో అదనపు ఫ్యాకల్టీని నియమించాలి.అన్ని మెడికల్‌ కాలేజీల్లో సీసీ కెమెరాల ద్వారా తరగతి గదులు, రోగులకు అందే వైద్యసేవల లైవ్‌ స్ట్రీమింగ్‌ను జాతీయ వైద్యమండలి ఆధ్వర్యంలో నడిచే డిజిటల్‌ మిషన్‌మోడ్‌ ప్రాజెక్టుతో అనుసంధానించాలి. అనాటమీ విభాగంలో భౌతికకాయాలను కోసి పరిశీలించేందుకు వీలుగా 50 శాతం విద్యార్థుల సామర్థ్యంతో డిసెక్షన్‌ హాల్‌ ఏర్పాటుచేయాలి. 400 చ.మీ. వైశాల్యంతో పోస్ట్‌మార్టం/అటాప్సీ బ్లాక్‌ ఉండాలి. విద్యార్థుల శిక్షణకు ప్రతి మెడికల్‌ కాలేజీకి అనుసంధానంగా ఒక ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఉండాలి. ఎయిర్‌ కండీషన్డ్‌ బ్లడ్‌బ్యాంక్‌ నిర్వహించాలి. 24 గంటల పార్మసీ సేవలు అందుబాటులో ఉంచాలి.

పుస్తకాలు చదివేది తక్కువే 
డిజిటల్‌ యుగంలో చాలామంది ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌ ఫోన్లలో సమాచారం వెతుక్కుంటున్నారు. వాటిలోనే  చదువుకుంటున్నారు. కాబట్టి పుస్తకాలు చదివేవారు తగ్గిపోయారు. అందుకే ఎన్‌ఎంసీ లైబ్రరీల వైశాల్యాన్ని కుదించింది. పుస్తకాల సంఖ్యను తగ్గించింది. పరిశోధనలను పూర్తిగా వద్దని చెప్పలేదు. 
– డాక్టర్‌ రమేష్‌రెడ్డి, వైద్యవిద్య సంచాలకుడు 

పరిశోధనలతోనే మేలు 
కొన్ని జబ్బులపై అసిస్టెంట్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు పరిశోధనలు చేసి థీసిస్‌లు సమర్పిస్తారు. వాటిని మెడికల్‌ జర్నల్స్‌ల్లో ప్రచురిస్తారు.ఆ మేరకే వారికి పదోన్నతులు లభిస్తాయి. మెడికల్‌ కాలేజీల్లో సెంట్రల్‌ రీసెర్చి లేబొరేటరీలు ఉంటే పరిశోధనలకు ఊపు వస్తుంది. 
– డాక్టర్‌ పుట్టా శ్రీనివాస్, డైరెక్టర్, మహబూబ్‌నగర్‌ మెడికల్‌ కాలేజీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement