అవును.. అత్యాచారం జరిగింది!
సౌదీ అరేబియా రాయబారి ఇంట్లో ఇద్దరు నేపాలీ యువతులపై రాయబారి జరిపిన లైంగిక వేధింపులు, అత్యాచారం నిరూపితం అయ్యాయి. బాధిత యువతులపై లైంగిక దాడి జరిగిందని రెండు వైద్య మండళ్లు ఇచ్చిన నివేదికలు వెల్లడించాయి. బాధితులను ఓ గైనకాలజిస్ట్, నలుగురు సభ్యుల వైద్య బోర్డు పరిశీలించింది. పరీక్షల అనంతరం బాధితులపై లైంగిక వేధింపులు, రేప్ జరిగినట్లు వైద్యమండలి ధ్రువీకరించింది. వారి దుస్తులు చిరిగిపోయి ఉన్నాయని, వారి ఒంటి నిండా గాయాలతోపాటు, వారు వివిధరకాల అంటువ్యాధులతో కూడా బాధపడుతున్నారని పోలీసులు తెలిపారు.
ఈ కేసులో హర్యానా పోలీసుల విచారణకు సహకరించాలని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్, సౌదీ దౌత్యవేత్త సౌద్ మహమ్మద్ అల్సాతీని కోరారు. గుర్గావ్ పోలీసులు... ఈ ఘటనపై విదేశీ వ్యవవహారాల శాఖకు పూర్తి నివేదిక అందజేశారు. అయితే దీన్ని సౌదీ దౌత్య కార్యాలయం ఖండించింది. హర్యానా పోలీసులు దౌత్య నిబంధనలు ఉల్లంఘించారని, ఇంట్లోకి అనుమతి లేకుండా వచ్చి దాడిచేశారని అంటోంది. మీడియా నివేదికలపైనా సౌదీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరో అడుగు ముందుకేసి హిందూ మతాధికారాన్ని అవకాశంగా తీసుకొని, దౌత్యవేత్తకు వ్యతిరేకంగా పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తోంది.
జరిగినది భయంకర నేరమైనా... కేసులో సున్నితత్వం ఉండటంతో సౌదీ పత్రికలు విషయాన్ని వ్యంగ్యంగా చిత్రీకరిస్తున్నాయి. భారత అధికారుల తీరును విమర్శిస్తున్నాయి. రెండు రోజుల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన హింసాత్మక సంఘటనను రెండు ఇంగ్లీష్ పత్రికలు రెండు రోజులపాటు మొదటి పేజీ వార్తగా ప్రచురించాయి. అయితే, అక్కడ జరిగిన సంఘటన కంటే, అధికారుల ఓవర్ యాక్షన్ ఎక్కువగా ఉందంటూ ఆ కథనాల్లో వ్యాఖ్యనాలు చేశాయి. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న దౌత్యవేత్త భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులను కలిసి.. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, వియన్నా ఒప్పందానికి విరుద్ధంగా పోలీసులు తన నివాసంలోకి చొరబడ్డారని ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం భారత్‌లో సౌదీ దౌత్యవేత్తపై వచ్చిన అత్యాచార ఆరోపణలు మూడు దేశాల నడుమ దౌత్య యుద్ధానికి దారి తీస్తున్నాయి. బాధిత మహిళలు నేపాల్‌కు చెందిన వారు కావడంతో ఆ దేశంతో సంప్రదించి ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని భారత్ విదేశీ వ్యవహారాల శాఖ భావిస్తోంది.