టొరంటో: సౌదీఅరేబియాలో మహిళలను బానిసలుగా చూస్తారని ఆ దేశ యువతి రహాఫ్ ముహమ్మద్ అల్‌ఖునన్(18) అన్నారు. ఇంట్లో వేధింపులు తాళలేక పారిపోయి వచ్చి.. బ్యాంకాక్‌లోని ఎయిర్‌పోర్ట్‌లో దాక్కుని తన సమస్యను ఐరాస దృష్టికి తెచ్చిన రహాఫ్‌కు కెనడా ఆశ్రయం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో అంతర్జాతీయంగా వార్తలో నిలిచిన రహాఫ్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను చేసిన రిస్క్‌కు తగిన ప్రతిఫలం దక్కిందని వ్యాఖ్యానించారు.
‘నా కుటుంబ సభ్యులు నన్ను చంపేస్తారనే భయంతోనే థాయ్‌లాండ్‌కు పారిపోయి వచ్చాను. అందుకే నన్ను తీసుకెళ్లడానికి బ్యాంకాక్‌కు వచ్చిన సోదరుడు, తండ్రితో వెళ్లలేదని అన్నారు. ఇకపై కెనడాలోనే చదువుకుని.. ఉద్యోగం చేస్తూ.. సాధారణ జీవితం గడపాలని ఉంది. కెనడాలో జీవించడం చాలా బాగుంది. సౌదీలో ఉంటే నా కలలు కలలుగానే మిగిలిపోయేవి. ఇక్కడ నాకు లభించిన స్వాగతం చూస్తుంటే నాకు మళ్లీ పుట్టినట్టు అనిపిస్తుంద’ని రహాఫ్ తెలిపారు.
కాగా, ఇంట్లో వేధింపులకు తాళలేక రహాఫ్ గతవారం థాయ్‌లాండ్‌కు పారిపోయిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి ఆస్ట్రేలియా వెళ్లాలనుకున్న ఆమెను సరైన పత్రాలు లేకపోవడంతో థాయ్‌లాండ్ ఎయిర్‌పోర్ట్ అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఆమె బ్యాంకాక్ ఎయిర్‌పోర్ట్ హోటల్ గదిలో దాక్కుని తన పరిస్థితిని సోషల్ మీడియా ద్వారా ఐరాస, మీడియా దృష్టికి తీసుకెళ్లారు. ఐరాస శరణార్థి సంస్థ చొరవతో కెనడా రహాఫ్‌కు ఆశ్రయం కల్పించేందుకు ముందుకు వచ్చింది. దీంతో ఆమె శనివారం కెనడాకు చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment