సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వైద్య విద్యకు మహర్దశ పట్టనుంది. వైద్య విద్యకు హబ్‌గా రాష్ట్రం ఎదుగుతోంది. కేవలం ప్రైవేటు వైద్య సీట్లే కాకుండా ప్రభుత్వ సీట్లు పెంచుకునే దిశగా సర్కారు అడుగులు వేస్తోంది. దీనికి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే నడుం బిగించారు. రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వస్తే కొత్తగా 7 చోట్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వనపర్తి, జనగాం, జగిత్యాల, సంగారెడ్డి, ఆసిఫాబాద్, రామగుండం, తాండూరుల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచి తిరిగి అధికారాన్ని కైవసం చేసుకోవడంతో హామీని నెరవెర్చే దిశగా ముఖ్యమంత్రి సన్నద్ధం అవుతున్నారు.
తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలే ఉన్నాయి. ఆ తర్వాత మహబూబ్‌నగర్, సిద్దిపేట, సూర్యాపేట, నల్లగొండల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సీఎం శ్రీకారం చుట్టారు. వీటిలో మహబూబ్‌నగర్, సిద్దిపేటల్లో కాలేజీలు ఇప్పటికే ప్రారంభం కాగా, నల్లగొండ, సూర్యాపేటల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. అంతేకాదు బీబీనగర్‌లో ప్రతిష్టాత్మక ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్రం ఇటీవల పచ్చజెండా ఊపింది. అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి అదే ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ ప్రవేశాలు ప్రారంభం కానున్నాయి. దీనికోసం కేంద్రం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. వీటికితోడు ముఖ్యమంత్రి ఎన్నికల హామీ మేరకు మరో 7 మెడికల్ కాలేజీలు ఏర్పాటైతే వైద్య విద్యలో తెలంగాణ కొత్త చరిత్రకు నాంది పలకనుందని వైద్య నిపుణులు అంటున్నారు.
ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు రెట్టింపు..
కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటైతే ప్రభుత్వ రంగంలో ఎంబీబీఎస్ సీట్లు దాదాపు రెట్టింపు కానున్నాయి. ఒక్కో కాలేజీకి 150 చొప్పున ఏడింటికి కలిపి రాష్ట్రంలో అదనంగా మరో 1,050 ఎంబీబీఎస్ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని మెడికల్ కళాశాల్లో 1,150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా నల్లగొండ, సూర్యాపేట మెడికల్ కాలేజీల్లో వచ్చే ఏడాది నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. దీంతో మరో 300 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. అలాగే బీబీనగర్ ఎయిమ్స్ ఏర్పాటుతో అక్కడ మరో 100 సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఇవన్నీ కలిపితే మొత్తం ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు 2,600 అందుబాటులోకి వస్తాయి.
అంటే రాష్ట్రంలో 15 ప్రైవేటు మెడికల్ కాలేజీలలో ప్రస్తుతం ఉన్న 2,100 ఎంబీబీఎస్ సీట్ల కంటే ప్రభుత్వ సీట్లే అధికం కానున్నాయి. ఆ మేరకు పేద విద్యార్థులు తక్కువ ఫీజుతో ప్రభుత్వ వైద్య విద్య అభ్యసించే అవకాశాలు ఏర్పడతాయి. మొత్తం సీట్లలో 85 శాతం నీట్‌లో అర్హత పొందిన రాష్ట్ర విద్యార్థులకు దక్కనున్నందున ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే కసరత్తు చేస్తోంది. ముఖ్యమంత్రి హామీ ప్రకారం ఆయా ప్రాంతాల్లో ఎక్కడెక్కడ కాలేజీ ఏర్పాటుకు అవకాశాలున్నాయో పరిశీలన చేస్తున్నారు. సంబంధిత జిల్లాల నుంచి సమాచారం తెప్పించుకుంటున్నారు. ప్రభుత్వ భూమి ఉంటే సేకరించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. కాగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిబంధనల ప్రకారం మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ఒక్కో దానికి రూ.450 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. మౌలిక సదుపాయాల కల్పన, నిర్మాణాల పూర్తికి దాదాపు రెండేళ్ల సమయం పడుతుంది.
పెరగనున్న పడకలు..
మెడికల్ కాలేజీల ఏర్పాటుతో వైద్య విద్య మెరుగుపడటమే కాకుండా గ్రామీణ వైద్యానికి మహర్దశ పట్టనుంది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా దానికి అనుబంధంగా 300 పడకల ఆస్పత్రి ఉండాలి. ఒకవేళ లేనట్లయితే ఆ ప్రాంతంలో ఉన్న ఏరియా ఆస్పత్రిని ఆధునీకరించాల్సి ఉంటుంది. అధునాతన పరికరాలు, మెరుగైన వసతులతోపాటు నిపుణులైన వైద్యులతో ఆయా ఆస్పత్రులను ఏర్పాటు చేయాలి. ఇది ఆయా ప్రాంతాల ప్రజలకు వరం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment