Medical EAMCET
-
తెలంగాణ మెడికల్ ఎంసెట్ కేసు దర్యాప్తు వేగవంతం
-
జూలై 9న మెడికల్ ఎంసెట్-2
ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు పరీక్ష అదే రోజు కీ విడుదల... 14న ర్యాంకుల ప్రకటన జూన్ 1 నుంచి 7 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ 28న నోటిఫికేషన్ పరీక్ష షెడ్యూల్‌ను ఖరారు చేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: ‘నీట్’ను ఏడాదిపాటు వాయిదావేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మెడికల్ ఎంసెట్-2 ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి బుధవారం సచివాలయంలో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ కరుణాకర్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, ఎంసెట్ కన్వీనర్ రమణారావు తదితరులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తక్షణమే నోటిఫికేషన్ జారీ చేయాలని భావించినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల ఈ నెల 28న ఎంసెట్-2కు నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించారు. ఎంసెట్-2 షెడ్యూల్ ప్రకారం జూన్ 1 నుంచి 7వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అయితే రూ. 500 అపరాధ రుసుముతో 14వ తేదీ వరకు, రూ. వెయ్యి అపరాధ రుసుముతో 21వ తేదీ వరకు, రూ. 5 వేల అపరాధ రుసుముతో 28వ తేదీ వరకు, రూ. 10 వేల అపరాధ రుసుముతో జూలై 6 నాటికీ దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి లక్ష్మారెడ్డి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ఫీజును ఎస్సీ, ఎస్టీలకు రూ. 250గా, ఇతరులకు రూ. 500గా నిర్ణయించారు. జూన్ 8న పరీక్ష నిర్వహణ కమిటీ, 9న ఫస్ట్ రీజనల్ కోఆర్డినేటర్లు వేర్వేరుగా సమావేశం కానున్నారు. జూన్ 15న పరీక్ష కేంద్రాలను ఖరారు చేయనున్నారు. జూలై 2న రెండో రీజనల్ కోఆర్డినేటర్ల సమావేశం జరగనుంది. జూలై 2 నుంచి 7వ తేదీ వరకు విద్యార్థులు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూలై 9న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎంసెట్-2 ప్రవేశ పరీక్ష నిర్వహించి అదే రోజు ప్రాథమిక ‘కీ’ని విడుదల చేయనున్నారు. జూలై 12లోగా ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలు తెలుపుకోవచ్చు. జూలై 14న ర్యాంకులు ప్రకటించనున్నారు. -
మెడికల్ ఎంసెట్‌కు భారీ స్పందన
♦ గతేడాది పరీక్షలు రాసింది 84,678.. ఈసారి 89,792 ♦ ఆయుష్, వ్యవసాయ సీట్లకే నిర్వహించినా భారీగా హాజరు ♦ ‘నీట్’పై ఇంకా తొలగని గందరగోళమే కారణమంటున్న నిపుణులు సాక్షి, హైదరాబాద్: ఆయుర్వేద, హోమియో వంటి ఆయుష్ కోర్సులు, వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ సీట్ల కోసం ఆదివారం నిర్వహించిన మెడికల్ ఎంసెట్‌కు భారీ స్పందన వచ్చింది. ‘నీట్’ నేపథ్యంలో ఎంసెట్ నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్‌లను మినహాయించినా.. ఇంతటి స్పందన రావడంపై వైద్య నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ‘నీట్’ ప్రవేశ పరీక్షపై విద్యార్థుల్లో ఇంకా గందరగోళం ఉందనడానికి ఇది నిదర్శనమంటున్నారు. నీట్ నుంచి మినహాయింపు వస్తుందేమోనన్న ఆశ, అందుకు ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు చేస్తున్న ప్రచారంతో విద్యార్థులు ఎంసెట్ మెడికల్ పరీక్షకు భారీగా హాజరయ్యారని అంటున్నారు. నీట్ నుంచి మినహాయింపు కోసం ఇంకా జరుగుతున్న ప్రయత్నాలు కూడా వారిని పరీక్ష వైపు మళ్లించాయని చెబుతున్నారు. భారీ స్పందనకు కారణమేంటి? ఎంసెట్ మెడికల్ పరీక్ష ద్వారా ప్రధానంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో చేరడానికే ఎక్కువ మంది రాస్తారు. వాటిల్లో సీటు రాని వారే తమకు వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఆయుష్ కోర్సులు, వ్యవసాయ దాని అనుబంధ కోర్సుల్లో చేరుతారు. గతేడాది మెడికల్ ఎంసెట్ కోసం 92,368 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా... 84,678 మంది (91.68%) పరీక్ష రాశారు. ఈసారి నీట్‌పై సుప్రీంకోర్టు తీర్పునకు ముందే ఎంసెట్ దరఖాస్తుల ప్రక్రియ పూర్తయింది. దీంతో సాధారణంగానే పెద్దసంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. 1.02 లక్షల మంది మెడికల్ ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకోగా... 89,792 మంది పరీక్ష రాశారు. విద్యార్థులు ఇంత భారీ సంఖ్యలో పరీక్ష రాయడానికి కారణం.. నీట్‌పై ఇంకా తొలగని గందరగోళమే అంటున్నారు. వాస్తవంగా ఆయుష్, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు ఇంతమంది పరీక్ష రాసే అవకాశమే లేదంటున్నారు. నీట్‌పై ప్రభుత్వ వర్గాలు కూడా మరింత స్పష్టత ఇవ్వకపోవడం కూడా ఒక కారణంగా తెలుస్తోంది. భవిష్యత్తులో నీట్ రాయాల్సి ఉన్నా... మెడికల్ ఎంసెట్‌కు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసినందున రాస్తే తప్పేముందన్న భావన కూడా విద్యార్థుల్లో నెలకొనడం కూడా మరో కారణంగా చెబుతున్నారు. ‘నీట్’ కోచింగ్‌కు సెంటర్లు రెడీ.. మరోవైపు మెడికల్ ఎంసెట్‌కు శిక్షణ ఇచ్చిన కోచింగ్ సెంటర్లు ‘నీట్’కు కూడా కోచింగ్ ఇచ్చే పనిలో పడ్డాయి. సీబీఎస్ఈ సిలబస్, నీట్ ప్రవేశ పరీక్ష తీరుపై కోచింగ్ ఇస్తామంటూ ఇప్పటికే విద్యార్థులకు ఫోన్లు చేసి చెబుతున్నాయి. గతంలో తమ వద్ద కోచింగ్ తీసుకున్న విద్యార్థులను ఆహ్వానిస్తున్నాయి. ఇందుకు భారీగా ఫీజులు గుంజేందుకు కూడా ఏర్పాట్లు చేసుకున్నాయి. -
ఆన్లైన్ ‘ఎంసెట్’కు స్పందన కరువు
♦ మెడికల్ కోసం 548 దరఖాస్తులే.. ♦ ఆఫ్‌లైన్ పరీక్షకు లక్షకు పైగా... ♦ ఈ నెల 24 నుంచి హాల్‌టికెట్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తొలిసారిగా ఆన్లైన్ ద్వారా నిర్వహించనున్న మెడికల్ ఎంసెట్‌కు అభ్యర్థులు ఆసక్తి కనబరచలేదు. కేవలం 548 మంది అభ్యర్థులే దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్-2016 పరీక్షను మే 2న నిర్వహించేందుకు ఎంసెట్ కమిటీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అగ్రికల్చర్, మెడికల్‌లో ఎంసెట్‌ను ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్లైన్ ద్వారా ఏకకాలంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఆఫ్‌లైన్ పరీక్షకు మాత్రం 1,00,939 మంది దరఖాస్తు చే సుకున్నారు. అయితే మొదటిసారిగా ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తుండటంతో అభ్యర్థులు అంతగా ఆసక్తి చూపలేదు. హైదరాబాద్ పరిధిలోని కేంద్రాల్లో 493 మంది, వరంగల్ పరిధిలోని కేంద్రాల్లో 55 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. మే 12న ఫలితాలు.. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ పరీక్షకు హాజరయ్యేందుకు మొత్తం 2,46,917 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1,43,378 మంది ఇంజనీరింగ్ కోసం, 1,00,939 మంది ఆఫ్‌లైన్ అగ్రికల్చర్, మెడికల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆన్లైన్ ద్వారా పరీక్ష రాసేందుకు మరో 548 మంది దరఖాస్తు చేశారు. ఇక ఆఫ్‌లైన్, ఆన్లైన్ రెండింటిలో పరీక్ష రాసేందుకు 1,026 మంది దరఖాస్తు చేశారు. అభ్యర్థులు ఈ నెల 24 నుంచి 30 వరకు హాల్ టికెట్ల డౌన్లోడ్ చేసుకునేలా ఎంసెట్ కమిటీ చర్యలు చేపట్టింది. కాగా, రూ.10 వేల ఆలస్య రుసుంతో ఈ నెల 29 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. మే 2న ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు ఇంజనీరింగ్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు అగ్రికల్చర్, మెడికల్ పరీక్ష నిర్వహించనుంది. ప్రాథమిక కీని మే 3న విడుదల చేయనుండగా, 9వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి మే 12న ఫలితాలు వెల్లడించనుంది.