
మెడికల్ ఎంసెట్‌కు భారీ స్పందన
♦ గతేడాది పరీక్షలు రాసింది 84,678.. ఈసారి 89,792
♦ ఆయుష్, వ్యవసాయ సీట్లకే నిర్వహించినా భారీగా హాజరు
♦ ‘నీట్’పై ఇంకా తొలగని గందరగోళమే కారణమంటున్న నిపుణులు
సాక్షి, హైదరాబాద్: ఆయుర్వేద, హోమియో వంటి ఆయుష్ కోర్సులు, వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ సీట్ల కోసం ఆదివారం నిర్వహించిన మెడికల్ ఎంసెట్‌కు భారీ స్పందన వచ్చింది. ‘నీట్’ నేపథ్యంలో ఎంసెట్ నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్‌లను మినహాయించినా.. ఇంతటి స్పందన రావడంపై వైద్య నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ‘నీట్’ ప్రవేశ పరీక్షపై విద్యార్థుల్లో ఇంకా గందరగోళం ఉందనడానికి ఇది నిదర్శనమంటున్నారు. నీట్ నుంచి మినహాయింపు వస్తుందేమోనన్న ఆశ, అందుకు ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు చేస్తున్న ప్రచారంతో విద్యార్థులు ఎంసెట్ మెడికల్ పరీక్షకు భారీగా హాజరయ్యారని అంటున్నారు. నీట్ నుంచి మినహాయింపు కోసం ఇంకా జరుగుతున్న ప్రయత్నాలు కూడా వారిని పరీక్ష వైపు మళ్లించాయని చెబుతున్నారు.
భారీ స్పందనకు కారణమేంటి?
ఎంసెట్ మెడికల్ పరీక్ష ద్వారా ప్రధానంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో చేరడానికే ఎక్కువ మంది రాస్తారు. వాటిల్లో సీటు రాని వారే తమకు వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఆయుష్ కోర్సులు, వ్యవసాయ దాని అనుబంధ కోర్సుల్లో చేరుతారు. గతేడాది మెడికల్ ఎంసెట్ కోసం 92,368 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా... 84,678 మంది (91.68%) పరీక్ష రాశారు. ఈసారి నీట్‌పై సుప్రీంకోర్టు తీర్పునకు ముందే ఎంసెట్ దరఖాస్తుల ప్రక్రియ పూర్తయింది. దీంతో సాధారణంగానే పెద్దసంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. 1.02 లక్షల మంది మెడికల్ ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకోగా... 89,792 మంది పరీక్ష రాశారు.
విద్యార్థులు ఇంత భారీ సంఖ్యలో పరీక్ష రాయడానికి కారణం.. నీట్‌పై ఇంకా తొలగని గందరగోళమే అంటున్నారు. వాస్తవంగా ఆయుష్, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు ఇంతమంది పరీక్ష రాసే అవకాశమే లేదంటున్నారు. నీట్‌పై ప్రభుత్వ వర్గాలు కూడా మరింత స్పష్టత ఇవ్వకపోవడం కూడా ఒక కారణంగా తెలుస్తోంది. భవిష్యత్తులో నీట్ రాయాల్సి ఉన్నా... మెడికల్ ఎంసెట్‌కు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసినందున రాస్తే తప్పేముందన్న భావన కూడా విద్యార్థుల్లో నెలకొనడం కూడా మరో కారణంగా చెబుతున్నారు.
‘నీట్’ కోచింగ్‌కు సెంటర్లు రెడీ..
మరోవైపు మెడికల్ ఎంసెట్‌కు శిక్షణ ఇచ్చిన కోచింగ్ సెంటర్లు ‘నీట్’కు కూడా కోచింగ్ ఇచ్చే పనిలో పడ్డాయి. సీబీఎస్‌ఈ సిలబస్, నీట్ ప్రవేశ పరీక్ష తీరుపై కోచింగ్ ఇస్తామంటూ ఇప్పటికే విద్యార్థులకు ఫోన్లు చేసి చెబుతున్నాయి. గతంలో తమ వద్ద కోచింగ్ తీసుకున్న విద్యార్థులను ఆహ్వానిస్తున్నాయి. ఇందుకు భారీగా ఫీజులు గుంజేందుకు కూడా ఏర్పాట్లు చేసుకున్నాయి.