సైన్యంలో పోరాటం కంటే ఇది కష్టం!
► సిపాయి భూమిని కబ్జా చేసిన అక్రమార్కులు
► భూమి ఇప్పించాలని నాలుగేళ్ల నుంచి తిరుగుతున్నా ఫలితం శూన్యం
‘ఒకప్పుడు దేశ సరిహద్దులను కాపలా కాశా.. విధి నిర్వహణలో మాతృభూమికి కోసం త్యాగాలకు సిద్ధపడ్డా.. ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాడా.. పదవి విరమణ చేశా.. తర్వాత ప్రభుత్వం నాకు కొంత భూమి ఇచ్చింది. దాన్ని కొందరు కొబ్జా చేశారు. భూమిని దక్కించుకోవడానికి అధికారులతో అలుపెరగని పోరాటం చేస్తున్నా. సైన్యంలో పోరాటం కంటే ఈ పోరాటం నాకు కష్టంగా అనిపిస్తోంది. బతిమిలాడుకున్నా నాపై ఎవరికీ కనికరం లేదు..’ ఇవి సాక్షాత్తూ మూడు సార్లు శతృదేశాలతో ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొన్న ఓ సిపాయి మాటలు
బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెం గ్రామానికి చెందిన మేడికొండ ఆదాం 1961–62లో భారత సైన్యంలో ఇన్ఫాంట్రీ విభాగంలో సిపాయిగా చేరాడు. 1962లో చైనాతో, 1965, 1971లలో పాకిస్థాన్‌తో మూడుసార్లు ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొన్నాడు. కళ్ల ముందు సాటి సైనికులు మృతి చెందినా దిగమింగి యుద్ధంలో ముందుకు సాగాడు. 15 ఏళ్ల పాటు సైన్యంలో కొనసాగి పదవి విరమణ పొందాడు.
భూమి కబ్జా..!
విరమణ తర్వాత జీవనం కోసం సాగు భూమి కేటాయించాలని అప్పట్లో ఆయన ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మండలంలోని సరికొండలపాలెం ఇందిర జలప్రభ కార్యక్రమానికి గ్రామానికి విచ్చేయగా మేడికొండ ఆదాం ఆయన భూమి సంగతి విన్నవించుకున్నారు. వెంటనే వైఎస్ స్పందించి వెల్లటూరు పరిసరాల్లోని సర్వేనెంబర్ 454/13–బి 19లో 2.50 ఎకరాలు, బి– 21లో 2 ఎకరాలు కలిపి 4.50 ఎకరాలు సర్వేచేసి హద్దులు చూపారు.
అయితే.. కొన్నేళ్ల నుంచి సాగు చేయకపోవడంతో దళారులు అధికారులతో కుమ్మక్కై రికార్డులు మార్చి భూమి కాజేయాలని హస్తగతం చేసుకున్నారని ఆదాం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్ల నుంచి తనకు న్యాయం చేయాలని రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వం తనకు కేటాయించిన భూమిని అప్పగించాలని కోరుతున్నారు.