MedPlus Health Services
-
జనరిక్స్‌పై మెడ్‌ప్లస్... మరింత ఫోకస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధాల రిటైల్ దిగ్గజం మెడ్‌ప్లస్ ‘స్టోర్ జనరిక్’ కాన్సెప్టుపై మరింతగా దృష్టి పెడుతోంది. అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో ప్రాచుర్యంలో ఉన్న ఈ కాన్సెప్టును దేశీయంగా తాము తొలిసారి ప్రవేశపెట్టినట్లు మెడ్‌ప్లస్ హెల్త్ సరీ్వసెస్ ఎండీ, సీఈవో గంగాడి మధుకర్ రెడ్డి తెలిపారు. దీని కింద తమ స్టోర్స్‌లో నాణ్యమైన సొంత బ్రాండ్ ఔషధాలపై ఉత్పత్తిని బట్టి 50–80 శాతం మేర, సగటున 60 శాతం మేర డిస్కౌంటుకే విక్రయిస్తున్నట్లు ఆయన వివరించారు. ఇతర బ్రాండ్స్‌తో పోలిస్తే మార్కెటింగ్, డి్రస్టిబ్యూషన్ చానల్పరమైన వ్యయాల భారం తమకు ఉండని కారణంగా ఇది సాధ్యపడుతోందని మధుకర్ చెప్పారు. తొలుత హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షించిన ఈ మోడల్‌ను క్రమంగా దేశవ్యాప్తంగా అమల్లోకి తెస్తున్నట్లు పేర్కొన్నారు. దీనితో ఏడు రాష్ట్రాల్లో 26.2 లక్షల మంది పైచిలుకు కస్టమర్లకు గడిచిన ఆరు నెలల్లో రూ. 139.7 కోట్ల మేర ఆదా అయిందని ఆయన వివరించారు. దేశీయంగా దాదాపు 800 పైగా ఔషధాలు ఉండగా .. 600 పైగా జనరిక్స్‌ను తాము అందిస్తున్నట్లు మధుకర్ చెప్పారు. దిగ్గజ సంస్థలతో జట్టు .. ‘‘సాధారణంగా జనరిక్స్ అంటే అంత నాణ్యమైనవి కాకపోవచ్చనే అపోహ ఉంటోంది. అయితే, బ్రాండెడ్, అన్‌బ్రాండెడ్ అనే తేడా లేకుండా పేటెంటు ముగిసిపోయిన ఔషధాన్ని ఎవరు తయారు చేసినా అది జనరిక్ ఔషధమే. కాకపోతే ఎంత నాణ్యతతో తయారు చేస్తున్నారనేది ముఖ్యం. మా వరకు మేము నాణ్యతకు పెద్దపీట వేస్తూ అకుమ్స్ డ్రగ్స్ అండ్ ఫార్మా, విండ్లాస్ బయోటెక్ వంటి దేశీయంగా అగ్రగామి ఔషధ తయారీ సంస్థ (సీడీఎంవో)ల దగ్గర జనరిక్స్‌ను తయారు చేయిస్తున్నాం. అధునాతన టెక్నాలజీలతో వాటి నాణ్యతను మేము కూడా స్వయంగా పరీక్షిస్తాం. పలు దిగ్గజ ఫార్మా సంస్థలకు కూడా ఈ సంస్థలు జనరిక్స్ అందిస్తున్నాయి. తమ ఫ్యాక్టరీల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూరోపియన్ యూనియన్ నిర్దేశిత ప్రమాణాలను పాటిస్తున్నాయి. కాబట్టి నాణ్యత విషయంలో రాజీ ఉండదు. అదే సమయంలో వేల సంఖ్యలో ఉన్న మా స్టోర్స్ ద్వారా విక్రయించడంతో మాకు మార్కెటింగ్పరమైన వ్యయాలు ఉండవు కాబట్టి ఆ మేరకు ప్రయోజనాలను కస్టమర్లకు నేరుగా బదలాయించగలుగుతున్నాం’’ అని మధుకర్ వివరించారు. దేశీ ఫార్మా విభాగంలో ఇదొక విప్లవాత్మక మార్పు కాగలదని ఆయన తెలిపారు. మరోవైపు, వైద్య పరీక్షల సేవలనూ గణనీయంగా విస్తరిస్తున్నామన్నారు. మెడ్ప్లస్కి ప్రస్తుతం పది రాష్ట్రాల్లో 4,200 పైచిలుకు స్టోర్స్‌లో సంఘటిత రిటైల్ ఫార్మసీ పరిశ్రమలో 30 శాతం మార్కెట్ వాటా ఉంది. -
స్టాక్ మార్కెట్లో ఐపీవోల సందడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్‌కు చెందిన ఫార్మసీ రిటైల్ దిగ్గజం మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూ డిసెంబర్ 13న ప్రారంభమై 15న ముగుస్తుంది. ఇందుకు సంబంధించి షేరు ధర శ్రేణిని రూ. 780–796గా నిర్ణయించారు. ఈ ఇష్యూ ద్వారా మెడ్‌ప్లస్ దాదాపు రూ. 1,398 కోట్లు సమీకరించనుంది. కనీసం 18 షేర్లకు బిడ్ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగుల కోసం రూ. 5 కోట్ల విలువ చేసే షేర్లను కేటాయించారు. సిబ్బందికి తుది ధరపై షేరు ఒక్కింటికి రూ. 78 డిస్కౌంటు లభిస్తుంది. ఐపీవోలో భాగంగా రూ. 600 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో ప్రమోటరు, ప్రస్తుత వాటాదారులు రూ. 798.30 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనున్నారు. ఓఎఫ్ఎస్ పరిమాణాన్ని రూ. 1,039 కోట్ల నుంచి తగ్గించారు. తాజాగా షేర్ల జారీ ద్వారా సమీకరించే నిధులను అనుబంధ సంస్థ ఆప్టివల్ నిర్వహణ మూలధన అవసరాల కోసం ఉపయోగించుకోనున్నారు. గంగాడి మధుకర్ రెడ్డి 2006లో మెడ్‌ప్లస్‌ను ప్రారంభించారు. ఔషధాలు, వైద్య పరికరాలు, టెస్ట్ కిట్లతో పాటు ఇతరత్రా ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులను కూడా మెడ్‌ప్లస్ స్టోర్స్ విక్రయిస్తాయి. ఢిల్లీ, కేరళ మార్కెట్లపైనా దృష్టి .. ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా 2,000 పైచిలుకు స్టోర్స్ ఉన్నాయని వర్చువల్ మీడియా సమావేశంలో కంపెనీ ఎండీ, సీఈవో మధుకర్ రెడ్డి వివరించారు. ఢిల్లీ, కేరళ మార్కెట్లలోకి కూడా ప్రవేశించే యోచన ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. గతేడాది కోవిడ్–19పరమైన ప్రతికూల పరిస్థితుల్లోనూ 350 స్టోర్స్ ఏర్పాటు చేశామని మధుకర్ రెడ్డి తెలిపారు. ప్రైవేట్ లేబుల్ ఉత్పత్తుల విక్రయాలను పెంచుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం మొత్తం ఆదాయంలో ప్రైవేట్ లేబుల్స్ వాటా సుమారు 11.98 శాతంగా ఉందని పేర్కొన్నారు. మెట్రో బ్రాండ్స్ ఐపీవో న్యూఢిల్లీ: ఫుట్‌వేర్ రిటైలర్ మెట్రో బ్రాండ్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ శుక్రవారం(10న) మొదలుకానుంది. మంగళవారం(14న) ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 485–500కాగా.. తద్వారా రూ. 1,368 కోట్లు సమీకరించాలని కంపెనీ ఆశిస్తోంది. సుప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలాకు పెట్టుబడులున్న మెట్రో బ్రాండ్స్ గురువారం(9న) యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్లను విక్రయించనుంది. ఐపీవోలో భాగంగా రూ. 295 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 2.14 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ఇతర వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ప్రధానంగా ప్రమోటర్లు దాదాపు 10 శాతం వాటాను ఆఫర్ చేయనున్నారు. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్ల వాటా 84 శాతంగా నమోదైంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 30 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇష్యూ నిధులలో కొంతమేర మెట్రో, మోచీ, వాకెవే, క్రాక్స్ బ్రాండ్లతో కొత్త స్టోర్ల ఏర్పాటుకు వినియోగించనుంది. మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. -
మెడ్‌ప్లస్ హెల్త్, రేట్‌గెయిన్ ఐపీవోలకు ఆమోదం
న్యూఢిల్లీ: ఫార్మసీ దుకాణాల సంస్థ మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్, ట్రావెల్ టెక్నాలజీ సేవల్లోని రేట్‌గెయిన్ ట్రావెల్ టెక్నాలజీస్ మరో నాలుగు కంపెనీల ఐపీవోలకు సెబీ ఆమోదం లభించింది. సూక్ష్మ రుణాల సంస్థ ఫ్యూజన్ మైక్రో ఫైనాన్స్, రిటైల్ వెల్త్ మేనేజ్మెంట్ (పెట్టుబడుల నిర్వహణ సేవలు) సంస్థ ప్రుడెంట్ కార్పొరేట్ అడ్వైజరీ సర్వీసెస్, ట్రాక్సన్ టెక్నాలజీస్, పురానిక్ బిల్డర్స్ ఐపీవోలు ఆమోదం పొందిన వాటిల్లో ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో ఈ కంపెనీలు ఐపీవో దరఖాస్తులను సెబీ వద్ద నమోదు చేశాయి. ఈ నెల 16–18 తేదీల మధ్య సెబీ నుంచి వీటికి పరిశీలనల లేఖలు లభించినట్టు అందుబాటులోని సమాచారం ఆధారంగా తెలుస్తోంది. మెడ్‌ప్లస్ రూ.1,539 కోట్లు.. మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్ రూ.1,639 కోట్లను ఐపీవో రూపంలో సమీకరించనుంది. ఇందులో రూ.600 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా (ఈక్విటీని పెంచడం ద్వారా) జారీ చేయనున్నారు. మరో రూ.1039 కోట్ల విలువ చేసే షేర్లను కంపెనీలో ప్రస్తుతం వాటాలు కలిగిన ఇన్వెస్టర్లు ఆఫర్ ఫర్‌సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో విక్రయించనున్నారు. ఇందులో లోన్ ఫ్యూరో ఇన్వెస్ట్మెంట్స్ రూ.450 కోట్ల మేర, పీఐ అపార్చునిటీస్ ఫండ్ –1 రూ.500 కోట్ల మేర, ఇతర వాటాదారులు మరో రూ.89 కోట్ల మేర విక్రయించనున్నారు. ఐపీవోలో తాజాగా జారీ చేసే వాటాల ద్వారా సమీకరించే నిధులను మూలధన అవసరాల కోసం మెడ్‌ప్లస్ వినియోగించనుంది. రేట్‌గెయిన్ ఈ కంపెనీ రూ.400 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఓఎఫ్ఎస్ రూపంలో 2.26 కోట్ల షేర్లను విక్రయించనుంది. తాజా ఈక్విటీ రూపంలో సమీకరించే నిధులను రుణ భారం తగ్గించుకునేందుకు కంపెనీ వినియోగించనుంది. మరికొంత నిధులను వృద్ధి కోసం ఖర్చు పెట్టనుంది. ఫ్యూజన్ మైక్రోఫైనాన్స్ ఈ సంస్థ తాజా ఈక్విటీ రూపంలో రూ.600 కోట్ల విలువైన షేర్లను ఐపీవోలో భాగంగా ఆఫర్ చేయనుంది. అలాగే, 2.19 కోట్ల షేర్లను ఓఎఫ్ఎస్ కింద ప్రమోటర్లు, ఇతర వాటాదారులు విక్రయించనున్నారు. వార్‌బర్గస్ పింకస్ తదితర అంతర్జాతీయ సంస్థలకు ఈ కంపెనీలో వాటాలున్నాయి. ప్రుడెంట్ కార్పొరేట్ అడ్వైజరీ సర్వీసెస్ ఐపీవోలో 85,49,340 షేర్లను ప్రస్తుత వాటాదారులే విక్రయించనున్నారు. పురానిక్ బిల్డర్స్ సంస్థ రూ.510 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనుండగా.. 9.45 లక్షల షేర్లను ప్రమోటర్ల గ్రూపు విక్రయించనుంది. ట్రాక్సన్ టెక్నాలజీస్ ఐపీవోలో భాగంగా 3.86 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ఇతర వాటాదారులు ఓఎఫ్ఎస్ రూపంలో ఆఫర్ చేయనున్నారు. గో ఫ్యాషన్ ఐపీవో సక్సెస్ 135 రెట్ల స్పందన న్యూఢిల్లీ: మహిళల బోటమ్‌వేర్ విక్రయాల్లోని గోఫ్యాషన్ ఇండియా లిమిటెడ్ ఐపీవోకు అనూహ్య స్పందన వచ్చింది. కంపెనీ ఐపీవోలో భాగంగా 80,79,491 షేర్లను ఆఫర్ చేస్తుండగా.. 109,44,34,026 షేర్ల కోసం బిడ్లు దాఖలయ్యాయి. ఈ ఐపీవో ద్వారా కంపెనీ రూ.1,013 కోట్లను సమీకరించనుంది. నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల విభాగంలో ఆఫర్ చేస్తున్న షేర్లతో పోలిస్తే 262 రెట్లు అధికంగా బిడ్లు వచ్చాయి. క్యాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల విభాగంలో 100 రెట్లు స్పందన వచ్చింది. రిటైల్ ఇన్వెస్టర్ల కోటా కూడా 50 రెట్ల బిడ్లను అందుకుంది. తాజా ఈక్విటీ రూపంలో రూ.125 కోట్ల షేర్లను ఆఫర్ చేస్తుండగా, ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో 1,28,78,389 షేర్లను విక్రయిస్తోంది. గో ఫ్యాషన్ ఇండియా ‘గో కలర్స్’ పేరుతో సొంత స్టోర్లను దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది. -
ఐపీవోలకు మరో మూడు కంపెనీలు రెడీ...!
న్యూఢిల్లీ: ఓవైపు దేశీ స్టాక్ మార్కెట్లు రోజుకో కొత్త రికార్డు నెలకొల్పుతూ బుల్ జోరు చూపుతుంటే.. మరోపక్క సెకండరీ మార్కెట్ సైతం పలు ఇష్యూలతో సందడి చేస్తోంది. గత వారం రోజుల్లో ఆరు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌లు దాఖలు చేయగా.. ప్రస్తుతం మరో మూడు కంపెనీలు ఇదే బాట పట్టాయి. ఇక ఇటీవలే ఐపీవోలు ముగించుకున్న నాలుగు కంపెనీలు సోమవారం(16న) స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన సంగతి తెలిసిందే. తాజాగా సెబీ తలుపు తడుతున్న కంపెనీల జాబితాలో మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్, స్టెరిలైట్ పవర్ ట్రాన్స్మిషన్, రేట్‌గెయిన్ ట్రావెల్ టెక్నాలజీ చేరాయి. వివరాలు చూద్దాం.. (చదవండి: ఐమాక్స్ వీడియో రికార్డింగ్ ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం...!) మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్ ఫార్మసీ రిటైల్ చైన్.. మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్ ఐపీవోకు అనుమతించమంటూ సెబీకి దరఖాస్తు చేసింది. తద్వారా రూ. 1,639 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. ఇష్యూలో భాగంగా రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా ప్రమోటర్లు, కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన వాటాదారులు మరో రూ. 1,039 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ప్రధానంగా ఫ్యురో ఇన్వెస్ట్మెంట్స్ రూ. 450 కోట్లు, పీఐ అపార్చునిటీస్ ఫండ్–1 రూ. 500 కోట్లు చొప్పున వాటాలను ఆఫర్ చేయనున్నాయి. ఈక్విటీ జారీతో లభించే నిధులను అనుబంధ సంస్థ ఆప్టవల్ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనుంది. స్టెరిలైట్ పవర్ ట్రాన్స్మిషన్ అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంతా గ్రూప్ కంపెనీ స్టెరిలైట్ పవర్ ట్రాన్స్మిషన్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. రూ. 1,250 కోట్ల సమీకరణకు అనుమతించవలసిందిగా సెబీకి తాజాగా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా ఉద్యోగులకు సైతం షేర్లను కేటాయించనుంది. ఇష్యూ నిధులను ప్రత్యేకించిన కొన్ని రుణ చెల్లింపులకు వినియోగించనుంది. ఐపీవోకు ముందు షేర్ల జారీ ద్వారా రూ. 220 కోట్లను సమకూర్చుకోనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో విద్యుత్ పంపిణీ మౌలికసదుపాయాల కంపెనీ పేర్కొంది. రేట్‌గెయిన్ ట్రావెల్ టెక్నాలజీ ప్రయాణాలు, ఆతిథ్య రంగ టెక్సాలసీ సర్వీసులందించే రేట్‌గెయిన్ ట్రావెల్ టెక్నాలజీ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు వీలుగా సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా కంపెనీ ప్రమోటర్లు, ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన వాటాదారులు మరో 2.26 కోట్ల షేర్లను సైతం విక్రయానికి ఉంచనున్నారు. ప్రధానంగా వ్యాగ్నర్ లిమిటెడ్ 1.71 కోట్ల షేర్లను ఆఫర్ చేయనుంది. ఈక్విటీ జారీతో లభించే నిధులను రుణ చెల్లింపులు, ఇతర సంస్థల కొనుగోళ్లకు వెచ్చించనుంది. (చదవండి: ఆపిల్ కంపెనీకి భారీ షాక్..!) -
మెడ్‌ప్లస్‌పై వార్బర్గ్ పింకస్ కన్ను!
ముంబై, సాక్షి: దేశీ రిటైల్ ఫార్మసీ మార్కెట్ మరింత వేడెక్కనుంది. కోవిడ్-19 నేపథ్యంలో ఇటీవల ఔషధ విక్రయాలు ఊపందుకున్నాయి. అటు ఆఫ్‌లైన్(స్టోర్లు), ఇటు ఆన్లైన్ విక్రయాలు వేగవంతంగా పెరుగుతున్నాయి. దీంతో గత కొద్ది రోజులుగా దేశీ ఫార్మసీ విభాగంలో రిలయన్స్ రిటైల్, టాటా గ్రూప్, అమెజాన్ భారీ పెట్టుబడులతో సరికొత్త వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ప్రధానంగా ఇతర కంపెనీలలో వాటాలను కొనుగోలు చేయడం ద్వారా వేగవంతంగా విస్తరించే ప్రణాళికలు అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా గ్లోబల్ పీఈ దిగ్గజం వార్బర్గ్ పింకస్ రేసులోకి వచ్చినట్లు తెలుస్తోంది. దేశీయంగా రెండో పెద్ద ఫార్మసీ రిటైల్ చైన్ కలిగిన మెడ్‌ప్లస్‌లో ప్రస్తావించదగ్గ మైనారిటీ వాటా కొనుగోలుకి వార్బర్గ్ అడుగులు వేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇతర వివరాలు ఇలా.. (టాటాల చేతికి 1ఎంజీ?) రూ. 1,500 కోట్లు మెడ్‌ప్లస్‌లో చెప్పుకోదగ్గ మైనారిటీ వాటా కొనుగోలుకి వార్బర్గ్ పింకస్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వాటా కొనుగోలుకి వీలుగా రుణాలు, ఈక్విటీ ద్వారా మెడ్‌ప్లస్‌కు నిధులు అందించనున్నట్లు తెలుస్తోంది. దీంతో మెడ్‌ప్లస్‌కు రుణాలిచ్చిన గోల్డ్‌మన్ శాక్స్, ఎడిల్వీజ్ తదితరాలకు చెల్లింపులు చేపట్టే వీలున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 2018 జనవరిలో గోల్డ్‌మన్ శాక్స్ నుంచి మెడ్‌ప్లస్ 11.5 కోట్ల డాలర్ల(సుమారు రూ. 845 కోట్లు) రుణాలను తీసుకుంది. ఈ నిధులతో కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన మౌంట్ కెల్లెట్ క్యాపిటల్ మేనేజ్మెంట్(యూఎస్), టీవీఎస్ క్యాపిటల్ ఫండ్స్, అజయ్ పిరమల్ కంపెనీ ఇండియా వెంచర్ అడ్వయిజర్స్ నుంచి మొత్తం 69 శాతం వాటాను మెడ్‌ప్లస్ సొంతం చేసుకుంది. (అపోలో ఫార్మసీలో అమెజాన్ ఇన్వెస్ట్మెంట్!) ప్రేమ్జీకు వాటా విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ కంపెనీ ప్రేమ్‌జీ ఇన్వెస్ట్మెంట్ రూ. 200 కోట్లతో మెడ్‌ప్లస్‌లో ఇన్వెస్ట్ చేసింది. ఆపై మరో రూ. 100 కోట్ల పెట్టుబడులను సైతం సమకూర్చింది. తద్వారా మెడ్‌ప్లస్‌లో ప్రేమ్‌జీ ఇన్వెస్ట్మెంట్.. 18 శాతం వాటాతో కొనసాగుతోంది. కాగా.. ప్రస్తుతం మెడ్‌ప్లస్‌లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్న వార్బర్గ్ పింకస్‌కు ప్రేమ్‌జీ ఇన్వెస్ట్మెంట్ సైతం వాటాను విక్రయించే వీలున్నట్లు ఫార్మా వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఈ పెట్టుబడులతో వాటాలను తనఖా నుంచి రిలీజ్ చేసుకోవడం ద్వారా మెడ్‌ప్లస్‌ను వ్యవస్థాపకుడు సీఈవో, మధుకర్ గంగాడీ ఇకపైన కూడా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. (రిలయన్స్ చేతికి నెట్‌మెడ్స్) హైదరాబాద్ కంపెనీ 2006లో హైదరాబాద్‌లో ప్రారంభమైన మెడ్‌ప్లస్ ప్రస్తుతం 1,800 స్టోర్లతో దేశంలోనే రెండో పెద్ద ఫార్మసీ చైన్‌గా నిలుస్తోంది. ఆన్‌లైన్‌లోనూ మెడ్‌ప్లస్‌మార్ట్, మెడ్‌ప్లస్‌ల్యాబ్, మెడ్‌ప్లస్ లెన్స్ పేరుతో స్టోర్లను నిర్వహిస్తోంది. దక్షిణాదిన ప్రారంభమైన కంపెనీ తదుపరి దశలో దేశవ్యాప్తంగా కార్యకలాపాలు విస్తరించింది. దేశీయంగా గల 12 లక్షల ఫార్మసీలలో 5 శాతం కంటే తక్కువ వాటాను ఆర్గనైజ్డ్ రంగం కలిగి ఉన్నట్లు అంచనా. కాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెడ్‌ప్లస్ టర్నోవర్ రూ. 1,200 కోట్లకు చేరవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. రూ. 160-170 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) సాధించవచ్చని అంచనా వేశారు. -
ఈ-కామర్స్‌లోకి మెడ్‌ప్లస్..
ఆర్డరిచ్చే ఔషధాలు 6 గంటల్లో దగ్గర్లోని స్టోర్‌లో సిద్ధం త్వరలో ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులు నేరుగా ఇంటికే డెలివరీ మూడేళ్లలో దేశవ్యాప్తంగా 10,000 స్టోర్లు ఆరునెలల్లో రూ.450 కోట్ల పీఈ నిధులు మెడ్‌ప్లస్ ఫౌండర్ మధుకర్ గంగాడి వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో ఇప్పటిదాకా ఔషధాల విక్రయ రంగంలో ఉండి ఫార్మసీ చైన్‌ను నిర్వహిస్తున్న మెడ్‌ప్లస్ సంస్త ఈ-కామర్స్ బాట పట్టింది. ‘క్లిక్, పిక్, సేవ్’ పేరుతో ఔషధాలను కూడా మెడ్‌ప్లస్‌మార్ట్.కామ్ ద్వారా విక్రయించే విధానాన్ని ప్రారంభించింది. దశలవారీగా ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులనూ ఆన్లైన్లో పరిచయం చేయనుంది. ప్రస్తుతం వ్యక్తిగత సంరక్షణ, సౌందర్య పోషణ, పోషకాహార తదితర ఉత్పత్తులను మెడ్‌ప్లస్ విక్రయిస్తోంది. భవిష్యత్తులో అన్ని ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులనూ అందుబాటులోకి తెస్తామని మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్ వ్యవస్థాపకులు, సీఈవో మధుకర్ గంగాడి చెప్పారు. శుక్రవారమిక్కడ ఆన్లైన్ సేవలను అధికారికంగా ప్రారంభించిన సందర్భంగా ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో మాట్లాడారు. ఈ-కామర్స్‌ను వేదికగా చేసుకుని రిటైల్ రంగంలో సుస్థిర స్థానం దక్కించుకుంటామని చెప్పారు. ఆయనింకా ఏమన్నారంటే.. ఆన్లైన్లో 20 వేల రకాలు.. మెడ్‌ప్లస్‌మార్ట్.కామ్ వెబ్సైట్ ప్రత్యేకత ఏంటంటే సబ్‌స్టిట్యూట్ (ప్రత్యామ్నాయ) మందులను కూడా స్క్రీన్‌పై చూపిస్తుంది. కస్టమర్ కోరుకుంటున్న మందుకు, దానికి ప్రత్యామ్నాయంగా ఉన్న ఇతర బ్రాండ్ల మందులకు మధ్య ధరలో ఉన్న తేడా, తయారు చేసిన కంపెనీ, ఔషధ ఉపయోగాలు, దుష్పరిణామాల వంటి వివరాలూ కూడా కనిపిస్తాయి. మొత్తం 20 వేల రకాల మందులు, 10 వేల ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులను పోర్టల్‌లో ఉంచాం. ఆన్లైన్లో ఆర్డరు ఇస్తే చాలు. 6 గంటల వ్యవధిలో కస్టమర్‌కు దగ్గర్లో ఉన్న స్టోర్‌లో మందులు సిద్ధంగా ఉంటాయి. వినియోగదారు తనకు వీలున్న సమయంలో షాప్‌కు వెళ్లి తెచ్చుకోవచ్చు. ఔషధాలపై 15 శాతం, ఎఫ్ఎంసీజీ ఉత్పాదనలపై 30 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. దశలవారీగా అన్ని నగరాలకు విస్తరిస్తాం. ఇలా చేరుకుంటాం... మెడ్‌ప్లస్‌కు 12 రాష్ట్రాల్లో 1,240 స్టోర్లున్నాయి. మూడేళ్లలో 10,000 స్టోర్లను చేరుకుంటాం. ఇందులో 8,000 స్టోర్లు ఫ్రాంచైజీ విధానంలో వస్తాయి. కనీసం 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్టోర్ ఉంటుంది. ఒక్కో స్టోర్‌లో 6,000 రకాల మందులు అందుబాటులో ఉంటాయి. వీటితోపాటు ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులు ఎలాగూ లభిస్తాయి. అన్ని స్టోర్లనూ ఆన్‌లైన్‌కు అనుసంధానిస్తాం. రానున్న రోజుల్లో ఆన్లైన్లో ఆర్డరు ఇస్తే... సరుకులు ఇంటికే పంపే ఏర్పాట్లు చేస్తాం. మందులు మాత్రం స్టోర్ నుంచి తీసుకోవాల్సిందే. నిధులు సమీకరిస్తున్నాం.. దేశవ్యాప్తంగా మందుల విక్రయాల పరిమాణం రూ.80 వేల కోట్లుంది. ఇందులో రూ.4,800 కోట్లు వ్యవస్థీకృత రంగం కైవసం చేసుకుంది. వ్యవస్థీకృత రంగంలో మెడ్‌ప్లస్‌కు 30 శాతం మార్కెట్ వాటా ఉంది. మొత్తం మందుల వ్యాపారంలో మూడేళ్లలో 25 శాతం వాటా లక్ష్యంగా చేసుకున్నాం. విస్తరణకుగాను రూ.450 కోట్ల పీఈ నిధుల్ని సమీకరిస్తున్నాం. ఇది ఆరునెలల్లో పూర్తవుతుంది. 2014-15లో రూ.1,430 కోట్ల టర్నోవర్‌ను అంచనా వేస్తున్నాం. ఎంహెచ్ఎస్ బ్రాండ్‌తో జనరిక్ ఔషధాలు, ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులను విక్రయిస్తున్నాం. టర్నోవర్ రూ.15,000 కోట్లకు చేరుకున్నాక సొంత ఔషధ తయారీ ప్లాంటు పెట్టాలన్నది ఆలోచన. మౌంట్ కెల్లెట్ క్యాపిటల్ మేనేజ్మెంట్, టీవీఎస్ క్యాపిటల్, అజయ్ పిరమల్ ఇండియా వెంచర్ అడ్వైజర్స్‌కు మెడ్‌ప్లస్‌లో 70 శాతం వాటా ఉంది. ఈ వాటాను కొనేందుకు భారత్‌తోపాటు మరో దేశానికి చెందిన ప్రైవేటు ఈక్విటీ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. ఈ ప్రక్రియ 2015 లోనే పూర్తవుతుంది.