న్యూఢిల్లీ: ఫార్మసీ దుకాణాల సంస్థ మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్, ట్రావెల్ టెక్నాలజీ సేవల్లోని రేట్‌గెయిన్ ట్రావెల్ టెక్నాలజీస్ మరో నాలుగు కంపెనీల ఐపీవోలకు సెబీ ఆమోదం లభించింది. సూక్ష్మ రుణాల సంస్థ ఫ్యూజన్ మైక్రో ఫైనాన్స్, రిటైల్ వెల్త్ మేనేజ్‌మెంట్ (పెట్టుబడుల నిర్వహణ సేవలు) సంస్థ ప్రుడెంట్ కార్పొరేట్ అడ్వైజరీ సర్వీసెస్, ట్రాక్సన్ టెక్నాలజీస్, పురానిక్ బిల్డర్స్ ఐపీవోలు ఆమోదం పొందిన వాటిల్లో ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో ఈ కంపెనీలు ఐపీవో దరఖాస్తులను సెబీ వద్ద నమోదు చేశాయి. ఈ నెల 16–18 తేదీల మధ్య సెబీ నుంచి వీటికి పరిశీలనల లేఖలు లభించినట్టు అందుబాటులోని సమాచారం ఆధారంగా తెలుస్తోంది.
మెడ్‌ప్లస్ రూ.1,539 కోట్లు..
మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్ రూ.1,639 కోట్లను ఐపీవో రూపంలో సమీకరించనుంది. ఇందులో రూ.600 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా (ఈక్విటీని పెంచడం ద్వారా) జారీ చేయనున్నారు. మరో రూ.1039 కోట్ల విలువ చేసే షేర్లను కంపెనీలో ప్రస్తుతం వాటాలు కలిగిన ఇన్వెస్టర్లు ఆఫర్ ఫర్‌సేల్ (ఓఎఫ్‌ఎస్) రూపంలో విక్రయించనున్నారు. ఇందులో లోన్ ఫ్యూరో ఇన్వెస్ట్‌మెంట్స్ రూ.450 కోట్ల మేర, పీఐ అపార్చునిటీస్ ఫండ్ –1 రూ.500 కోట్ల మేర, ఇతర వాటాదారులు మరో రూ.89 కోట్ల మేర విక్రయించనున్నారు. ఐపీవోలో తాజాగా జారీ చేసే వాటాల ద్వారా సమీకరించే నిధులను మూలధన అవసరాల కోసం మెడ్‌ప్లస్ వినియోగించనుంది.
రేట్‌గెయిన్
ఈ కంపెనీ రూ.400 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఓఎఫ్‌ఎస్ రూపంలో 2.26 కోట్ల షేర్లను విక్రయించనుంది. తాజా ఈక్విటీ రూపంలో సమీకరించే నిధులను రుణ భారం తగ్గించుకునేందుకు కంపెనీ వినియోగించనుంది. మరికొంత నిధులను వృద్ధి కోసం ఖర్చు పెట్టనుంది.
ఫ్యూజన్ మైక్రోఫైనాన్స్
ఈ సంస్థ తాజా ఈక్విటీ రూపంలో రూ.600 కోట్ల విలువైన షేర్లను ఐపీవోలో భాగంగా ఆఫర్ చేయనుంది. అలాగే, 2.19 కోట్ల షేర్లను ఓఎఫ్‌ఎస్ కింద ప్రమోటర్లు, ఇతర వాటాదారులు విక్రయించనున్నారు. వార్‌బర్గస్ పింకస్ తదితర అంతర్జాతీయ సంస్థలకు ఈ కంపెనీలో వాటాలున్నాయి. ప్రుడెంట్ కార్పొరేట్ అడ్వైజరీ సర్వీసెస్ ఐపీవోలో 85,49,340 షేర్లను ప్రస్తుత వాటాదారులే విక్రయించనున్నారు. పురానిక్ బిల్డర్స్ సంస్థ రూ.510 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనుండగా.. 9.45 లక్షల షేర్లను ప్రమోటర్ల గ్రూపు విక్రయించనుంది. ట్రాక్సన్ టెక్నాలజీస్ ఐపీవోలో భాగంగా 3.86 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ఇతర వాటాదారులు ఓఎఫ్‌ఎస్ రూపంలో ఆఫర్ చేయనున్నారు.
గో ఫ్యాషన్ ఐపీవో సక్సెస్
135 రెట్ల స్పందన
న్యూఢిల్లీ: మహిళల బోటమ్‌వేర్ విక్రయాల్లోని గోఫ్యాషన్ ఇండియా లిమిటెడ్ ఐపీవోకు అనూహ్య స్పందన వచ్చింది. కంపెనీ ఐపీవోలో భాగంగా 80,79,491 షేర్లను ఆఫర్ చేస్తుండగా.. 109,44,34,026 షేర్ల కోసం బిడ్లు దాఖలయ్యాయి. ఈ ఐపీవో ద్వారా కంపెనీ రూ.1,013 కోట్లను సమీకరించనుంది. నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల విభాగంలో ఆఫర్ చేస్తున్న షేర్లతో పోలిస్తే 262 రెట్లు అధికంగా బిడ్లు వచ్చాయి. క్యాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల విభాగంలో 100 రెట్లు స్పందన వచ్చింది. రిటైల్ ఇన్వెస్టర్ల కోటా కూడా 50 రెట్ల బిడ్లను అందుకుంది. తాజా ఈక్విటీ రూపంలో రూ.125 కోట్ల షేర్లను ఆఫర్ చేస్తుండగా, ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో 1,28,78,389 షేర్లను విక్రయిస్తోంది. గో ఫ్యాషన్ ఇండియా ‘గో కలర్స్’ పేరుతో సొంత స్టోర్లను దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment