మేడిగడ్డ ప్రాజెక్టుకు ఇంచు భూమి ఇవ్వం
మహదేవపూర్ మండలం సూరారం రైతులు
కాళేశ్వరం: మేడిగడ్డ కాళేశ్వరం బ్యారేజీకి ఇంచు భూమికూడా ఇవ్వమని సూరారం రైతులు స్పష్టంచేశారు. స్థానిక ఐబీ విశ్రాంతి భవనంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. రైతులతో చర్చించకుండానే ముంపు భూములను సర్వే చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మండలంలో సుమారుగా 3వేల ఎకరాలకు పైగా ముంపుకు గురవుతోందన్నారు. శాస్త్రీయ పద్ధతుల్లో నడుస్తున్నామని ప్రభుత్వం చెబుతూనే మరోవైపు రైతులను నిర్బంధించి పోలీసులతో బందోబస్తు పెట్టి సమావేశాలు ఏర్పాటుచేయడమేనా అని గుర్తు చేశారు. తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ రైతులను పట్టించుకోవడంలేదని ఆరోపించారు. టీవీ షోలపై ఉన్నంత మక్కువ రైతులపైన లేదని విమర్శించారు. గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించకుండా డీపీఆర్‌ప్రకటించడం, టెండర్లు పిలవడం, క్యాంపులు ఏర్పాటు చేయించడం సరికాదని పేర్కొన్నారు. తెలంగాణ, మహారాష్ట్రల సీఎంలు ప్రాజెక్టుల ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా కేసీఆర్ వద్ద మార్కులు కొట్టెయడానికి ఇతర నియోజకవర్గ నాయకులు కాళేశ్వరంలో క్షీరాభిషేకాలు చేశారన్నారు. ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందించాలని కోరారు. నాగుల లక్ష్మారెడ్డి, చల్ల కృష్ణారెడ్డి, బండం శ్రీనివాస్‌రెడ్డి, చల్ల చెంద్రయ్య, ములుకల్ల శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.