'ఆ జర్నలిస్ట్‌లను స్వదేశం పంపవద్దు'
దేశంలోని ఇద్దరు భారతీయ జర్నలిస్టులు తిరిగి స్వదేశానికి వెళ్లిపోవాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ద పాకిస్థాన్ - ఇండియా పీపుల్స్ ఫోరమ్ ఫర్ పీస్ అండ్ డెమెక్రసీ (పీఐపీఎఫ్పీడీ) మంగళవారం పాకిస్థాన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మంగళవారం ముంబైలో పీఐపీఎఫ్పీడీ కార్యాలయ ప్రతినిధులు ఆశా హన్స్, జతిన్ దేశాయిలు మాట్లాడుతూ...పాకిస్థాన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు జర్నలిస్టులు మీనా మీనన్ (ద హిందూ), ఎస్.ఫిలప్ (పీటీఐ)ల వీసా గడువును పోడిగించాలని ఆ దేశ ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగుతున్నాయి... ఇలాంటి సమయంలో జర్నలిస్టులను స్వదేశాలకు వెళ్లిపోవాలని ఆదేశించడం పొరుగుదేశమైన పాక్‌కు అంత శ్రేయస్కరం కాదని వారు ఆభిప్రాయపడ్డారు.
వీసా విధానంలో మరిన్ని అంశాలపై భారత్, పాక్ దేశాలు ఓ అవగాహనకు రావల్సిన అవశ్యకత ఉందని వారు ఈ సందర్బంగా అభిప్రాయపడ్డారు. మీనా మీనన్, ఫిలిప్‌లకు న్యాయం జరగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌లో విధులు నిర్వర్తిస్తున్న మీనా మీనన్, ఎస్.ఫిలిప్ భారతీయులు వీసా గడువు ఈ ఏడాది మార్చితో ముగిసింది. అయితే ఆ గడువును వారు పునరుద్దరించుకోలేదు. దాంతో సదరు భారతీయ జర్నలిస్టులు ఇద్దరు వారం రోజుల్లోగా స్వదేశం వెళ్లిపోవాలని పాక్ ప్రభుత్వ ఆదేశించిన సంగతి తెలిసిందే. పాక్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఇప్పటికే ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, ప్రెస్ క్లబ్ ఆఫ్ ముంబైలు ఖండించాయి.