కాల్పుల ఘటన మీరట్ ముఠా పని అయ్యుండొచ్చు..!
సూర్యాపేట: ఇర్ఫాన్ అనే వ్యక్తి సూర్యాపేట బస్టాండ్ లో కాల్పులకు పాల్పడిన దుండగులలో ఒకడయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, ఇతడు ఉత్తరప్రదేశ్ లోని మీరట్ ప్రాంతానికి చెందినవాడని భావిస్తున్నారు. ఇతనికి ఈ ఘటనతో ఏమైనా సంబంధం ఉందేమోన్న కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తామని తెలిపారు. దుండగుల కాల్పుల్లో గాయపడిన సీఐ మొగులయ్యతో పాటు ఓ గన్మెన్ ప్రస్తుతం హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు నక్సల్స్ దాడులకు పాల్పడ్డారా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.
నల్లగొండ జిల్లా సూర్యాపేట హైటెక్ బస్టాండ్లో బుధవారం రాత్రి 11 గంటల తర్వాత కాల్పులు చోటుచేసుకున్నాయి. వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులపై కొందరు దుండగులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. దాంతో కానిస్టేబుల్ లింగయ్యతో పాటు హోంగార్డు మహేశ్ అక్కడికక్కడే మృతిచెందాడన్న విషయం తెలిసిందే.