'నిందితులతో సీబీఐ డైరెక్టర్ భేటీ సరికాదు'
సీబీఐ డైరెక్టర్ ఇంటికి సందర్శకుల పేర్ల వెల్లడి వ్యవహారంలో గతంలో ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకోవాలని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుప్రీంకోర్టును కోరారు. పేర్లు వెల్లడించడం వల్ల వచ్చే ఉపయోగం ఏమీ ఉండబోదని ఆయన వాదించారు. అయితే, సీబీఐ డైరెక్టర్ వ్యక్తిగత పరిచయస్తులు కానివాళ్లు ఎవరైనా ఉంటే వారెవరో తెలుసుకునే హక్కు ఉంటుందని ఆయన చెప్పారు.
2జీ కేసుల్లో నిందితులతో సీబీఐ డైరెక్టర్ సమావేశం కావడం సరైంది కాదని అన్నారు. ఇది కోర్టు ధిక్కరణ అవుతుందా.. కాదా అనే విషయాన్ని పరిశీలించాల్సి ఉందన్నారు. ఈ వ్యవహారం సీబీఐ డైరెక్టర్ వ్యక్తిగత అంశం కాదు కాబట్టి, అధికారిక హోదాలో ఆయన ప్రవర్తన ఎలా ఉందో తెలుసుకునే హక్కు మాత్రం ప్రజలకు ఉంటుందన్నారు.