meeting conducted
-
'రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించండి'
న్యూఢిల్లీ: ఆదివాసీల సమస్యలు పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆదివాసీల అస్తిత్వ పోరాట సభను నిర్వహించారు. ముఖ్యంగా లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించడం, పోడు భూములకు పట్టాలు కల్పించడం, ఏజెన్సీ ప్రాంతాల్లో నకిలీ ధ్రువ పత్రాలను అరికట్టాలనే డిమాండ్లతో ఈ సభ జరిగింది. ఈ సభలో తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ.. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం కల్పించిన ఆదివాసీల హక్కులను కేంద్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు. 1976 ఎమర్జెన్సీ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చారన్నారు. లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చడంతో ఆదివాసీలు నష్ట పోతున్నారని ఆయన పేర్కొన్నారు. లంబాడాలను ఎస్టీ జాబితాలో కలపడం వలన ఆదివాసీ యువత విద్య, ఉపాధి కోల్పోతున్నారని అన్నారు. ఎస్టీ రిజర్వేషన్లలో 97శాతం లంబాడాలే అనుభవిస్తున్నారని బీజేపీ ఎంసీ సోయంబాపూరావు అన్నారు రాజ్యాంగలోని ఆర్టికల్ 342 ప్రకారం చట్టబద్దత లేని సుగాలీలు, లంబాడి కులాలను తెలంగాణ రాష్ట్రంలో ST జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఎస్టీ రిజర్వేషన్ల కోసం వివిధ రాష్ట్రాల నుంచి లంబాడాలు తెలంగాణకి వలస వస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. అప్పట్లో లక్షా ఇరవై వేలు ఉన్న జనాభా ఎప్పుడు 20 లక్షలకు చేరుకుందన్న విషయాన్ని ప్రభుత్వాలు గమనించాలన్నారు. లంబాడాల వల్ల ఆదివాసీలు భూములు, ఉద్యోగాలు, విద్యా అవకాశాలు కోల్పోతున్నారన్నారు. ఆదివాసుల హక్కుల కోసం పార్లమెంటులో రాజీలేని పోరాటం చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ బహిరంగ సభకు ఆదివాసీ మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఆదివాసీ సంఘాల నాయకులు, తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని ఆయా ప్రాంతాల ఆదివాసీ గిరిజనులు తరలి వచ్చారు. . -
బాలుడి హత్య కేసులో నలుగురిపై సస్పెన్షన్ వేటు
కడప అర్బన్: వైఎస్సార్ జిల్లా కడప నగరంలోని ప్రభుత్వ బాలుర గహంలో ఈనెల 20వ తేదీ తెల్లవారుజామున ముస్తఫా అనే బాలుడు దారుణ హత్యకు గురైన సంఘటనకు సంబంధించి నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ బాలుర గృహాల విభాగం రాష్ట్ర డైరెక్టర్ శారద శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం ఆమె బాలుర గృహాన్ని పరిశీలించారు. ప్రభుత్వ బాలుర గృహం సూపరింటెండెంట్ అన్నాజీ, డిప్యూటీ సూపరింటెండెంట్ సుదర్శన్‌రెడ్డి, సూపర్వైజర్లు, సిబ్బందిని విడివిడిగా విచారించారు. అనంతరం అక్కడ పనిచేస్తున్న హెడ్ సూపర్వైజర్, మరో ముగ్గురు సూపర్వైజర్లను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 20వ తేదీన ప్రభుత్వ బాలుర గృహంలోని పరిశీలన గదిలో ఉన్న ఓ బాలుడు దారుణ హత్యకు గురైన సంఘటనపై సమగ్రంగా విచారిస్తున్నామన్నారు. ముస్తఫా అనే బాలుడిని అదే గదిలో ఉన్న మరో బాలుడు మహబూబ్‌బాషా గొంతు చుట్టూ టవల్ బిగించి హత్య చేశాడని, అంతకుముందు రోజు ఉదయం నుంచి వారి మధ్య వాగ్వాదంతోపాటు ఘర్షణ జరిగిందనే విషయాన్ని పరిశీలనలో ఉన్న సూపర్వైజర్లు తెలుసుకోలేక పోయారన్నారు. వారు తెలుసుకుని అప్రమత్తంగా వ్యవహరించి ఉంటే ఈ సంఘటనజరిగి ఉండేది కాదన్నారు. దీనికి బాధ్యతగా హెడ్ సూపర్వైజర్ సుబ్రమణ్యం, విధుల్లో ఉన్న సూపర్వైజర్ పురుషోత్తంరెడ్డి, బలరామరాజు, వరప్రకాశ్లను సస్పెండ్ చేశామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పరిశీలన గృహంలో బాలురను చూసుకునే సిబ్బందికి శిక్షణ ఇప్పిస్తామన్నారు. కడప ప్రభుత్వ బాలుర గృహంలో పనిచేస్తున్న ఉద్యోగులంతా దాదాపు 25 నుంచి 28 సంవత్సరాల నుంచి విధుల్లో అనుభవం కలిగిన వారేనన్నారు. అలాంటి పరిస్థితిలో ఈ సంఘటన జరగడం ముమ్మాటికీ సిబ్బంది నిర్లక్ష్యమేనని భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ బాలుర గృహం జాయింట్ డైరెక్టర్ ప్రసాద్‌మూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.