న్యూఢిల్లీ: ఆదివాసీల సమస్యలు పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆదివాసీల అస్తిత్వ పోరాట సభను నిర్వహించారు. ముఖ్యంగా లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించడం, పోడు భూములకు పట్టాలు కల్పించడం, ఏజెన్సీ ప్రాంతాల్లో నకిలీ ధ్రువ పత్రాలను అరికట్టాలనే డిమాండ్‌లతో ఈ సభ జరిగింది. ఈ సభలో తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ.. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం కల్పించిన ఆదివాసీల హక్కులను కేంద్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు. 1976 ఎమర్జెన్సీ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చారన్నారు. లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చడంతో ఆదివాసీలు నష్ట పోతున్నారని ఆయన పేర్కొన్నారు. లంబాడాలను ఎస్టీ జాబితాలో కలపడం వలన ఆదివాసీ యువత విద్య, ఉపాధి కోల్పోతున్నారని అన్నారు. ఎస్టీ రిజర్వేషన్లలో 97శాతం లంబాడాలే అనుభవిస్తున్నారని బీజేపీ ఎంసీ సోయంబాపూరావు అన్నారు
రాజ్యాంగలోని ఆర్టికల్ 342 ప్రకారం చట్టబద్దత లేని సుగాలీలు, లంబాడి కులాలను తెలంగాణ రాష్ట్రంలో ST జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఎస్టీ రిజర్వేషన్ల కోసం వివిధ రాష్ట్రాల నుంచి లంబాడాలు తెలంగాణకి వలస వస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. అప్పట్లో లక్షా ఇరవై వేలు ఉన్న జనాభా ఎప్పుడు 20 లక్షలకు చేరుకుందన్న విషయాన్ని ప్రభుత్వాలు గమనించాలన్నారు. లంబాడాల వల్ల ఆదివాసీలు భూములు, ఉద్యోగాలు, విద్యా అవకాశాలు కోల్పోతున్నారన్నారు. ఆదివాసుల హక్కుల కోసం పార్లమెంటులో రాజీలేని పోరాటం చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ బహిరంగ సభకు ఆదివాసీ మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఆదివాసీ సంఘాల నాయకులు, తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని ఆయా ప్రాంతాల ఆదివాసీ గిరిజనులు తరలి వచ్చారు.
.
Comments
Please login to add a commentAdd a comment