బాలుడి హత్య కేసులో నలుగురిపై సస్పెన్షన్‌ వేటు | employes suspended in murder case | Sakshi
Sakshi News home page

బాలుడి హత్య కేసులో నలుగురిపై సస్పెన్షన్‌ వేటు

Published Sun, Oct 23 2016 12:11 AM | Last Updated on Fri, Jul 12 2019 3:37 PM

employes suspended in murder case

కడప అర్బన్‌: వైఎస్సార్‌ జిల్లా కడప నగరంలోని ప్రభుత్వ బాలుర గహంలో ఈనెల 20వ తేదీ తెల్లవారుజామున ముస్తఫా అనే బాలుడు దారుణ హత్యకు గురైన సంఘటనకు సంబంధించి నలుగురు సిబ్బందిని సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వ బాలుర గృహాల విభాగం రాష్ట్ర డైరెక్టర్‌ శారద శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం ఆమె బాలుర గృహాన్ని పరిశీలించారు. ప్రభుత్వ బాలుర గృహం సూపరింటెండెంట్‌ అన్నాజీ, డిప్యూటీ సూపరింటెండెంట్‌ సుదర్శన్‌రెడ్డి, సూపర్‌వైజర్లు, సిబ్బందిని విడివిడిగా విచారించారు. అనంతరం అక్కడ పనిచేస్తున్న హెడ్‌ సూపర్‌వైజర్, మరో ముగ్గురు సూపర్‌వైజర్లను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 20వ తేదీన ప్రభుత్వ బాలుర గృహంలోని పరిశీలన గదిలో ఉన్న ఓ బాలుడు దారుణ హత్యకు గురైన సంఘటనపై సమగ్రంగా విచారిస్తున్నామన్నారు. ముస్తఫా అనే బాలుడిని అదే గదిలో ఉన్న మరో బాలుడు మహబూబ్‌బాషా గొంతు చుట్టూ టవల్‌ బిగించి హత్య చేశాడని, అంతకుముందు రోజు ఉదయం నుంచి వారి మధ్య వాగ్వాదంతోపాటు ఘర్షణ జరిగిందనే విషయాన్ని పరిశీలనలో ఉన్న సూపర్‌వైజర్లు తెలుసుకోలేక పోయారన్నారు. వారు తెలుసుకుని అప్రమత్తంగా వ్యవహరించి ఉంటే ఈ సంఘటనజరిగి ఉండేది కాదన్నారు. దీనికి బాధ్యతగా హెడ్‌ సూపర్‌వైజర్‌ సుబ్రమణ్యం, విధుల్లో ఉన్న సూపర్‌వైజర్‌ పురుషోత్తంరెడ్డి, బలరామరాజు, వరప్రకాశ్‌లను సస్పెండ్‌ చేశామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పరిశీలన గృహంలో బాలురను చూసుకునే సిబ్బందికి శిక్షణ ఇప్పిస్తామన్నారు. కడప ప్రభుత్వ బాలుర గృహంలో పనిచేస్తున్న ఉద్యోగులంతా దాదాపు 25 నుంచి 28 సంవత్సరాల నుంచి విధుల్లో అనుభవం కలిగిన వారేనన్నారు. అలాంటి పరిస్థితిలో ఈ సంఘటన జరగడం ముమ్మాటికీ సిబ్బంది నిర్లక్ష్యమేనని భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ బాలుర గృహం జాయింట్‌ డైరెక్టర్‌ ప్రసాద్‌మూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement