ప్రతిచోటా ‘ఏపీ’ చర్చ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం జరిగిన పరిణామాలపై తెలంగాణ ప్రజానీకం ప్రత్యేక ఆసక్తిని కనబర్చింది. ఏపీలో అధికార వికేంద్రీకరణ దిశగా మూడు రాజధానులను ఏర్పాటు చేస్తూ అక్కడి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుపై రోజంతా జరిగిన చర్చను తెలంగాణలోనూ ఆసక్తిగా ఫాలో అయ్యారు. రాజకీయ వర్గాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, సాధారణ ప్రజానీకం కూడా రోజంతా టీవీలకు అతుక్కుపోయారు. పొరుగు రాష్ట్రం కావడం, ఒకప్పుడు కలిసి ఉన్న ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలతో పాటు రాజధానుల గురించి అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కావడంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ కనిపించింది.
హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆంధ్రవాసులు, తెలంగాణవాసులు కూడా టీవీలను చూస్తూ ఉండిపోయారు. అధికార వికేంద్రీకరణ ఆవశ్యకతను అక్కడి ప్రభుత్వ వర్గాలు వివరించిన తీరు, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, విభజన ఉద్యమాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కమిటీల నివేదికలపై జరిగిన చర్చ అందరిలోనూ చర్చనీయాంశమయింది. రాజకీయ పార్టీల కార్యాలయాలు, పార్టీల నాయకుల ఇళ్లలో చాలా వరకు టీవీలు చూస్తూనే గడిపారు.
ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్న చోట్ల టీవీలకు అతుక్కుపోయారు. ఏ ఇద్దరు రాజకీయ నాయకులు కలిసినా ఏపీలో ఏం జరుగుతుందనే అంశంపైనే మాట్లాడుకోవడం గమనార్హం. అధికార వికేంద్రీకరణతో పాటు అమరావతి రాజధానిగా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత అక్కడ టీడీపీ ప్రభుత్వ హయాంలో భూముల కొనుగోళ్లలో ఇన్సైడర్ ట్రేడింగ్ గురించీ తెలంగాణలో చర్చించుకోవడం కనిపించింది.
టీడీపీ నేతలు వేల ఎకరాల భూములను కొనుగోలు చేయడం, పరిహారం పంపిణీ, రాజధాని నిర్మాణంలో జరిగిన అవకతవకలు తదితర విషయాల గురించి మాట్లాడుకున్నారు. అమరావతి రాజధాని విషయంలో దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే అక్కడ ఉన్న అననుకూలతలనూ ఏపీ ప్రభుత్వ వర్గాలు అసెంబ్లీలో కూలంకషంగా వివరించడంతో తెలంగాణలో నివసిస్తోన్న మెజార్టీ ఆంధ్ర వాసుల్లోనూ ఏపీ ప్రభుత్వ నిర్ణయం పట్ల సానుకూలత వ్యక్తం కావడం గమనార్హం.