జిల్లాలో గడపగడపకూ వైఎస్సార్ భేష్
ఉంగుటూరు : జిల్లాలో గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయని, ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు తమ ఇబ్బందులను ఎకరువు పెడుతున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని అన్నారు. బుధవారం ఉంగుటూరు నియోజకవర్గం పెదనిండ్రకొలనులో వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశం ఆ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ పుప్పాల వాసుబాబు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆళ్ల నాని మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేయటానికి జిల్లాలోని అన్ని మండలాల్లో మండల కాంగ్రెస్ కమిటీ సమావేశాలను నిర్వహించి, కార్యకర్తలకు మనోధైర్యంతో పాటు నూతనోత్సహం తీసుకువస్తామన్నారు. వినాయకచవితి వెళ్లిన తరువాత జిల్లాలో 48 మండలాల్లో సమావేశాలు నిర్వహిస్తామని, తేదీలను త్వరలో ఖరారు చేస్తామన్నారు. టీడీపీ రెండేళ్ల ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు విసుగు చెందుతున్నారన్నారు. టీడీపీ పాలనలో పచ్చచొక్కాల వారికే సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. పేదల కష్టాలు తెలుసుకోవటం కోసమే ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేసిన మోసాలను, పేదలకు అందాల్సిన పథకాలు అందటంలేదని ఆయన దుయ్యబట్టారు. చంద్రబాబును నమ్మినందుకు తమకు తగిన గుణపాఠం చెప్పారని పేదలు ఆవేదన చెందుతున్నారని నాని చెప్పారు. వాసుబాబు మాట్లాడుతూ నియోజకవర్గంలో గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో అన్నివర్గాల ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని, రేషన్ సరుకులను 9 నుంచి 2కు కుదించి పేదలకు అన్యాయం చేసిందన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి మాజేటి సురేష్, మండల పార్టీ కన్వీనర్లు మరడ మంగరావు (ఉంగుటూరు), సంకు సత్యకుమార్ (నిడమర్రు), ఎంపీటీసీ సభ్యులు కోడూరి రాంబాబు, గొట్టుముక్కల విశ్వనాథరాజు, వాసా రాజు, కె.త్రిమూర్తులు, తమ్ముం శ్రీను, పుప్పాల గోపి, అంబళ్ల రామకష్ణ, గంపా అప్పలస్వామి, గొర్లె శ్రీను, మత్స శ్రీను, కోటి బాలు, రాము తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఉంగుటూరులో ఆళ్ల నానికి మరడ మంగరావు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.