Mega Textiles Park
-
అభివృద్ధి అడుగులు
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పనున్న కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కుకు ఆదివారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శంకుస్థాపన చేయనున్నారు. టెక్స్టైల్స్ పార్కుతో పాటు వరంగల్ ఔటర్ రింగురోడ్డు, కాజీపేట రైల్వే ఓవర్ బ్రిడ్జి, ఐటీ టవర్స్ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం కాకతీయ టెక్స్టైల్స్ పార్కు స్థలంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. సీఎం పర్యటన గంటన్నర.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వరంగల్‌లో గంటన్నర పాటు పర్యటించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయల్దేరి మ«ధ్యాహ్నం 3:30 గంటలకు వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట సమీపంలో కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. వెంటనే కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కు, వరంగల్ అవుటర్ రింగురోడ్డు, ఫాతిమా రైల్వే ఓవర్ బ్రిడ్జి, మడికొండ ఐటీ టవర్స్ పనులకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 3:45 గంటలకు అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4:55 గంటలకు సభాస్థలి నుంచి హెలికాప్టర్లో బయల్దేరి 5:55 గంటలకు బేగంపేట తిరిగి వెళ్తారు. రెండు లక్షల మందితో సభ బహిరంగ సభకు రెండు లక్షల మందిని తరలించాలని టీఆర్ఎస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు పాత వరంగల్ జిల్లాలో ఉన్న పన్నెండు నియోజకవర్గాలకు ఇన్చార్జిలను నియమించి జనసమీకణ చేస్తున్నారు. ఇందుకోసం 2,000 బస్సులను వినియోగిస్తున్నారు. గత సోమవారం నుంచి ప్రతి రోజు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి శంకుస్థాపన, సభా ఏర్పాట్ల పనులను పర్యవేక్షిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పార్కింగ్, హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. సీఎం పర్యటన బందోబస్తులో 2,500 మంది పోలీసు సిబ్బంది పాల్గొంటున్నారు. రెండు వేల ఎకరాల్లో.. ఫైబర్ టూ ఫ్యాబ్రిక్ లక్ష్యంతో దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్స్ పార్కును వరంగల్‌కు సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. ఈ పార్కు ఏర్పాటు కోసం రెండు వేల ఎకరాల స్థలం అవసరం కాగా, వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ, సంగెం మండలాల పరిధిలో ఇప్పటికే 1,200 ఎకరాల స్థలాన్ని సేకరించారు. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం సుమారు 1,100 కోట్లు ఖర్చు చేయబోతుంది. ఐదేళ్లలో ఈ పార్కు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయనున్నారు. పార్కు పూర్తయ్యేనాటికి కనీసం రూ. 11,500 కోట్లు పెట్టుబడులు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. శంకుస్థాపన రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు హన్మకొండ హరిత హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి కేటీఆర్‌లు 15 జాతీయ, అంతర్జాతీయ వస్త్ర కంపెనీలతో అవగాహన ఒప్పందం చేసుకోనున్నారు. ఈ పరిశ్రమతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.20 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వరంగల్ మణిహారం ఓఆర్ఆర్ సీఎం శంకుస్థాపన చేయనున్న ఓఆర్ఆర్, కాజీపేట ఆర్వోబీ, ఐటీ టవర్స్‌తో వరంగల్ రూపురేఖలు మారనున్నాయి. జరగబోయే అభివృద్ధి పనులకు అనుగుణంగా వరంగల్ నగరం చుట్టూ నిర్మిస్తున్న ఔటర్ రింగురోడ్డుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 669.5 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో 17.7 కిలోమీటర్ల పొడవైన ఓఆర్ఆర్ను నిర్మించనున్నారు. దీనికి 420 ఎకరాల స్థలం సేకరించాల్సి ఉంది. హన్మకొండ–హైదరాబాద్ మార్గంలో కాజీపేట వద్ద ఉన్న ఆర్వోబీ ఇరుకుగా మారడంతో తరచుగా ట్రాఫిక్‌జాం అవుతోంది. దీంతో ఇక్కడ ప్రస్తుతం ఉన్న వంతెనకు సమాంతరంగా మరో ఆర్వోబీ నిర్మాణానికి రూ.78 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. వరంగల్‌లో ఐటీ పరిశ్రమకు కోసం ప్రస్తుతం మడికొండలో ఉన్న ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్లో రూ. 25 కోట్లతో అదనపు భవనాలు నిర్మించనున్నారు. -
పేదల భూములపై పచ్చ గద్దలు
♦ పెదగంజాంలో టెక్స్టైల్స్ పార్కుకు ప్రభుత్వ ప్రకటన ♦ రాజధాని తరహాలో భూ దందాకి దిగిన టీడీపీ నేతలు ♦ దశాబ్దాల క్రితం రైతులకు ఇచ్చిన భూములు లాక్కునే వ్యూహం ♦ అప్పనంగా రూ.కోట్లు కొల్లగొట్టేందుకు పన్నాగం ♦ సహకరించకపోతే ఇబ్బందులు తప్పవంటూ బెదిరింపులు ♦ అధికార పార్టీ నేతలకు రెవెన్యూ అధికారుల వత్తాసు ♦ భూములిచ్చేది లేదంటున్న రైతులు, కూలీలు ♦ జీవనాధారం కోల్పోరుు రోడ్డున పడతామంటూ ఆవేదన జిల్లాలోని అధికార పార్టీ నేతలు రాజధాని తరహాలో భూ దందాకు తెరతీశారు. విలువైన పేదల భూములను అప్పనంగా కొట్టేసేందుకు పన్నాగం పన్నుతున్నారు. చినగంజాం మండలం పెదగంజాం పంచాయతీ పరిధిలో మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆ ప్రాంతంలోని భూములు అప్పగించాలంటూ స్థానిక నేతలు అక్కడి రైతులను బెదిరిస్తున్నారు. భూములిస్తే అంతో ఇంతో ముట్టజెబుతామని లేకపోతే బలవంతంగా లాక్కుంటామని హెచ్చరిస్తున్నారు. రైతుల దగ్గర భూములు గుంజుకొని వాటినే టెక్స్టైల్స్ పార్కుకు అప్పగించి కోట్లు కొట్టేసేందుకు స్థానిక పచ్చ నేత సమీప బంధువు వ్యూహం రచించారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దశాబ్దాలుగా ఆ భూములను నమ్ముకొని బతుకుతున్న రైతులు, రైతు కూలీలు ఏం చేయాలో పాలుపోక లబోదిబోమంటున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు ; ప్రభుత్వం పెదగంజాం ప్రాంతంలో మెగా టైక్స్టైల్స్ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. పార్కు నిర్మాణం ప్రైవేట్ సంస్థకు అప్పగించనున్నట్లు చెప్పింది. ఇందుకోసం 530 ఎకరాలకుపైగా భూములు సేకరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించింది. ఇదే అదునుగా నియోజకవర్గ అధికార పార్టీ ముఖ్యనేత సమీప బంధువు ఆ భూములు కొట్టేసి కోట్లు కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా పెదగంజాం పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 1160, 1161లలో వందలాది ఎకరాలు భూమి ఉందని, ఆ భూములలో మెగా టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి నివేదించారు. పార్కు నిర్మాణం కోసం అదే భూములను ఎంపిక చేయాలంటూ స్థానిక రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అధికారుల ద్వారా బెదిరింపులు.. రాజు గారు తలుచుకుంటే దెబ్బలకు కొదువ అన్న సామెతగా రెవెన్యూ అధికారులు పెదగంజాం భూములను సేకరించేందుకు రంగంలోకి దిగారు. దశాబ్దాలుగా ఆ భూములను నమ్ముకొని బతుకుతున్న రైతులు భూములివ్వమని తేల్చి చెప్పారు. దీంతో అధికార పార్టీ ముఖ్యనేత సమీప బంధువు రైతులపైఒత్తిడి తెచ్చారు. గతంలో ప్రభుత్వం ఆ భూములను డికెటిలుగా ఇచ్చిందని, వాటిని అప్పగించకపోతే పైసా ఇవ్వకుండా లాక్కుంటామని బెదిరింపులకు దిగారు. స్వచ్ఛందంగా భూములు అప్పగిస్తే అంతో.. ఇంతో ముట్టజెబుతామని సానుభూతి మాటలు చెప్పారు. ఇదే విషయాన్ని అధికారుల ద్వారా చెప్పించారు. దీంతో అధికారులు కూడా రైతులను బెదిరిస్తున్నారు. అప్పనంగా భూములు కొట్టేసి వాటిని రైతులతో రాయించుకొని, తర్వాత అదే భూములను టెక్స్టైల్ పార్కుకు అప్పగించి కోట్లలో లబ్ధి పొందేందుకు అధికార పార్టీ నేతలు వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే రైతులను బెదిరిస్తున్నట్లు సమాచారం. దీంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. గతంలో భూములిచ్చిన ప్రభుత్వం.. పెదగంజాం పంచాయతీ పరిధిలోని 1969 ప్రాంతంలో అమీన్‌నగర్ అనే గ్రామం ఉండేది. 150కిపైగా కుటుంబాలు అక్కడ నివసించేవారు. రొంపేరు కాలువకు దక్షిణం వైపున ఉన్న ఈ గ్రామం తరచూ వరదలకు గురయ్యేది. తీవ్ర తుపాను ప్రభావంతో 1970 ప్రాంతంలో ఏకంగా ఊరు మునిగిపోయింది. దీంతో గ్రామస్తులు ఆ ఊరు వదిలి కాలువ ఉత్తరం వైపు వలస వచ్చారు. 1972 ప్రాంతంలో బాధితులకు పాత అమీన్‌నగర్ ఉన్న ప్రాంతంలో సర్వే నెం.1160, 1161లో ఒక్కొక్కరికి ఎకరం చొప్పున దాదాపు 500 కుటుంబాలకు 530 ఎకరాలు భూములిచ్చారు. ప్రస్తుతం ఆ భూముల్లో రైతులు ఉప్పు సాగుతో పాటు, రొయ్యల చెరువులను ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారు. కొందరు చేపల వేట సాగిస్తూ పొట్టపోసుకుంటున్నారు. ఇక్కడ రైతులతో పాటు పెదగంజాం పంచాయతీ పరిధిలోని పెదగంజాం, పల్లెపాలెం, బుచ్చిగుంట. కోడూరివారిపాలెం, కాటం వారిపాలెం, ఏటిమొగ, ఆవలదొడ్డిగొల్లపాలెం తదితర గ్రామాలకు చెందిన 8 వేల మందికిపైగా రైతులు, రైతు కూలీలకు ఆ భూములే జీవనాధారం. ఇప్పుడు ప్రభుత్వం భూములను లాగేసుకుంటే అందరూ రోడ్డున పడాల్సి వస్తోంది. మరో చోట నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూముల్లో టైక్స్‌టైల్ పార్కును ఏర్పాటు చేసుకోవాలని రైతులతో పాటు వేలాది కూలీలు విన్నవిస్తున్నారు. అయినా అధికార పార్టీ నేతలు కోట్లు కొల్లగొట్టేందుకు రంగం సిద్ధం చేసుకొని ఆ భూములపై గద్దల్లా వాలారు.