అభివృద్ధి అడుగులు | Development steps | Sakshi
Sakshi News home page

అభివృద్ధి అడుగులు

Published Sun, Oct 22 2017 12:45 AM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM

Development steps - Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పనున్న కాకతీయ మెగా టెక్స్‌టైల్స్‌ పార్కుకు ఆదివారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శంకుస్థాపన చేయనున్నారు. టెక్స్‌టైల్స్‌ పార్కుతో పాటు వరంగల్‌ ఔటర్‌ రింగురోడ్డు, కాజీపేట రైల్వే ఓవర్‌ బ్రిడ్జి, ఐటీ టవర్స్‌ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం కాకతీయ టెక్స్‌టైల్స్‌ పార్కు స్థలంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొననున్నారు.  

సీఎం పర్యటన గంటన్నర..  
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వరంగల్‌లో గంటన్నర పాటు పర్యటించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి మ«ధ్యాహ్నం 3:30 గంటలకు వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట సమీపంలో కాకతీయ మెగా టెక్స్‌టైల్స్‌ పార్కు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. వెంటనే కాకతీయ మెగా టెక్స్‌టైల్స్‌ పార్కు, వరంగల్‌ అవుటర్‌ రింగురోడ్డు, ఫాతిమా రైల్వే ఓవర్‌ బ్రిడ్జి, మడికొండ ఐటీ టవర్స్‌ పనులకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 3:45 గంటలకు అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4:55 గంటలకు సభాస్థలి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 5:55 గంటలకు బేగంపేట తిరిగి వెళ్తారు.   

రెండు లక్షల మందితో సభ 
బహిరంగ సభకు రెండు లక్షల మందిని తరలించాలని టీఆర్‌ఎస్‌ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు పాత వరంగల్‌ జిల్లాలో ఉన్న పన్నెండు నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను నియమించి జనసమీకణ చేస్తున్నారు. ఇందుకోసం 2,000 బస్సులను వినియోగిస్తున్నారు. గత సోమవారం నుంచి ప్రతి రోజు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి శంకుస్థాపన, సభా ఏర్పాట్ల పనులను పర్యవేక్షిస్తున్నారు. ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా పార్కింగ్, హోల్డింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేశారు. సీఎం పర్యటన బందోబస్తులో 2,500 మంది పోలీసు సిబ్బంది పాల్గొంటున్నారు.  

రెండు వేల ఎకరాల్లో.. 
ఫైబర్‌ టూ ఫ్యాబ్రిక్‌ లక్ష్యంతో దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్స్‌ పార్కును వరంగల్‌కు సీఎం కేసీఆర్‌ మంజూరు చేశారు. ఈ పార్కు ఏర్పాటు కోసం రెండు వేల ఎకరాల స్థలం అవసరం కాగా, వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండ, సంగెం మండలాల పరిధిలో ఇప్పటికే 1,200 ఎకరాల స్థలాన్ని సేకరించారు. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం సుమారు 1,100 కోట్లు ఖర్చు చేయబోతుంది. ఐదేళ్లలో ఈ పార్కు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయనున్నారు. పార్కు పూర్తయ్యేనాటికి కనీసం రూ. 11,500 కోట్లు పెట్టుబడులు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. శంకుస్థాపన రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు హన్మకొండ హరిత హోటల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి కేటీఆర్‌లు 15 జాతీయ, అంతర్జాతీయ వస్త్ర కంపెనీలతో అవగాహన ఒప్పందం చేసుకోనున్నారు. ఈ పరిశ్రమతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.20 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 

వరంగల్‌ మణిహారం ఓఆర్‌ఆర్‌ 
సీఎం శంకుస్థాపన చేయనున్న ఓఆర్‌ఆర్, కాజీపేట ఆర్వోబీ, ఐటీ టవర్స్‌తో వరంగల్‌ రూపురేఖలు మారనున్నాయి. జరగబోయే అభివృద్ధి పనులకు అనుగుణంగా వరంగల్‌ నగరం చుట్టూ నిర్మిస్తున్న ఔటర్‌ రింగురోడ్డుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 669.5 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో 17.7 కిలోమీటర్ల పొడవైన ఓఆర్‌ఆర్‌ను నిర్మించనున్నారు. దీనికి 420 ఎకరాల స్థలం సేకరించాల్సి ఉంది. హన్మకొండ–హైదరాబాద్‌ మార్గంలో కాజీపేట వద్ద ఉన్న ఆర్వోబీ ఇరుకుగా మారడంతో తరచుగా ట్రాఫిక్‌జాం అవుతోంది. దీంతో ఇక్కడ ప్రస్తుతం ఉన్న వంతెనకు సమాంతరంగా మరో ఆర్వోబీ నిర్మాణానికి రూ.78 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. వరంగల్‌లో ఐటీ పరిశ్రమకు కోసం ప్రస్తుతం మడికొండలో ఉన్న ఐటీ ఇంక్యుబేషన్‌ సెంటర్‌లో రూ. 25 కోట్లతో అదనపు భవనాలు నిర్మించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement