ఫిబ్రవరిలోనే సీ ప్లేన్ సేవలు
సాక్షి, ముంబై: అంతా సవ్యంగా సాగితే ఫిబ్రవరిలో సముద్రమార్గం మీదుగా విమాన (సీ ప్లేన్) సేవలు ప్రారంభమయ్యే అవకాశముంది. బీపీటీ తప్ప మిగతా అన్ని శాఖల నుంచి అనుమతి వచ్చిందని మెహెర్ కంపెనీ ఎండీ సిద్ధార్థ్ వర్మ చెప్పారు. దీని నుంచి కూడా అనుమతి లభిస్తే తొలి విడతలో జుహూ సముద్ర తీరం నుంచి గిర్గావ్ (చర్నిరోడ్) చౌపాటి వరకు ఫిబ్రవరి నుంచి సీ ప్లేన్ సేవలు ప్రారంభిస్తామని తెలిపారు.
ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.750 చార్జీ వసూలు చేయాలని ఆలోచనలో ఉన్నామన్నారు. ‘ట్రాఫిక్ జామ్లో చిక్కుకోకుండా సమయానికి తమ గమ్యస్థానం చేరుకోవాలంటే ముంబైకర్లకు ఈ సీ ప్లేన్ సర్వీసులు ఎంతో దోహదపడతాయి. ఈ సేవలకి ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తుంద’ని వర్మ ఆశాభావం వ్యక్తం చేశారు.
నగరంలో బెస్ట్ బస్సులు, ట్యాక్సీలు, ఆటోలు, చివరకు లోకల్ రైళ్లు కూడా ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కిక్కిరిసి ఉంటున్నాయి. వీటి నుంచి ముంబైకర్లకు విముక్తి కలిగించాలనే ఉద్దేశంతో సీ ప్లేన్ సేవలు ప్రారంభించాలని కొన్ని సంవత్సరాల క్రితం మెహెర్ కంపెనీ భావించింది.
దీనికోసం పర్యావరణ, బాంబే పోర్టు ట్రస్టు (బీపీటీ), నావికా దళం, భద్రత తదితర శాఖల అనుమతి కోరింది. ఇందులో బాంబే పోర్టు ట్రస్టు మినహా మిగతా శాఖల నుంచి ఇటీవలే అనుమతి లభించింది. త్వరలో బీపీటీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశాలున్నాయి. దీంతో ఫిబ్రవరిలో ఈ సేవలు ప్రారంభించేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. సాధారణంగా రోడ్డు మార్గం మీదుగా జుహూ నుంచి గిర్గావ్ చేరుకోవాలంటే కనీసం గంటన్నరకుపైగా సమయం పడుతుంది. అదే సీ ప్లేన్లో వస్తే కేవలం ఏడు నిమిషాల్లోనే చేరుకోవచ్చు.
జుహూ నుంచి ట్యాక్సీలో వస్తే (ట్రాఫిక్ జాంలో) కనీసం రూ.300-450 వరకు చార్జీలు అవుతాయి. దీన్నిబట్టి చూస్తే సీ ప్లేన్లో రావడంవల్ల వ్యాపారవేత్తలు, ఇతర రంగాల ప్రముఖుల విలువైన సమయం ఆదా కానుంది. చార్జీల్లో కూడా పెద్దగా తేడా లేదు. దీంతో ప్రయాణికుల నుంచి మంచి స్పందన వచ్చే అవకాశముందని సిద్ధార్థ్ వర్మ అభిప్రాయపడ్డారు. ఈ సేవలకు వచ్చే స్పందనను బట్టి మిగతా కీలక ప్రాంతాలకు కూడా సీ ప్లేన్ సర్వీసులను ప్రారంభిస్తామని తెలిపారు.
భవిష్యత్లో ఇంధనం ధరలు పెరిగితే దాన్నిబట్టి చార్జీలు పెంచుతామని ఆయన స్పష్టం చేశారు. ‘ప్రారంభ దశలో ఈ సేవలకు ‘సెస్నా-206’ నాలుగు సీట్ల సామర్థ్యమున్న విమానాలను వినియోగిస్తారు. ఫిబ్రవరి ఆఖరు వరకు సెస్నా-8 తొమ్మిది సీట్ల సామర్థ్యమున్న విమానాలను, ఆ తర్వాత ప్రయాణికుల సంఖ్య పెరిగితే 19 సీట్ల సామర్థ్యమున్న విమానాలను నడిపే యోచనలో ఉన్నామ’ని ఆయన చెప్పారు.
జుహూ-గిర్గావ్ తర్వాత నాసిక్, లవాసా, లోనావాలా, అంబివ్యాలీ ప్రాంతాలకు కూడా నడుపుతామని స్పష్టం చేశారు. ఈ విమానాలు నీటిలో, నేలపై ఇలా ఎక్కడైనా ల్యాండింగ్ చేయడానికి వీలుంది. సాంకేతిక లోపంతో క్రాష్ ల్యాండింగ్ అయ్యే ప్రమాదం లేదు. దీంతో ప్రయాణికులకు ఎలాంటి హాని ఉండదని వర్మ ధీమా వ్యక్తం చేశారు.