కట్న దాహానికి గర్భిణి బలి
మొయినాబాద్, న్యూస్‌లైన్: కోటి ఆశలతో మెట్టినింట్లో అడుగుపెట్టిన ఆ యువతికి అదనపు కట్నం కోసం కుటుంబీకులు ప్రత్యక్ష నరకం చూపించారు. అత్త, ఆడపడుచులు పురుగుమందు తాగించి చంపేశారు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేశారు. వివాహం జరిగి ఏడాది గడవక ముందే ఆమెకు నూరేళ్ల నిండాయి. ఈ సంఘటన మండలంలోని కనకమామిడిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని అప్పారెడ్డిగూడకు చెందిన సిద్దులూరి నర్సింహ మూడేళ్ల క్రితం తల్లి రుక్కమ్మతో కలిసి కనకమామిడి గ్రామానికి వలస వచ్చాడు. అతడి సోదరి నీలమ్మ కూడా గ్రామంలోనే ఉండడంతో ఆమె ఇంటి పక్కనే ఇల్లు కట్టుకొని ఉంటున్నాడు. మరో సోదరి ఆండాళు కూడా పుట్టింట్లోనే ఉంటోంది. నర్సింహ నగరంలోని మెహిదీపట్నంలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 2012 నవంబర్‌లో అతడు రాజేంద్రనగర్‌కు చెందిన విద్య అలి యాస్ సుజాత(20)ను వివాహం చేసుకున్నాడు.
విద్య తల్లిదండ్రులు 3 తులాల బంగారం, రూ. 30 వేల నగదు, ఇతర సామగ్రి ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించారు. దంపతులు అన్యోన్యంగా ఉంటున్నారు. ప్రస్తుతం విద్య 8 నెలల గర్భవతి. అదనపు కట్నం తీసుకురావాలని విద్యను అత్త రుక్కమ్మ, ఆడపడుచులు నీలమ్మ, ఆండాళు తరచూ వేధిస్తున్నారు. ఈక్రమంలో గురువారం ఉదయం రోజుమాదిరిగానే నర్సింహ డ్యూటీకి వెళ్లాడు. అదనపు కట్నం విషయమై రాత్రి విద్యతో అత్త, ఆడపడుచులు తిరిగి గొడవపడ్డారు. నర్సింహ ఇంట్లో లేనిది అదునుగా భావించి విద్యతో బలవంతంగా పురుగుమందు తాగించారు. ఆమె అపస్మారక స్థితికి చేరుకోగానే ఇంట్లోని లైట్లన్నీ ఆర్పేసి అత్త, ఆడపడుచులు పరారయ్యారు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో నర్సింహ ఇంటికి వచ్చాడు. లైట్లు ఆన్ చేయగా విద్య నోట్లో నుంచి నురగలు కక్కుతూ గమనించాడు.
ఇరుగుపొరుగు వారికి విషయం చెప్పాడు. వెంటనే మండల కేంద్రంలోని ఓ ఆస్పత్రికి తరలించగా అప్పటికే విద్య మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహానికి పంచనామా నిర్వహించి వివరాలు సేకరించారు. శుక్రవారం మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. భార్య మృతితో నర్సింహ కన్నీటిపర్యంతమయ్యాడు. మృతురాలి తల్లి పెండ్యాల లలిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.