Melinda Gates Foundation
-
మిలిండా గేట్స్ అనూహ్య నిర్ణయం
ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన బిల్ & మిలిండా గేట్స్ ఫౌండేషన్ గురించి అందరికి తెలుసు. ఈ ఫౌండేషన్‌కు కో-చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వహించిన మిలిండా (Melinda Gates) ఎట్టకేలకు తన పదవి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.ఫౌండేషన్‌లో నా చివరి రోజు జూన్ 7 అంటూ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ నిర్ణయాన్ని చాలా తేలిగ్గా తీసుకోలేదు. బిల్, నేను కలిసి ప్రారంభించిన ఈ ఫౌండేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అసమానతలను పరిష్కరించడానికి అసాధారణ కృషి చేసాము. దీనికి నేను ఎంతగానో గర్వపడుతున్నాను. ఈ ఫౌండేషన్‌ను సమర్థుడైన సీఈఓ మార్క్ సుజ్మాన్, ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ టీమ్.. సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తారని భావిస్తున్నానని మిలిండా పేర్కొన్నారు.దాతృత్వం తదుపరి అధ్యాయంలోకి వెళ్లడానికి నాకు సరైన సమయం వచ్చింది, అందుకే రాజీనామా చేస్తున్న అంటూ మిలిండా వివరించారు. మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్ నుంచి విడాకులు తీసుకున్న మూడు సంవత్సరాలకు మిలిండా ఈ నిర్ణయం తీసుకున్నారు.మిలిండా ఫ్రెంచ్ గేట్స్ రాజీనామా తరువాత.. ఆమె దాతృత్వ ప్రయోజనాల కోసం 12.5 బిలియన్ల డాలర్లను అందుకుంటారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనే విషయాలను కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తాను అని మిలిండా పేర్కొన్నారు.మిలిండా గేట్స్ ప్రపంచ నాయకత్వం, పనిని ఎప్పటికప్పుడు పూర్తి చేసే బాధ్యత మమ్మల్ని ఎంతగానో ఆకర్శించాయి. ఈమె రాజీనామా నాకు కష్టమైన వార్త. నేను కూడా.. మిలిండాను ఆరాధించే వారిలో ఒకరిని. ఆమెతో కలిసి పనిచేయడం వల్ల ఎంతో నేర్చుకున్నాను అని సీఈఓ మార్క్ సుజ్మాన్ అన్నారు.pic.twitter.com/JYIovjNYKo— Melinda French Gates (@melindagates) May 13, 2024 -
ఏకంగా రూ. 3.4 లక్షల కోట్ల విరాళాలిచ్చిన మహిళ ఎవరో తెలుసా?
పరోపకారార్థం ఇదం శరీరం అనేది నానుడి. ఏ ఫలం ఆశించకుండా నలుగురికి సాయం చేయడం. సృష్టిలో ఈ భూమ్యా కాశాలతోపాటు పశువులు, వృక్షాలు ఎలాంటి ప్రత్యుపకారం ఆశించకుండానే తమ విధిని నిర్వరిస్తున్నాయి. పరులకి సేవ చెయ్యడమే ఉత్కృష్టమైన జన్మనెత్తిన మనుషుల పరమావధి. తమకున్న దాంట్లో ఎంతో కొంత దానం చేయాలని భావిస్తాం. ఇది కేవలం భారతీయులకే కాదు, యావత్ ప్రపంచానికి వర్తిస్తుంది...కదా! తాజాగా భూరి విరాళాలతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచారో ఓ మహిళా వ్యాపారవేత్త. ఆమె ఎవరు. ఏ దేశస్థురాలు ఆ వివరాలు చూద్దాం. ఆమె మరెవ్వరో కాదు అమెరికు చెందిన మెలిండా ఫ్రెంచ్ గేట్స్. మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత బిల్‌గేట్స్ మాజీ భార్య. 3.24 లక్షల కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చిన ప్రపంచంలో టాప్‌లో నిలిచారు. 2000లో భర్త బిల్ గేట్స్ తో కలిసి బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్‌ను 2015 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థ గా అవతరించింది. ప్రస్తుతం దాదాపు 70 బిలియన్ల డాలర్ల విరాళాలతో బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఆస్తుల పరంగా ప్రపంచంలో రెండవ అతిపెద్ద దాతృత్వ సంస్థ.వాషింగ్టన్‌లోని సియాటిల్ కేంద్రంగా సేవలందిస్తున్న మెలిండా నేతృత్వంలోని సంస్థ తన సంపదలో 99 శాతానికి పైగా విరాళంగా ఇవ్వాలనే లక్ష్యానికి కట్టుబడి ఉంది. 1964 ఆగస్టు 15న పుట్టిన మెలిండా కంప్యూటర్ సైంటిస్ట్ అయిన మైక్రోసాఫ్ట్‌లో మాజీ మల్టీమీడియా ప్రొడక్ట్ డెవలపర్ , మేనేజర్ కూడా. గ్లోబల్ హెల్త్, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ , అమెరికన్ ఎడ్యుకేషన్‌తో సహా వివిధ సమస్యలపై గేట్స్ ఫౌండేషన్ పనిచేస్తుంది.1994లో హెల్త్, స్టడీ, జెండర్ ఈక్వాలిటీ కోసం ప్రోత్సహించడానికి ఫౌండేషన్ ద్వారా 39 బిలియన్ల డాలర్లకు పైగా విరాళాలు అందించారు.మెలిండా గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా నిరుపేద మహిళలకు గర్భనిరోధక అంశాలకి ప్రాధాన్యతనిస్తున్నారు. దీని కోసం ఆమె సంస్థ ద్వారా ఒకబిలియన్ డాలర్లకు పైగా విరాళాలివ్వడం విశేషం. మెలిండా మంచి రచయిత్రి కూడా. భారతదేశంలో ఫౌండేషన్ దాతృత్వ కార్యకలాపాలకు గుర్తింపుగా, బిల్ అండ్ మెలిండా సంయుక్తంగా 2015లో భారతదేశం మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్‌ను అందుకున్నారు.2016లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫ్రెంచ్ గేట్స్ , బిల్‌కు ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్‌ను ప్రదానం చేశారు. ఏడేళ్ల డేటింగ్ తర్వాత, 1994లో బిల్ గేట్స్, మెలిండా హవాయిలో ఒకరినొకరు వివాహం చేసుకున్నారు. కానీ అనూహ్యంగా 27 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలికిన ఈ జంట ఆగస్టు 2021లో విడాకులు తీసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ మెలిండా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఒకరిగా నిలుస్తూ వస్తున్నారు. -
27 ఏళ్ల వైవాహిక జీవితాన్ని ముగిస్తున్నాం: బిల్‌గేట్స్
బిల్ గేట్స్, మెలిందాలది లవ్ మ్యారేజ్. 27 ఏళ్ల దాంపత్య జీవితం తర్వాత అకస్మాత్తుగా నిన్న వాళ్లు విడిపోతున్నట్లు ప్రకటించారు!! కారణాలు చెప్పలేదు. కొడుకు, ఇద్దరు కూతుళ్లు పెద్దవాళ్లయ్యారు. ప్రయోజకులయ్యారు. మైక్రోసాఫ్ట్ చక్కగా నడుస్తోంది. గేట్స్ ఫౌండేషన్ ప్రపంచానికి అండగా ఉంది. మరి ఈ దంపతుల మధ్య ప్రేమ ఏమైంది? అసలు ఆ ప్రేమ ఎలా మొదలయింది? భార్యభర్తల పేరు మీద ఉన్న బిలియన్ల డాలర్ల మహా దాతృత్వ సంస్థ ‘బిల్ అండ్ మెలిందా గేట్స్’ ఎప్పటిలా పరోపకారార్థం పని చేస్తుంటుంది. అయితే ఆ భార్యాభర్తలు మాత్రం తమ దాంపత్య బంధాన్ని ఇక మీదట కొనసాగించరు. బిల్ గేట్స్, మెలిందా కలిసి సోమవారం చేసిన ట్వీట్‌ని బట్టి అర్థమవుతున్నది ఇదే! ‘‘మా మలిదశ జీవితంలో భార్యాభర్తలుగా మేము కలిసి ఎదగ గలమని మాకు ఏ మాత్రం నమ్మకం కలగడం లేదు. కొత్త జీవితంలోకి మేము ప్రయాణిస్తున్నందున మా కుటుంబానికి అవసరమైన ‘స్పేస్’నీ, ‘ప్రైవసీ’ని ఇవ్వమని అడుగుతున్నాం’’ అని ఆ ట్వీట్లో గేట్స్, మెలిందా విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం బిల్ గేట్స్ వయసు 65. మెలిందా వయసు 56. ముగ్గురు పిల్లలు. కూతుళ్లు జెన్నిఫర్ కేథరీన్ (25), ఫేబీ అడేల్ (18), కొడుకు రోనీ జాన్ (21). పిల్లలు పెద్దవాళ్లయ్యారు. ప్రయోజకులయ్యారు. యాభై బిలియన్ డాలర్ల ఆస్తులు గల ‘బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్’లో కనీసం సగానికి పైగా మానవాళి క్షేమానికి అందివ్వాలని అనుకున్న మాటకు ఇద్దరూ కట్టుబడి ఉన్నారు. వృత్తి, జీవితం, కుటుంబం స్థిరంగా సాగుతున్నాయి. ఈ సమయంలో గేట్స్, మెలిందాల దాంపత్యంలో ఒక్కసారిగా ఈ కల్లోలం ఏమిటి? గేట్స్, మెలిందా తమ మలి జీవితాన్ని వేరుగా, ఎవరికి వారుగా గడపాలని అనుకోవడం ఏమిటి? వాళ్లది ప్రేమ పెళ్లే కదా! అవును ప్రేమ పెళ్లే. పాల్ ఆలెన్తో కలిసి 1975 లో తన 20 ఏళ్ల వయసులో ‘మైక్రోసాఫ్ట్’ని స్థాపించారు గేట్స్. 2008లో 53 ఏళ్ల వయసులో మైక్రోసాఫ్ట్ బాధ్యతల్ని భాగస్వాములకు, ప్రతిభ గల వారికి అప్పగించి తన రోజువారీ విధుల నుంచి తప్పుకున్నారు. అప్పటికి ఎనిమిదేళ్ల క్రితమే 2000లో తన 43 ఏళ్ల వయసులో భార్య మెలిందాతో కలిసి.. విద్య, స్త్రీ పురుష సమానత్వం, ఆరోగ్యం అనే మూడు లక్ష్యాల సాధన కోసం ‘ఫౌండేషన్’ని ప్రారంభించారు. ఈ సంవత్సరాలన్నీ మైక్రోసాఫ్ట్ మైలు రాళ్లు అనుకుంటే.. గేట్స్ జీవితంలోని మలుపు రాయి 1987. అప్పుడు గేట్స్ వయసు 32 ఏళ్లు. ఆ ఏడాది న్యూయార్క్ సిటీలో జరిగిన మైక్రోసాఫ్ సిబ్బంది డిన్నర్ పార్టీలో తొలిసారి మెలిందాను దగ్గరగా చూశాడు గేట్స్. ఆ ఏడాదే మెలిందా మైక్రోసాఫ్ట్ ఇన్ఫర్మేషన్ ప్రాడక్ట్ విభాగానికి జనరల్ మేనేజర్ గా వచ్చారు. అప్పుడు ఆమె వయసు 23. డిన్నర్ తర్వాత గేట్స్ తన దారిన తను వెళ్లిపోయాడు కానీ, మనసు మెలిందా వెళ్లిన దారిలోకి మళ్లింది. తర్వాత కొన్ని నెలలకు గానీ ఆమెను అతడు బయటికి డిన్నర్‌కి రమ్మని పిలిచే ధైర్యం చేయలేకపోయాడు. 1994 లో హవాయిలో వాళ్ల పెళ్లి జరిగే వరకు మైక్రోసాఫ్ట్‌లో ఎవరికీ వాళ్లద్దరూ ప్రేమలో ఉన్నట్లు తెలియదు! పెళ్లి తర్వాత వాళ్లద్దరి మధ్య ప్రేమ తప్ప ఎవరికీ ఏమీ కనిపించలేదు. 2020 వాలెంటైన్స్ డేకి కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో గేట్స్ పెట్టిన పోస్ట్, ఆ ఫొటోకు జత చేస్తూ రాసిన చిన్న మాట.. భార్యపై అతడికి ఎంత ప్రేమ ఉందో తెలిపేలా ఉంది. ఫొటోలో ఇద్దరూ అటువైపు తిరిగి ఉంటారు. గేట్స్ ఆమెపై చెయ్యి వేసి ఉంటారు. ‘ఈ ప్రయాణంలో నేను ఇంతకన్న మెరుగైన జీవన సహచరిని కోరబోను’ అని రాశారు గేట్స్. బిల్ గేట్స్, మెలిందా (పెళ్లప్పుడు) మెలిందాపై మనసునైతే పారేసుకున్నాడు కానీ, పెళ్లి చేసుకోడానికి చాలా ఆలోచించాడు గేట్స్. అలాగని ఆమెపై ప్రేమ లేకపోవడం కాదు. తనే ముందు చెప్పాడు ‘ఐ లవ్ యు’ అని. తనే ముందు అడిగాడు ‘మనం పెళ్లి చేసుకుందాం’ అని. ఓ రోజు మెలిందా వెళ్లేసరికి గేట్ తన బెడ్ రూమ్‌లో ఉన్న వైట్ బోర్డు మీద ఏవో ప్లస్‌లు, మైనస్‌లు నోట్ చేస్తున్నాడు. ‘‘ఏంటవి?’’ అని అడిగింది మెలిందా. ‘‘పెళ్లి చేసుకుంటే లాభాలు, నష్టాలు’’ అని చెప్పాడు. ఆమె పెద్దగా నవ్వింది. ‘‘ఏడేళ్ల ప్రేమ తర్వాత మేము ఒక పాయింట్‌కి వచ్చేశాం. అప్పుడిక బ్రేకప్ అవనన్నా అవాలి. పెళ్లయినా చేసుకోవాలి. నేను పెళ్లినే ఎంచుకున్నాను’’ అని గేట్ చెప్పడం 2019లో విడుదలైన నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ ‘ఇన్సైడ్ బిల్స్ బ్రెయిన్’లో కనిపిస్తుంది. అందులోనే ఒకచోట డాక్యుమెంటరీ డైరెక్టర్ డేవిడ్ గూగన్హైమ్, గేట్స్ ప్లేయింగ్ కార్డ్ ఆడుతుంటారు. ఆ ఆటలో గేట్స్ గెలుస్తారు. ‘యు ఆర్ లక్కీ ఇన్ లైఫ్. అండ్ యు ఆర్ లక్కీ ఇన్ వార్’ అంటాడు డేవిడ్. ‘వార్’ అంటే ఆట అని. ‘‘.. అండ్ ఇన్ లవ్ టూ’’ అంటాడు గేట్స్ నవ్వుతూ. ప్రేమలో కూడా అదృష్టవంతుడినేనని. మెలిందా ప్రేమను పొందడం తన అదృష్టం అని చెప్పడం గేట్స్ ఉద్దేశం. అదృష్టమే అనుకోవాలి. ఇరవై మూడేళ్ల వయసులో మైక్రోసాఫ్ట్‌లోకి వచ్చే సమయానికే మెలిందాకు చాలామందే బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారు. గేట్స్‌కి ఉన్నది ఒక్కరే. మైక్రోసాఫ్ట్! అంతమంది పోటీని తట్టుకుని మెలిందా ప్రేమను దక్కించుకోగలిగాడు గేట్స్. అతడి జీవితంలో ఆమెకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ప్రాముఖ్యం కాదు, ఆమే అతడిలో సగ భాగానికి పైగా! 2017లో కొలంబియా యూనివర్సిటీలో జరిగిన ‘కాన్వర్జేషన్ విత్ గేట్స్’ కార్యక్రమంలో వారెన్ బఫెట్ ఒక మాట అన్నారు. వయసులో పాతికేళ్లు తేడా ఉన్నా గేట్స్, బఫెట్ మంచి స్నేహితులు. ‘‘మనకు దగ్గరగా ఉండేవాళ్లు ఎటు వెళ్తే మనం అటు వెళ్తాం. అందుకని మనకన్నా మెరుగైన వాళ్లకు మనం దగ్గరగా ఉండాలి. ప్రత్యేకంగా చెప్పేదేముంది? జీవిత భాగస్వామే కదా మనకు అందరికన్నా దగ్గరగా ఉంటారు’’ అని ఆ కార్యక్రమంలో బెఫెట్ అన్నారు. గేట్స్ అప్పుడు చిరునవ్వుతో మెలిందాను గుర్తు చేసుకున్నారు. గత ఏడాది వాలెంటైన్స్ డేకి బిల్ గేట్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోలో గేట్స్, ఆయన భార్య మెలిందా మరి ఇప్పుడేమిటి? అంత ప్రేమ ఉండి, ఒకరికొకరు అంత ప్రత్యేకం అయి ఉండి గేట్స్, మెలిందా విడిపోవడం?! ఫౌండేషన్‌ని కలిసే నడుపుతారు. భార్యాభర్తలుగా మాత్రం ఎవరికి వారుగా ఉంటారు! నిన్నటి నుంచీ ప్రపంచం ఈ దంపతుల విడాకులకు కారణాలు వెతుక్కుంటోంది. ‘విడిపోవడం ప్రేమకు కొనసాగింపు’ అని మన కవులు అంటుంటారు. అలాంటిదా ఈ పరిణామం?! కాకపోవచ్చు. కొన్నాళ్లుగా గేట్స్, మెలిందా తీవ్రమైన సామాజిక బాధ్యతల ఒత్తిళ్లలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫౌండేషన్ తరఫున ఏటా ఈ దంపతులు ఒక ఉత్తరం విడుదల చేస్తుంటారు. ‘‘మసకబారిన వీడియో మీటింగుల్లా రోజులు గడుస్తున్నాయి. కలవర పరిచే దిగ్భ్రాంతికర వార్తలు, మైక్రోవేవ్డ్ మీల్స్ ఇవే దైనందిన జీవితం అయిపోతున్నాయి’’ అని ఈ ఏడాది జనవరిలో ఈ దంపతులు విడుదల చేసిన ఉత్తరంలో ఆవేదన, ఆందోళ వ్యక్తం అయింది. ప్రస్తుత మానవాళి మానసిక స్థితిలో ప్రతిఫలిస్తున్న ఈ ఆవేదన, ఆందోళనల్ని పోగొట్టేందుకు వీళ్లిద్దరూ కలిసి ఏదైనా మార్గాన్ని వేర్వేరుగా ఎవరి దారుల్లో వారు అన్వేషించదలచారా?! -
హైదరాబాద్ వర్సిటీకి అరుదైన గౌరవం
సాక్షి హైదరాబాద్, రాయదుర్గం: ప్రసవ సమయంలో ఆచితూచి సిజేరియన్ ఆపరేషన్లు (సీ సెక్షన్) చేసే అంశంపై ప్రతిష్టాత్మక బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ రీసెర్చి గ్రాంట్ కోసం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూవోహెచ్) స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, హైదరాబాద్‌లోని ఫెర్నాండెజ్ ఫౌండేషన్‌ను భాగస్వాములుగా గుర్తించారు. యూకేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ లాంకషైర్ (యూసీలాన్) ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ ప్రొ. సూ డౌనీ ఈ రెండు సంస్థలను ఎంపికచేశారు. గ్లోబల్ నెట్‌వర్క్‌లో భాగంగా బ్రెజిల్, కెనడాలలో రీ–జెడ్జ్ అనే వినూత్న ప్రాజెక్ట్‌ను చేపట్టేందుకు జెనీవాలోని డబ్ల్యూహెచ్‌వోతో కలిసి హైదరాబాద్ వర్సిటీ పనిచేస్తోంది. ‘రెడ్యూసింగ్ రేట్స్ ఆఫ్ నాన్–మెడికల్లీ ఇండికేటెడ్ సిజేరియన్ సెక్షన్స్ త్రూ ఓపెన్ యాక్సెస్ మల్టీ ఎవిడెన్స్ అండ్ బిహేవియర్ చేంజ్ ప్రోగ్రాం ఫర్ లాయర్స్ అండ్ జడ్జెస్’ వంటి అంశాలపై ఈ ప్రాజెక్ట్ దృష్టి సారించనుంది. ప్రపంచవ్యాప్తంగా చేపడుతున్న ఐదు ప్రాజెక్టుల్లో ఇదొక ప్రాజెక్ట్ కాగా, వాటిలో 120 దరఖాస్తులకు 80 వేల డాలర్ల విలువైన బిల్, మెలిండా గేట్స్ రీసెర్చి గ్రాంట్ అవార్డు లభించనుంది. ఈ ప్రాజెక్ట్‌ను ప్రధానంగా యూసీ లాన్, వర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఫెర్నాండేజ్ ఫౌండేషన్ అమలు చేయనున్నాయి. దీనికి సంబంధించిన మల్టీ మీడియా ప్రోగ్రామ్స్ పూర్తయ్యాక వాటిని భారత్‌లోని నాలుగు రాష్ట్రాల్లోని జడ్జీలు, లాయర్లకు అందజేస్తారు. వీటిని ఏ మేరకు ఉపయోగించవచ్చు, సిజేరియన్ ఆపరేషన్ల కారణంగా ఉత్పన్నమయ్యే కేసుల్లో తలెత్తే న్యాయపరమైన అంశాలు, వాటిపై తీసుకోవాల్సిన నిర్ణయాలను గురించి ఈ జడ్జీలు, న్యాయవాదులు పరిశీలిస్తారు. హైదరాబాద్ వర్సిటీ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్æ పరిశోధకుల సేవలను వీసీ ప్రొఫెసర్ పి.అప్పారావు ప్రశంసిస్తూ, ప్రతిష్టాత్మకమైన భాగస్వామ్యానికి ఎంపిక కావడం ద్వారా తమ వర్సిటీ అంతర్జాతీయ స్థాయికి చేరుకుందని, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్‌గా తన ప్రతిష్టను నిలుపుకుంటుందన్నారు. తమ పరిశోధక బృందాన్ని హైదరాబాద్ వర్సిటీ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డీన్ ప్రొ.పి.ప్రకాశ్‌బాబు అభినందించారు. ప్రతిష్టాత్మక ఈ రీసెర్చి గ్రాంట్ కోసం యూఓహెచ్ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తరఫున దరఖాస్తుదారుగా ఉన్న ఫ్యాకల్టీ డా.బీఆర్ శమన్న ఈ అధ్యయనం పట్ల తాము ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. సిజేరియన్ ఆపరేషన్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై తమ పరిశోధనలు ప్రభావం చూపిస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. -
మహిళలకు బిల్‌గేట్స్ వెయ్యి కోట్లు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బిల్‌గేట్స్ భారీ విరాళం ప్రకటించారు. మహిళ ఆర్థిక సాధికారిత సాధించడమే లక్ష్యంగా నాలుగు దేశాలకు 170 మిలియన్ డాలర్ల(అంటే వెయ్యికిపైగా కోట్ల) ప్రాజెక్ట్‌ను బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ ప్రకటించింది. ఈ నాలుగు దేశాల్లో భారత్ కూడా ఉండటం విశేషం. మంగళవారం బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఈ ప్రకటన చేసింది. ఇండియా, కెన్యా, తంజానియా, ఉగండా దేశాల్లో లింగ సమానత్వం పెరగడం, డిజిటల్ ఆర్ధిక సమ్మేళనం విస్తరించడం, ఉద్యోగ అవకాశాలు పెరగడం, వ్యవసాయ రంగానికి, మహిళల మద్దతు సమూహాలకు మద్దతు ఇవ్వడం వంటి అంశాలను ప్రధాన అంశాలుగా తీసుకుని ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టనున్నారు. ఒక మహిళ తన జీవితాన్ని తనకు తానుగా మరింత మంచిగా రూపొందించుకోవాలని బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ కో-చైర్ మెలిండా గేట్స్ అన్నారు. మహిళల చేతుల్లో మనీ ఉంటే, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి అనే అంశంపై అవగాహం కలిగి ఉంటారని, దీంతో వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. పురుషుల కంటే మహిళలు తక్కువ అని అనాదిగా వస్తున్న నిబంధనలను వారు మారుస్తారని చెప్పారు. నగదు లేదా మొబైల్ మనీ వంటి ఆర్థిక వనరుల విషయంలో మహిళలకు ప్రాధాన్యం కల్పిస్తే, ఆ నిర్ణయాలు ఆమెపై, తన కుటుంబ సభ్యులపై మంచి ప్రభావాన్ని చూపుతాయని, దీని ద్వారా మహిళలు సాధికారిత సాధిస్తారని ఫౌండేషన్ చెప్పింది. ఈ పెట్టుబడులు మహిళలు పూర్తిస్థాయిలో ఆర్థికవ్యవస్థలో పాలుపంచుకునే విధంగా సాయం చేయడం మాత్రమే కాకుండా.. ఎన్నో ఏళ్లుగా మహిళలు వెనుకబడి ఉన్న వాటిల్లో అడ్డంకులు తొలగించేలా చేయొచ్చని బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ జెండర్ క్వాలిటీ డైరెక్టర్ సరహ హెన్డ్రిక్స్ అన్నారు. -
2035కల్లా పేద దేశాలుండవు: బిల్‌గేట్స్
న్యూఢిల్లీ: ప్రపంచంలో 2035 కల్లా పేద దేశాలనేవి ఉండవని అపర కుబేరుడు బిల్‌గేట్స్ అంచనా వేస్తున్నారు. కొత్త కొత్త వ్యాక్సిన్లు, అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, డిజిటల్ విప్లవం వంటి ధనిక దేశాల ఆవిష్కరణల కారణంగా పేద దేశాలు ప్రయోజనం పొందుతాయని, అందుకే అప్పటికల్లా పేద దేశాలనేవి ఉండవని వివరించారు. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ వార్షిక లేఖలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం పేద దేశాలుగా ఉన్న దేశాల్లో కార్మికులు విద్యావంతులవుతారని, ఫలితంగా ఆ యా దేశాల్లోకి కొత్త పెట్టుబడులు వెల్లువలా వస్తాయని వివరించారు. ప్రస్తుతం చైనా సాధిస్తున్న తలసరి ఆదాయాన్ని 2035 నాటికల్లా చాలా దేశాలు సాధిస్తాయన్నారు. 1960 నుంచి చూస్తే భారత తలసరి ఆదాయం నాలుగింతలు, చైనా తలసరి ఆదాయం ఎనిమిదింతలైందని చెప్పారు.