27 ఏళ్ల వైవాహిక జీవితాన్ని ముగిస్తున్నాం: బిల్‌గేట్స్‌ | Bill And Melinda Gates Divorce After 27 Years Of Marriage | Sakshi
Sakshi News home page

27 ఏళ్ల వైవాహిక జీవితాన్ని ముగిస్తున్నాం: బిల్‌గేట్స్‌

Published Wed, May 5 2021 12:00 AM | Last Updated on Wed, May 5 2021 6:42 AM

Bill And Melinda Gates Divorce After 27 Years Of Marriage - Sakshi

బిల్‌ గేట్స్, మెలిందాలది లవ్‌ మ్యారేజ్‌. 27 ఏళ్ల దాంపత్య జీవితం తర్వాత అకస్మాత్తుగా నిన్న వాళ్లు విడిపోతున్నట్లు ప్రకటించారు!! కారణాలు చెప్పలేదు. కొడుకు, ఇద్దరు కూతుళ్లు పెద్దవాళ్లయ్యారు. ప్రయోజకులయ్యారు. మైక్రోసాఫ్ట్‌ చక్కగా నడుస్తోంది. గేట్స్‌ ఫౌండేషన్‌ ప్రపంచానికి అండగా ఉంది. మరి ఈ దంపతుల మధ్య ప్రేమ ఏమైంది? అసలు ఆ ప్రేమ ఎలా మొదలయింది

భార్యభర్తల పేరు మీద ఉన్న బిలియన్‌ల డాలర్‌ల మహా దాతృత్వ సంస్థ ‘బిల్‌ అండ్‌ మెలిందా గేట్స్‌’ ఎప్పటిలా పరోపకారార్థం పని చేస్తుంటుంది. అయితే ఆ భార్యాభర్తలు మాత్రం తమ దాంపత్య బంధాన్ని ఇక మీదట కొనసాగించరు. బిల్‌ గేట్స్, మెలిందా కలిసి సోమవారం చేసిన ట్వీట్‌ని బట్టి అర్థమవుతున్నది ఇదే! ‘‘మా మలిదశ జీవితంలో భార్యాభర్తలుగా మేము కలిసి ఎదగ గలమని మాకు ఏ మాత్రం నమ్మకం కలగడం లేదు. కొత్త జీవితంలోకి మేము ప్రయాణిస్తున్నందున మా కుటుంబానికి అవసరమైన ‘స్పేస్‌’నీ, ‘ప్రైవసీ’ని ఇవ్వమని అడుగుతున్నాం’’ అని ఆ ట్వీట్‌లో గేట్స్, మెలిందా విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం బిల్‌ గేట్స్‌ వయసు 65. మెలిందా వయసు 56. ముగ్గురు పిల్లలు. కూతుళ్లు జెన్నిఫర్‌ కేథరీన్‌ (25), ఫేబీ అడేల్‌ (18), కొడుకు రోనీ జాన్‌ (21). పిల్లలు పెద్దవాళ్లయ్యారు. ప్రయోజకులయ్యారు. యాభై బిలియన్‌ డాలర్ల ఆస్తులు గల ‘బిల్‌ అండ్‌ మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌’లో కనీసం సగానికి పైగా మానవాళి క్షేమానికి అందివ్వాలని అనుకున్న మాటకు ఇద్దరూ కట్టుబడి ఉన్నారు. వృత్తి, జీవితం, కుటుంబం స్థిరంగా సాగుతున్నాయి. ఈ సమయంలో గేట్స్, మెలిందాల దాంపత్యంలో ఒక్కసారిగా ఈ కల్లోలం ఏమిటి? గేట్స్, మెలిందా తమ మలి జీవితాన్ని వేరుగా, ఎవరికి వారుగా గడపాలని అనుకోవడం ఏమిటి? వాళ్లది ప్రేమ పెళ్లే కదా! అవును ప్రేమ పెళ్లే. 



పాల్‌ ఆలెన్‌తో కలిసి 1975 లో తన 20 ఏళ్ల వయసులో ‘మైక్రోసాఫ్ట్‌’ని స్థాపించారు గేట్స్‌. 2008లో 53 ఏళ్ల వయసులో మైక్రోసాఫ్ట్‌ బాధ్యతల్ని భాగస్వాములకు, ప్రతిభ గల వారికి అప్పగించి తన రోజువారీ విధుల నుంచి తప్పుకున్నారు. అప్పటికి ఎనిమిదేళ్ల క్రితమే 2000లో తన 43 ఏళ్ల వయసులో భార్య మెలిందాతో కలిసి.. విద్య, స్త్రీ పురుష సమానత్వం, ఆరోగ్యం అనే మూడు లక్ష్యాల సాధన కోసం ‘ఫౌండేషన్‌’ని  ప్రారంభించారు. ఈ సంవత్సరాలన్నీ మైక్రోసాఫ్ట్‌ మైలు రాళ్లు అనుకుంటే.. గేట్స్‌ జీవితంలోని మలుపు రాయి 1987. అప్పుడు గేట్స్‌ వయసు 32 ఏళ్లు. ఆ ఏడాది న్యూయార్క్‌ సిటీలో జరిగిన మైక్రోసాఫ్‌ సిబ్బంది డిన్నర్‌ పార్టీలో తొలిసారి మెలిందాను దగ్గరగా చూశాడు గేట్స్‌. ఆ ఏడాదే మెలిందా మైక్రోసాఫ్ట్‌ ఇన్ఫర్మేషన్‌ ప్రాడక్ట్‌ విభాగానికి జనరల్‌ మేనేజర్‌ గా వచ్చారు. అప్పుడు ఆమె వయసు 23. డిన్నర్‌ తర్వాత గేట్స్‌ తన దారిన తను వెళ్లిపోయాడు కానీ, మనసు మెలిందా వెళ్లిన దారిలోకి మళ్లింది. తర్వాత కొన్ని నెలలకు గానీ ఆమెను అతడు బయటికి డిన్నర్‌కి రమ్మని పిలిచే ధైర్యం చేయలేకపోయాడు. 1994 లో హవాయిలో వాళ్ల పెళ్లి జరిగే వరకు మైక్రోసాఫ్ట్‌లో ఎవరికీ వాళ్లద్దరూ ప్రేమలో ఉన్నట్లు తెలియదు! పెళ్లి తర్వాత వాళ్లద్దరి మధ్య ప్రేమ తప్ప ఎవరికీ ఏమీ కనిపించలేదు. 2020 వాలెంటైన్స్‌ డేకి కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో గేట్స్‌ పెట్టిన పోస్ట్, ఆ ఫొటోకు జత చేస్తూ రాసిన చిన్న మాట.. భార్యపై అతడికి ఎంత ప్రేమ ఉందో తెలిపేలా ఉంది. ఫొటోలో ఇద్దరూ అటువైపు తిరిగి ఉంటారు. గేట్స్‌ ఆమెపై చెయ్యి వేసి ఉంటారు. ‘ఈ ప్రయాణంలో నేను ఇంతకన్న మెరుగైన జీవన సహచరిని కోరబోను’ అని రాశారు గేట్స్‌.


బిల్‌ గేట్స్, మెలిందా (పెళ్లప్పుడు)

మెలిందాపై మనసునైతే పారేసుకున్నాడు కానీ, పెళ్లి చేసుకోడానికి చాలా ఆలోచించాడు గేట్స్‌. అలాగని ఆమెపై ప్రేమ లేకపోవడం కాదు. తనే ముందు చెప్పాడు ‘ఐ లవ్‌ యు’ అని. తనే ముందు అడిగాడు ‘మనం పెళ్లి చేసుకుందాం’ అని. ఓ రోజు మెలిందా వెళ్లేసరికి గేట్‌ తన బెడ్‌ రూమ్‌లో ఉన్న వైట్‌ బోర్డు మీద ఏవో ప్లస్‌లు, మైనస్‌లు నోట్‌ చేస్తున్నాడు. ‘‘ఏంటవి?’’ అని అడిగింది మెలిందా. ‘‘పెళ్లి చేసుకుంటే లాభాలు, నష్టాలు’’ అని చెప్పాడు. ఆమె పెద్దగా నవ్వింది. ‘‘ఏడేళ్ల ప్రేమ తర్వాత మేము ఒక పాయింట్‌కి వచ్చేశాం. అప్పుడిక బ్రేకప్‌ అవనన్నా అవాలి. పెళ్లయినా చేసుకోవాలి. నేను పెళ్లినే ఎంచుకున్నాను’’ అని గేట్‌ చెప్పడం 2019లో విడుదలైన నెట్‌ఫ్లిక్స్‌ డాక్యుమెంటరీ ‘ఇన్‌సైడ్‌ బిల్స్‌ బ్రెయిన్‌’లో కనిపిస్తుంది. అందులోనే ఒకచోట డాక్యుమెంటరీ డైరెక్టర్‌ డేవిడ్‌ గూగన్‌హైమ్, గేట్స్‌ ప్లేయింగ్‌ కార్డ్‌ ఆడుతుంటారు. ఆ ఆటలో గేట్స్‌ గెలుస్తారు. ‘యు ఆర్‌ లక్కీ ఇన్‌ లైఫ్‌. అండ్‌ యు ఆర్‌ లక్కీ ఇన్‌ వార్‌’ అంటాడు డేవిడ్‌. ‘వార్‌’ అంటే ఆట అని.

‘‘.. అండ్‌ ఇన్‌ లవ్‌ టూ’’ అంటాడు గేట్స్‌ నవ్వుతూ. ప్రేమలో కూడా అదృష్టవంతుడినేనని. మెలిందా ప్రేమను పొందడం తన అదృష్టం అని చెప్పడం గేట్స్‌ ఉద్దేశం. అదృష్టమే అనుకోవాలి. ఇరవై మూడేళ్ల వయసులో మైక్రోసాఫ్ట్‌లోకి వచ్చే సమయానికే మెలిందాకు చాలామందే బాయ్‌ఫ్రెండ్స్‌ ఉన్నారు. గేట్స్‌కి ఉన్నది ఒక్కరే. మైక్రోసాఫ్ట్‌! అంతమంది పోటీని తట్టుకుని మెలిందా ప్రేమను దక్కించుకోగలిగాడు గేట్స్‌. అతడి జీవితంలో ఆమెకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ప్రాముఖ్యం కాదు, ఆమే అతడిలో సగ భాగానికి పైగా! 2017లో కొలంబియా యూనివర్సిటీలో జరిగిన ‘కాన్వర్జేషన్‌ విత్‌ గేట్స్‌’ కార్యక్రమంలో వారెన్‌ బఫెట్‌ ఒక మాట అన్నారు. వయసులో పాతికేళ్లు తేడా ఉన్నా గేట్స్, బఫెట్‌ మంచి స్నేహితులు. ‘‘మనకు దగ్గరగా ఉండేవాళ్లు ఎటు వెళ్తే మనం అటు వెళ్తాం. అందుకని మనకన్నా మెరుగైన వాళ్లకు మనం దగ్గరగా ఉండాలి. ప్రత్యేకంగా చెప్పేదేముంది? జీవిత భాగస్వామే కదా మనకు అందరికన్నా దగ్గరగా ఉంటారు’’ అని ఆ కార్యక్రమంలో బెఫెట్‌ అన్నారు. గేట్స్‌ అప్పుడు చిరునవ్వుతో మెలిందాను గుర్తు చేసుకున్నారు. 


గత ఏడాది వాలెంటైన్స్‌ డేకి బిల్‌ గేట్స్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఫొటోలో గేట్స్, ఆయన భార్య మెలిందా

మరి ఇప్పుడేమిటి? అంత ప్రేమ ఉండి, ఒకరికొకరు అంత ప్రత్యేకం అయి ఉండి గేట్స్, మెలిందా విడిపోవడం?! ఫౌండేషన్‌ని కలిసే నడుపుతారు. భార్యాభర్తలుగా మాత్రం ఎవరికి వారుగా ఉంటారు! నిన్నటి నుంచీ ప్రపంచం ఈ దంపతుల విడాకులకు కారణాలు వెతుక్కుంటోంది. ‘విడిపోవడం ప్రేమకు కొనసాగింపు’ అని మన కవులు అంటుంటారు. అలాంటిదా ఈ పరిణామం?! కాకపోవచ్చు. కొన్నాళ్లుగా గేట్స్, మెలిందా తీవ్రమైన సామాజిక బాధ్యతల ఒత్తిళ్లలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫౌండేషన్‌ తరఫున ఏటా ఈ దంపతులు ఒక ఉత్తరం విడుదల చేస్తుంటారు. ‘‘మసకబారిన వీడియో మీటింగుల్లా రోజులు గడుస్తున్నాయి. కలవర పరిచే దిగ్భ్రాంతికర వార్తలు, మైక్రోవేవ్డ్‌ మీల్స్‌ ఇవే దైనందిన జీవితం అయిపోతున్నాయి’’ అని ఈ ఏడాది జనవరిలో ఈ దంపతులు విడుదల చేసిన ఉత్తరంలో ఆవేదన, ఆందోళ వ్యక్తం అయింది. ప్రస్తుత మానవాళి మానసిక స్థితిలో ప్రతిఫలిస్తున్న ఈ ఆవేదన, ఆందోళనల్ని పోగొట్టేందుకు వీళ్లిద్దరూ కలిసి ఏదైనా మార్గాన్ని వేర్వేరుగా ఎవరి దారుల్లో వారు అన్వేషించదలచారా?! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement