2035కల్లా పేద దేశాలుండవు: బిల్‌గేట్స్
న్యూఢిల్లీ: ప్రపంచంలో 2035 కల్లా పేద దేశాలనేవి ఉండవని అపర కుబేరుడు బిల్‌గేట్స్ అంచనా వేస్తున్నారు. కొత్త కొత్త వ్యాక్సిన్‌లు, అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, డిజిటల్ విప్లవం వంటి ధనిక దేశాల ఆవిష్కరణల కారణంగా పేద దేశాలు ప్రయోజనం పొందుతాయని, అందుకే అప్పటికల్లా పేద దేశాలనేవి ఉండవని వివరించారు.
బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ వార్షిక లేఖలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం పేద దేశాలుగా ఉన్న దేశాల్లో కార్మికులు విద్యావంతులవుతారని, ఫలితంగా ఆ యా దేశాల్లోకి కొత్త పెట్టుబడులు వెల్లువలా వస్తాయని వివరించారు. ప్రస్తుతం చైనా సాధిస్తున్న తలసరి ఆదాయాన్ని 2035 నాటికల్లా చాలా దేశాలు సాధిస్తాయన్నారు. 1960 నుంచి చూస్తే భారత తలసరి ఆదాయం నాలుగింతలు, చైనా తలసరి ఆదాయం ఎనిమిదింతలైందని చెప్పారు.