ఓటుకు కోట్లు: రంగంలోకి దిగిన ఎన్నికల సంఘం
ఓటుకు కోట్లు కేసులో కేంద్ర ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది. ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాలుగా ఏసీబీ సమర్పించిన 14 ఆడియో, వీడియో టేపుల కాపీలను తమకు ఇవ్వాల్సిందిగా కోరుతూ సీఈసీ తరఫు న్యాయవాది ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు.
ఈ టేపులు అసలువా.. కాదా అన్న విషయాన్ని నిర్ధారించేందుకు వీటిని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపిన విషయం తెలిసిందే. ల్యాబ్ నుంచి వీటిపై ప్రాథమిక నివేదిక కూడా ఇప్పటికే వచ్చింది. ఎఫ్ఎస్ఎల్ నుంచి వచ్చిన టేపులను ఏసీబీ కోర్టు పరిశీలిస్తోంది. ఈ లోపే కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి కూడా తమకు ఈ టేపులు కావాలన్న మెమో దాఖలైంది.
తమ వద్ద ఒక కాపీ మాత్రమే ఉందని, ఎఫ్ఎస్ఎల్ వారు మరో కాపీ పంపితే, అప్పుడు ఇవ్వాలా వద్దా అన్న విషయమై నిర్ణయం తీసుకుంటామని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తెలిపారు. తమకు అందిన టేపుల కాపీలను ప్రస్తుతం కోర్టు పరిశీలిస్తోంది. మరో కాపీ వస్తే అప్పుడు దాన్ని సీఈసీకి ఇవ్వాలా లేదా అనే విషయమై నిర్ణయం తీసుకుంటారు.