Memu
-
సూర్య సినిమా విడుదల వాయిదా
సూర్య ప్రధాన పాత్రలో తన సొంతం నిర్మాణ సంస్థ 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన సినిమా 'మేము'. తమిళ్లో గత ఏడాది డిసెంబర్లో రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు వర్షన్ రిలీజ్‌కు మాత్రం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముందుగా తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా, సంక్రాంతికి టాలీవుడ్లో భారీ పోటి ఉండటంతో వాయిదా వేసుకున్నారు. తరువాత కూడా పలుమార్లు సినిమా రిలీజ్ చేయాలని ప్రయత్నించినా, వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది. ఈ శుక్రవారం(మార్చి 18) ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుందని ప్రకటించారు చిత్రయూనిట్. అయితే మరోసారి మేము సినిమాను వాయిదా వేయక తప్పలేదు. వాయిదాకు కారణాలేంటి అన్న విషయం వెల్లడించకపోయినా, మేము చిత్రం శుక్రవారం రిలీజ్ కావటం లేదని ప్రకటించారు. త్వరలో రిలీజ్ డేట్ వెల్లడిస్తామని తెలిపారు చిత్రయూనిట్. పసంగ సినిమాకు సీక్వల్గా పసంగ 2 పేరుతో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో మేము పేరుతో రిలీజ్ చేస్తున్నారు. సూర్య సరసన అమలా పాల్ హీరోయిన్గా నటిస్తుండగా తెలుగమ్మాయి బిందు మాధవి మరో ప్రధాన పాత్రలో నటిస్తోంది. చిన్న పిల్లలను ఆకట్టుకునే కథాంశంతో సందేశాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు పాండిరాజ్ దర్శకుడు. -
ఆ డైరెక్టర్ రెండు సినిమాలు ఒకేరోజు
సినీరంగంలో తమ సినిమాతో తామే పోటీ పడటానికి తారలు ఇష్టపడరు. హీరోయిన్ల విషయంలో ఇలా ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం అప్పుడప్పుడు ఉంటుంది. కానీ, హీరోలు, సాంకేతిక నిపుణుల విషయంలో మాత్రం చాలా అరుదు. చాలా ఏళ్ల కిందట బాలకృష్ణ హీరోగా నటించిన బంగారు బుల్లోడు, నిప్పురవ్వ సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యి రికార్డ్ సృష్టించాయి. కృష్ణ హీరోగా నటించిన సినిమాలు కూడా పలు సందర్భాల్లో తక్కువ గ్యాప్‌లో రిలీజ్ అయ్యాయి. కానీ ఒకే దర్శకుడు తెరకెక్కించిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదల అవ్వడం అత్యంత అరుదు. అలాంటి అరుదైన రిలీజ్ ఈ శుక్రవారం జరగనుంది. తమిళ దర్శకుడు పాండిరాజ్ తెరకెక్కించిన కథాకళి, మేము సినిమాలు ఒకేరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన పసంగ 2 సినిమా.. మేము పేరుతో తెలుగులో రిలీజ్ అవుతోంది. తమిళంలో గత ఏడాది డిసెంబర్లోనే రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగులో మాత్రం ఆలస్యంగా ఈ వారం రిలీజ్ అవుతోంది. ఈ సినిమాతో పాటు ఇదే దర్శకుడి, డైరెక్షన్లో తెరకెక్కిన కథాకళి సినిమా కూడా తమిళ్లో జనవరిలోనే రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను కూడా తెలుగులో ఈ శుక్రవారమే రిలీజ్ చేస్తున్నారు నిర్మాతలు. అలా ఒకే దర్శకుడి రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవ్వటం టాలీవుడ్ సరికొత్త రికార్డ్. -
'మేము' రిలీజ్ పై డైలమా
కోలీవుడ్‌లో స్టార్ హీరోగా మంచి ఫాంలో ఉన్న సూర్య నిర్మాతగాను మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే జ్యోతిక లీడ్ రోల్లో 36 వయోధినిలే సినిమాను తెరకెక్కించిన సూర్య, మరో సందేశాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. జాతీయ అవార్డు గెలిచిన దర్శకుడు పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన పసంగ 2 సినిమాను 'మేము' పేరుతో తెలుగు లోనూ రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు. చాలా కాలం క్రితమే అన్నికార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా, రిలీజ్ విషయంలో మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు సూర్య. డిసెంబర్ తొలి వారంలోనే రిలీజ్ ప్లాన్ చేసినా ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవటంతో వాయిదా పడింది. ఆ తరువాత క్రిస్టమస్ బరిలో నిలపాలని భావించినా, తెలుగులో మూడు సినిమాల రిలీజ్ ఉండటంతో వాయిదా వేశారు. జనవరిలో కూడా వరుసగా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుండటంతో ఇక చేసేదేమి లేక జనవరి నెలాఖరున మేము సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తన సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్య నిర్మిస్తున్న ఈ సినిమాలో, తనూ ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. దాదాపు 40 నిమిషాల పాటు సూర్య ఈ సినిమాలో కనిపించనున్నాడు. అమలాపాల్, బిందు మాధవి ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ సినిమా కథ మానసిక వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల చుట్టూ తిరుగుతోంది. తమిళంలో ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. -
‘మనం’, ‘దృశ్యం’ తరహాలో...
సినిమా సినిమాకు విభిన్న తరహా పాత్రలు పోషించి, ప్రేక్షకులను ఆకట్టుకునే కథానాయకుడు సూర్య. అందుకే ఆయనకు తమిళంతో పాటు తెలుగులోనూ అభిమానులున్నారు. సూర్య హీరోగా నటిస్తూ పాండిరాజ్ దర్శకత్వంలో తమిళంలో నిర్మించిన చిత్రం - ‘పసంగ 2’. ఈ చిత్రాన్ని సాయి సూర్య, కె.ఇ. జ్ఞానవేల్ రాజా సమర్పణలో మణికంఠ పిక్చర్స్ పతాకంపై జూలకంటి మధుసూదన్ రెడ్డి తెలుగులో ‘మేము’ పేరుతో అనువదిస్తున్నారు. ఈ నెలాఖరున ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఇటీవల సూర్య విడుదల చేసిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘మనం’, ‘దృశ్యం’ సినిమాల తరహాలో మా చిత్రం ఘన విజయం సాధిస్తుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ‘పిశాచి’ చిత్ర ఫేమ్ అరోల్ కొరెల్లి, పాటలు: వెన్నెలకంటి, చంద్రబోస్, సాహితి, సహ నిర్మాతలు: ప్రసాద్ సన్నితి, తమటం కుమార్‌రెడ్డి. -
అందరికోసం మేము
చిన్నపిల్లల మనోభావాలు, మానసిక సంఘర్షణల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘పసంగ 2’. పాండిరాజా దర్శకత్వంలో తమిళంలో హీరో సూర్య నటిస్తూ నిర్మించిన చిత్రమిది. సూర్య, కె.ఇ. జ్ఞానవేల్ రాజా సమర్పణలో ఈ చిత్రాన్ని ‘మేము’ పేరుతో జూలకంటి మధుసూదన్‌రెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. సూర్య మాట్లాడుతూ - ‘‘మా సంస్థలో తొలి చిత్రంగా ‘36 వయదినిలే’ తీశాం. ఆ తరువాత వస్తున్న చిత్రం ‘మేము’. పాండిరాజ్ ఈ సినిమా కోసం చాలా పరిశోధన చేశారు. పిల్లల కథాంశమైనా కూడా అందరికీ నచ్చే విధంగా తీశాం’’ అన్నారు. ఈ వేడుకలో అమలాపాల్, కె.ఇ. జ్ఞానవేల్ రాజా, దర్శకుడు పాండిరాజ్, సంగీత దర్శకుడు అర్రోల్ కొరెల్లి, మాచర్ల ఎమ్మెల్యే పి. రామకృష్ణారెడ్డి, శివకృష్ణ, నిర్మాతలు తమటం కుమార్‌రెడ్డి, ప్రసాద్ సన్నితి, కేవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
మనం తరహాలో మేము
తమిళంలో సూర్య ఓ కీలక పాత్రలో నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘పసంగ-2’. పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అమలాపాల్, బిందుమాధవి కథానాయికలు. సాయి మణికంఠ క్రియేషన్స్ పతాకంపై జూలకంటి మధుసూదన్‌రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో ‘మేము’గా అందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను హైదరాబాద్‌లో సూర్య విడుదల చేశారు. ‘‘నేను తమిళంలో నిర్మించిన ఈ చిత్రాన్ని ‘మేము’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. నా కెరీర్లో మంచి సినిమాగా నిలిచిపోతుంది. పాండిరాజ్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించారు’’ అని సూర్య చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ-‘‘అక్కినేని కుటుంబం నటించిన ‘మనం’ తరహాలోనే ‘మేము’ గొప్ప చిత్రమవుతుంది. త్వరలో పాటలు విడుదల చేయనున్నాం. ఇటీవలే ‘జిల్లా’ చిత్రాన్ని విడుదల చేసిన ప్రసాద్ సన్నితి-తమటం కుమార్‌రెడ్డి ఈ ప్రాజెక్టు కోసం మాతో చేతులు కలిపారు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కూర్పు: ప్రవీణ్ కె.ఎల్, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, సమర్పణ: సూర్య - కె.ఇ .జ్ఞాన వేల్‌రాజా. -
సూర్య కొత్త సినిమా 'మేము'
కోలీవుడ్ స్టార్ హీరోలు కమర్షియల్ సినిమాలతో పాటు సోషల్ మెసేజ్ ఉన్న సినిమాల మీద కూడా దృష్టి పెడుతున్నారు. హీరోలుగానే కాదు నిర్మాతలుగా కూడా అలాంటి సినిమాలతో తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ధనుష్ 'కాకముటై' సినిమాతో బస్తీల్లో పిల్లల జీవనాన్ని పరిచయం చేయగా, సూర్య కూడా అదే బాటలో నడుస్తున్నాడు. సూర్య తన సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై 'పసంగ 2' అనే బాలల చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. నేషనల్ అవార్డ్ విన్నర్ పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు వర్షన్‌కు 'మేము' అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు. సూర్య, అమలా పాల్ గెస్ట్ అపియరెన్స్ ఇస్తున్న ఈ సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పాండిరాజ్ దర్శకత్వంలోనే బాలల చిత్రాలుగా తెరకెక్కిన 'పసంగ', 'మెరినా' సినిమాలు మంచి విజయాలు సాధించటంతో అదే జానర్ లో మరోసారి 'పసంగ 2'ను తెరకెక్కించారు. తొలుత తమిళ్ లోనే రిలీజ్ చేయాలని భావించినా, సూర్య గెస్ట్ అపియరెన్స్ ఇస్తుండటంతో తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంటుందని భావించి 'మేము' పేరుతో తెలుగులో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.