11 రోజుల్లోనే నూరేళ్లు నిండాయి....
లండన్: చిద్విలాసంతో ముద్దులొలుకుతున్న ముక్కుపచ్చలారని రెండేళ్ల పాప. హృదయవిదారక స్థితిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ మృత్యువుతో పోరాటం చేస్తున్న అదే పాప. ఈ రెండు ఫొటోలను లండన్లోని మెయిడ్స్టోన్ కౌంటీకి చెందిన జెన్నీ, నీల్ అనే తల్లిదండ్రులు మంగళవారం ఆన్లైన్లో పోస్ట్ చేశారు. కేవలం 11 రోజుల్లోనే మెనిన్జైటీస్-బి అనే జబ్బు తమ పాపను పొట్టన పెట్టుకుందని, ఈ పాపం తమదేనని, జబ్బు రాకుండా వ్యాక్సిన్ ఇవ్వకపోవడం వల్లనే తమ పాప తమకు దక్కలేదని వారు వాపోయారు. ఈ పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదనే ఉద్దేశంతో, వారిలో మెనిన్జైటీస్-బి పట్ల అవగాహన కల్పించడం కోసమే తామీ ఫొటోలను ఆన్లైన్లో పోస్ట్ చేశామని వారు వివరణ ఇచ్చారు. నవజాత శిశువులకే కాకుండా పిల్లలందరికి మెనిన్జైటీస్ వ్యాక్సిన్ తప్పక ఇప్పించాలని వారు పిలుపునిచ్చారు.
ఫయే బర్డెట్ అనే రెండేళ్ల పాప ఫిబ్రవరి 11వ తేదీన ఆస్పత్రిలో కన్నుమూసింది. ముందుగా ఆ పాప నుదుటిపై దద్దుర్లు వచ్చాయి. జ్వరం వస్తూ క్రమంగా ఆ దద్దుర్లు శరీరమంతా విస్తరిస్తూ వచ్చాయి. వెంటనే పాపను తల్లిదండ్రులు స్థానిక ఆస్పత్రిలో చేర్చారు. ఎన్ని చికిత్సలు చేసిన పాప పరిస్థితి మెరగుపడలేదు. ఒక చేయి, ఒక కాలు తీసివేయాల్సి వచ్చింది. అయినా పాప కోలుకోలేదు. మరో పెద్దాస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా స్థానిక ఆస్పత్రి సూచించడంతో లండన్లోని ఎవలినా చిల్డ్రన్ ఆస్పత్రికి పాపను తరలించారు. అక్కడా పరిస్థితి మెరగుపడలేదు. పెద్దాపరేషన్ చేయాలని, దానికి పాప తట్టుకుంటుందో లేదో, చేసినా పాప బతికే అవకాశాలు తక్కువని అక్కడి వైద్యులు చెప్పారు. తల్లిదండ్రులకు ఏం చేయాలో పాలుపోలేదు.
పాపను ప్రశాంతంగా కన్నుమూసేలా చూడడం మంచి నిర్ణయం అవుతుందన్న వైద్యుల సలహాకే ఆ పాప తల్లిదండ్రులు అంగీకరించారు. మెనిన్జైటీస్ బ్యాక్టీరియా వల్ల వచ్చే ప్రాణాంతకమైన జబ్బని, కొందరికి చేతి వేళ్లు, కాళ్ల వేళ్లు తీసివేయాల్సి వస్తుందని, ఈ పాపకు కాలు, చేయిని పూర్తిగా తీసివేసిన లాభం లేకపోయిందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. బ్రిటన్లో ఏటా 3,400 కేసులు నమోదవుతున్నాయని, సకాలంలో వ్యాక్సిన్ ఇప్పించడం ఒక్కటే ఉత్తమమైన మార్గమని వారు చెప్పారు.
మెనిన్జైటీస్ లక్షణాలు.....తీవ్రమైన తల నొప్పి వస్తుంది. జ్వరం వస్తుంది. వాంతులు కూడా కావచ్చు. మోచేతులు, మోకాళ్లు లాగవచ్చు. లేదా కండరాల నొప్పి వస్తుంది. అరచేతులు, అరికాళ్లు చల్లగా ఉంటాయి. వణకు కూడా రావచ్చు.చర్మం తెల్లగా పాలిపోయినట్లు అవుతుంది. శరీరంపై దద్దుర్లు వస్తాయి. వేగంగా శ్వాస పీల్చడం లేదా ఊపిరాడని పరిస్థితి ఏర్పడుతుంది. మెడ పట్టేసినట్లు ఉంటుంది. లైట్ వెలుతురును చూడలేరు. ఇబ్బంది పడతారు. ఎప్పుడు నిద్రలో ఉన్నట్లు ఉంటారు. గందరగోళ పరిస్థితుల్లో ఉంటారు. కొందరికి ఫిట్లు కూడా రావచ్చు. బెక్స్సెరో అనే వ్యాక్సిన్ ఇస్తే ఈ జబ్బు రాదు.