జాతీయ అవార్డు అందుకున్న ఎంఈఓ అంజయ్య
కోహీర్: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, విద్యారంగానికి చేసిన కృషికి గాను కోహీర్ ఎంఈఓ అంజయ్య జాతీయ అవార్డు అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సెంటర్‌ఫర్ ఇన్నోవేషన్స్ ఇన్ పబ్లిక్ సిస్టమ్స్ సంస్థ 2013-14కిగాను ఎంపిక చేసిన నేషనల్ స్కీమ్ ఫర్ ఇన్నోవేషన్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్స్ (ఎన్ఎస్ఐఈఏ) జాతీయ స్థాయి అవార్డు ఆయనకు లభించింది. శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి జుబేన్ ఇరానీ అవార్డును, ప్రశంస పత్రాన్ని అంజయ్యకు అందజేశారు.
దేశంలో 33 మంది విద్యాధికారులకు ఈ అవార్డులు ఇచ్చారు. అందులో అవిభక్త ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు ఎంఈఓలు అవార్డుకు ఎంపికయ్యారు. వీరిలో ఇద్దరు కూడా తెలంగాణాకే చెందిన వారు కావడం విశేషం. అందులో ఒకరు కరీంనగర్‌కు చెందిన ఎంఈఓ రాజయ్య కాగా మరొకరు కోహీర్ ఎంఈఓ అంజయ్య. కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి భట్టాచార్య తదితరులు పాల్గొన్నారు.
38 అవార్డులు..సొంతం
అంజయ్య గతంలో గతంలో 1990లో ఎన్ఎస్ఎస్ గోల్డ్ మెడల్ లభించింది. 1993లో అక్షరాస్యత సాధనకు కృషి చేసినందుకు జిల్లా స్థాయి అవార్డు అందుకొన్నారు. 1994లో జిల్లా స్థాయి యూత్ అవార్డు, 1997లో జన్మభూమి అవార్డు, 41 సార్లు రక్తదానం చేసినందుకు 2008-2009లో బ్లడ్ డొనేషన్ అవార్డు, 2009లో బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డు లభించింది. 2010లో రాష్ట్ర స్థాయి బెస్ట్ టీచర్ అవార్డు, 2011 లో జిల్లా స్థాయి బె్స్ట్ హెడ్మాస్టర్ అవార్డు, 2011-12లో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో బెస్ట్ ఎంఈఓ అవారుల్డు లభించాయి. వీటితోపాటు ఇప్పటి వరకు అంజయ్యకు 38 అవార్డులు ప్రశంసాపత్రాలు లభించాయి. మున్ముందు ఆయన విద్యా రంగ సేవలు విస్తరించి మరిన్ని అవార్డులు అందుకోవాలని ఆశిద్దాం.