MEPMA project
-
పొదుపు మహిళల ‘అర్బన్ మార్కెట్లు’
సాక్షి, అమరావతి: పట్టణ మహిళల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తూ స్వయం సహాయక సంఘాల మహిళలు స్వయంగా తయారు చేసే ఉత్పత్తులకు మార్కెట్ కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ద్వారా పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ‘అర్బన్ మార్కెట్ల’ను ఏర్పాటు చేయనుంది. పైలెట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం, విశాఖలో నెలకొల్పిన అర్బన్ మార్కెట్లు విజయవంతం కావడంతో రాష్ట్రంలోని 123 కార్పొరేషన్లు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఈ నెలలోనే వీటిని ఏర్పాటు చేయాలని మెప్మా నిర్ణయించింది. మెప్మా రెండేళ్ల క్రితం 7 నగరాల్లో ఏర్పాటు చేసిన ‘జగనన్న మహిళా మార్టులు’ విజయవంతం కావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తగా అర్బన్ మార్కెట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సిటీ మిషన్ మేనేజర్లకు(సీఎంఎం)మెప్మా ఎండీ ఆదేశాలు జారీ చేశారు. దుకాణాల ఏర్పాటుకయ్యే ఖర్చును మెప్మా చెల్లించనుంది. వీటిల్లో పొదుపు మహిళలు తయారు చేసిన వివిధ ఉత్పత్తులను విక్రయించుకునేలా ఏర్పాట్లు చేస్తారు. వైఎస్సార్ చేయూత, ఆసరాతోపాటు సున్నావడ్డీ రుణాలు తీసుకున్న పొదుపు సంఘాల మహిళలకు స్వయం ఉపాధి కల్పించేలా అర్బన్ మార్కెట్లను అందుబాటులోకి తెస్తున్నారు. విశాఖ, విజయవాడలో స్థలాల ఎంపిక పట్టణ స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు వివిధ రకాల ఉత్పత్తులను స్వయంగా తయారు చేస్తున్నారు. వీటి మార్కెటింగ్ కోసం రిసోర్స్ పర్సన్స్ వద్ద వివరాలు నమోదు చేసుకున్నారు. ఆయా పట్టణాలు, నగరాల్లో అనువైన ప్రదేశాలు, మున్సిపల్ భవనాలు, ఖాళీ స్థలాల్లో అర్బన్ మార్కెట్లను ఏర్పాటు చేయనున్నారు. మహిళలు తమ ఇళ్లల్లో తయారు చేసిన పచ్చళ్లు, ఆహారోత్పత్తులు, వస్త్రాలు, ఎంబ్రాయిడరీ వర్క్, హ్యాండీ క్రాఫ్టŠస్, బుట్టలు, జ్యూట్ బ్యాగులు, గృహాలంకరణ వస్తువులు, ఫ్యాన్సీ, వన్‌గ్రామ్ గోల్డ్ లాంటివి వీటిల్లో విక్రయించనున్నారు. ఇప్పటికే విశాఖలో నాలుగు ప్రదేశాలను, విజయవాడలో రెండు ప్రాంతాలను ఇందుకు ఎంపిక చేశారు. మిగిలిన మున్సిపాలిటీల్లో ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఒక్కో పట్టణంలో 200 నుంచి 1,000 మంది వరకు దుకాణాల ఏర్పాటుకు ఆసక్తి చూపినట్టు మెప్మా ఎండీ విజయలక్ష్మి ‘సాక్షి’కి తెలిపారు. ఇది మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. వీరందరికీ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ద్వారా వ్యాపార నిర్వహణ, నాణ్యత ప్రమాణాలపై శిక్షణ ఇస్తారు. పట్టణం స్థాయి, సభ్యుల సంఖ్యను బట్టి 20 – 40 స్టాళ్లను ఏర్పాటు చేస్తారు. ప్రతినెలా రెండు రోజులు తప్పనిసరిగా ఉండేలా పండగలు, ఎగ్జిబిషన్లు వంటి ప్రత్యేక దినాల్లో అదనపు రోజులు కొనసాగించనున్నారు. సభ్యులు అధికంగా ఉంటే రొటేషన్ పద్ధతిలో స్టాళ్లలో అవకాశం కల్పించనున్నారు. అద్భుతమైన అవకాశం ఇంట్లో మసాలాలు, కారప్పొడులు లాంటి 26 రకాల పొడులు తయారు చేస్తుంటా. గతంలో తెలిసినవారికి, బంధువులకు మాత్రమే విక్రయించగా రూ.2 వేలు కూడా వచ్చేవి కాదు. ఇటీవల విశాఖలో అర్బన్ మార్కెట్లో రెండు రోజులు స్టాల్ నిర్వహించగా రూ.17 వేల మేర వ్యాపారం జరిగింది. కొత్త వినియోగదారులు పరిచయం కావడంతో ఆన్లైన్లో కూడా ఆర్డర్లు వస్తున్నాయి. అర్బన్ మార్కెట్ ద్వారా అనూహ్యంగా వ్యాపారం పుంజుకోవడం చాలా ఆనందంగా ఉంది. – జె.సత్యరాజ్యలక్ష్మి, విశాఖపట్నం ఎంటర్ప్రెన్యూర్ వేల మందికి స్వయం ఉపాధి వైఎస్సార్ చేయూత, ఆసరాతోపాటు సున్నావడ్డీ రుణాలతో లబ్ధి పొందిన పొదుపు సంఘాల మహిళలకు స్వయం ఉపాధి కోసం అర్బన్ మార్కెట్లు చక్కటి వేదిక. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా మహిళలు ఆర్థికంగా ఎదిగేలా ప్రోత్సహించడం మెప్మా లక్ష్యం. పట్టణ స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులు నాణ్యతతో ఉన్నాయి. రానున్న రోజుల్లో మరింత మందికి మెప్మా ఆధ్వర్యంలో ఉపాధి కల్పిస్తాం. – విజయలక్ష్మి, మెప్మా ఎండీ -
తిన్నది కక్కిస్తారా.. గతంలోలాగా వదిలేస్తారా?
తిరుపతి మెప్మాలో జరిగిన అవినీతిని అధికారులు నిగ్గు తేల్చారు. కొన్నేళ్లుగా చోటుచేసుకున్న అవినీతి అక్రమాలు ఆడిట్ ద్వారా వెలుగులోకి వచ్చాయి. అవినీతి ఆరోపణలు రావడంతో లెక్క తేల్చేందుకు సెపె్టంబర్లో పూర్తిస్థాయి ఆడిట్ నిర్వహించారు. సుదీర్ఘంగా ఆడిట్ నిర్వహించి టీఎల్ఎఫ్ (టౌన్‌లెవెల్ ఫెడరేషన్)లో జరిగిన అవినీతి లెక్క తేల్చారు. ప్రధానంగా రెండు టీఎల్ఎఫ్ల్లో జరిగిన అవినీతి రూ.35.5 లక్షలని తేలింది. ఈ ఆడిట్ రిపోర్టును గతనెల చివరిలో సంబంధిత మెప్మా పీడీకి నివేదిక పంపించారు. అవినీతి సొమ్మును అక్రమార్కుల నుంచి కక్కిస్తారా? గతంలోలాగా తొక్కిపెడతారా? అనేది తేలాల్సి ఉంది. సాక్షి , తిరుపతి : తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గడిచిన ఐదేళ్లలో టీడీపీ నేతలు అధికారం అడ్డుపెట్టుకుని మెప్మా గ్రూపుల్లో పెత్తనం చెలాయించారు. తమ అనుకూల వ్యక్తులను లీడర్లుగా నియమించుకుని మెప్మా నిధులను అడ్డంగా మెక్కేశారు. అప్పటి అధికార పార్టీ అండ ఉండడంతో కొంతమంది టీఎల్ఎఫ్, ఎస్ఎల్ఎఫ్ లీడర్లు ఇష్టారాజ్యంగా మెప్మా నిధులను స్వాహాచేశారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో అవినీతి ఒక్కొక్కటే వెలుగులోకి వచ్చింది. ఎట్టకేలకు ప్రభుత్వం మారడంతో పాటు మెప్మా అధికారులు మారారు. ఈ నేపథ్యంలో అవినీతి లెక్క తేల్చేందుకు యంత్రాంగం నడుం బిగించింది. నెలపాటు సుదీర్ఘంగా టీఎల్ఎఫ్, ఎస్ఎల్ఎఫ్(స్లమ్ లెవల్)ల వారీగా పూర్తిస్థాయి ఆడిట్ నిర్వహించారు. ఈ ఆడిట్లో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చా యి. టీఎల్ఎఫ్ లీడర్లు ఇష్టారాజ్యంగా తప్పుడు బిల్లులు సమరి్పంచి, అసలు బిల్లులే పెట్టకుండా మెప్మా నిధులను దోచుకున్నారని ఆడిట్ ద్వారా వెలుగులోకి వచ్చింది. తిరుపతిలో నాలుగు టీఎల్‌ఎఫ్‌ల పరిధిలో 155 ఎస్‌ఎల్‌ఎఫ్‌ల ద్వారా 4,300 డ్వాక్రా సంఘాలు నిర్వహిస్తున్నారు. డ్వాక్రా సంఘాల లావాదేవీలు ఎస్‌ఎల్‌ఎఫ్‌ల ద్వారా టీఎల్‌ఎఫ్‌లకు చేరుతాయి. పూర్తిస్థాయిలో డ్వాక్రా సంఘాలను టీఎల్ఎఫ్ లీడర్లు నడుపుతుంటారు. లక్షలాది రూపాయల లావాదేవీలు వీరి ద్వారానే జరుగుతుంటాయి. తిరుపతిలో డ్వాక్రా సంఘాల వివరాలు పరిధి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ టీఎల్ఎఫ్లు అభ్యుదయ, స్పందన, పద్మావతి, సరస్వతి ఎస్ఎల్ఎఫ్లు 155 డ్వాక్రా గ్రూపులు 4,300 డ్వాక్రా సంఘాల సభ్యులు 43,000 మంది నిగ్గు తేల్చింది ఇలా.. మెప్మా అధికారులు డ్వాక్రా గ్రూపులను ప్రక్షాళన చేసేందుకు నడుం బిగించారు. ఏకంగా 2014 నుంచి టీఎల్‌ఎఫ్‌ల వారీగా ఆడిట్‌కు ఆదేశించారు. సెపె్టంబర్లో ప్రారంభమైన ఆడిట్ సుదీర్ఘంగా నిర్వహించి పక్కా ఆధారాలతో సహా అవినీతిని వెలుగులోకి తీసుకొచ్చారు. డ్వాక్రా సభ్యుల పిల్లల స్కాలర్íÙప్లు, నెలవారీ నిర్వహణ ఖర్చులు, రసీదు బుక్కులు, పొదుపు నిధులు, సర్వసభ్య సమావేశాల నిర్వహణ పేరుతో విచ్చలవిడిగా టీఎల్ఎఫ్ లీడర్లు మెప్మా నిధులను స్వాహా చేసినట్లు తేల్చారు. వీటికి సంబంధించిన సరైన ఆధారాలు, మినిట్స్ బుక్స్ చూపలేదని ఆడిట్ నివేదికలో పొందుపరిచారు. కొంతమంది లీడర్లు మినిట్స్ బుక్స్ మాయం చేసినట్లు గుర్తించారు. అలాగే పొదుపు, పసుపు–కుంకుమ నిధులను సైతం మింగేశారని, వీటికి సంబంధించిన ఆధారాలు సైతం మాయం చేశారని నివేదికలో పేర్కొన్నారు. ఎక్కువ ఆరోపణలు ఎదుర్కొంటున్న అభ్యుదయ టీఎల్ఎఫ్లో ఏకంగా రూ.25 లక్షల వరకు అవినీతి జరిగిందని, వీటికి సంబంధించిన ఆధారాలు సక్రమంగా లేవని, స్పందన టీఎల్ఎఫ్లోను రూ.10.5 లక్షలకు సంబంధించి ఆధారాలు లేవని తేల్చారు. అధికారుల వద్దకు నివేదిక ఆడిట్ నివేదికను ఇప్పటికే మెప్మా పీడీ జ్యోతికి అందజేశారు. పరిశీలించిన ఆమె చర్యల కోసం మెప్మా డైరెక్టర్ చిన్నతాతయ్యకు పంపించారు. ఈ నివేదికను బయటపెట్టేందుకు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. టీడీపీ నేతల అండదండలతో పాటు కొంతమంది మెప్మా సిబ్బంది ప్రమేయం కూడా ఉండడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గతంలోనూ మెప్మా అవినీతి వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో మెప్మా సిబ్బంది ప్రమేయం ఉండడంతో ఎలాంటి చర్యలూ తీసుకోకుండా చేతులెత్తేశారు. ఇప్పటికైనా ఆడిట్ నివేదిక ఆధారంగా అక్రమాలకు పాల్పడ్డ అవినీతి లీడర్లు భరతం పట్టి మెక్కిన సొమ్మును కక్కిస్తారా? లేదా? గతంలో లాగా చేతులెత్తేస్తారా? వేచి చూడాల్సింది. -
నిరాశ్రయులం..
సాక్షి, మంచిర్యాల : వారంతా ఎవరూ లేని అనాథలు.. దిక్కుతోచక రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో తలదాచుకుంటున్న అభాగ్యులు. ఎలాంటి ఆధారమూ లేని నిరాశ్రయులు. అయినా.. వారి గురించి ఎవరూ పట్టించుకోరు. జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిల్లో అనాథలు, నిరాశ్రయులు వందలాదిగా ఉన్నా నిబంధనల సాకుతో జిల్లా అధికారులు కొద్ది మందిపైనే కనికరం చూపారు. వందలాది మంది అభాగ్యులకు అన్యాయం చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం.. లక్ష మంది జనాభా దాటిన ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 60 మంది నిరాశ్రయులనే గుర్తించిన అధికారులు వీరికి మాత్రమే ఆశ్రయం కల్పించాలంటూ కేంద్రాన్ని నివేదించారు. కేంద్రమూ ఆ ప్రాంత అనాథలు, నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించేందుకు ఏటా రూ.6 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ నిధులు జిల్లా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)కు అందాయి. అధికారులు నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. సర్వేకు నోచుకోని మంచిర్యాల, నిర్మల్! 2011 జనాభా లెక్కల ప్రకారం లక్ష మంది జనాభా ఉన్న ప్రాంతాల్లోనే సర్వే చేసి.. అనాథలు, నిరాశ్రయులను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ సాకుతో అధికారులు ప్రస్తుతం లక్షకు పైనే జనాభా దాటిన మంచిర్యాల, నిర్మల్ పట్టణాల్లోని రైల్వేస్టేషన్ , బస్టాండు ప్రాంతాల్లో నివసిస్తున్న వందలాది మంది అనాథలను విస్మరించారు. మంచిర్యాలలోని రేల్వేస్టేషన్‌లో ఏళ్ల నుంచి సుమారు వంద మంది అనాథలు దుర్భర జీవనం గడుపుతున్నా.. నెలకు ఒకరిద్దరి చొప్పున చచ్చిపోతున్నా కేంద్రం దృష్టికి తీసుకెళ్లలేదు. అనాథలు, నిరాశ్రయుల సంఖ్య ఎక్కువగా ఉన్న మంచిర్యాలలోని పరిస్థితిని కేంద్రానికి నివేదిస్తే ఈ ప్రాంతంలోని అభాగ్యులకూ ‘ఆసరా’ లభించేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటు కేంద్ర నిర్ణయంపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనాథలు, నిరాశ్రయులను ఆదుకునే విషయంలో జనాభాతో ముడిపెట్టడం సబబు కాదని.. వంద మంది నిరాశ్రయులున్న ప్రాంతాలన్నింటిలోనూ పథకం వర్తింపజేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. 2011లో మంచిర్యాల పట్టణ జనాభా 88 వేల 400 మంది, నిర్మల్‌లో 88 వేల 215 మంది ఉన్నారు. ఈ రెండు మున్సిపాలిటీల్లో ప్రస్తుతం జనాభా లక్షపైనే ఉంటుంది. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి.. ఇక్కడా పథకం అమలయ్యేలా చూడాలని ఆయా నిరాశ్రయులు కోరుతున్నారు. నాలుగేళ్ల తర్వాత..! అనాథలు.. నిరాశ్రయులకూ బతికే హ క్కు కల్పించాలని సుప్రీంకోర్టు 2010లోనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. పట్టణాలు.. నగరాల్లో లక్ష జనాభాకు ఒక రాత్రి బస కేంద్రం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. సంబంధించిన మార్గదర్శకాలూ విడుదల చేసింది. ప్రతి కేంద్రంలో నీరు, ఆహారం, మరుగుదొడ్లు, పరుపులు, పారిశుధ్యం వంటి మౌలిక వసతులన్నీ కల్పించాలని.. వాటికయ్యే ఖర్చు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని సూచించింది. వయసుతో సంబంధం లేకుండా అనాథలు.. నిరాశ్రయులందరికీ అందులో నీడ కల్పించాలంది. అయినా.. జిల్లాలో ఎక్కడా రాత్రి బస కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. కొత్తగా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కార్ ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది. జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ ద్వారా 2011 జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకుని పట్టణాలు.. నగరాల్లో లక్ష జనాభా ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో రాత్రి సమయాల్లో సర్వే నిర్వహించి అనాథలు, నిరాశ్రయులను గుర్తించాలని ఆదేశించింది. వీరి కోసం బస కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని.. అందుకు అయ్యే ఖర్చు భరించేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. దీంతో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులు రెండు నెలల క్రితం లక్ష జనాభా ఉన్న ఆదిలాబాద్పైనే నివేదికను కేంద్రానికి పంపారు. ఈ విషయమై మెప్మా ప్రాజెక్టు డెరైక్టర్ రాథోడ్ రాజేశ్వర్ వివరణ ఇస్తూ.. కేంద్రం సూచనల మేరకు 2011 జనాభా లెక్కల ప్రకారం లక్ష జనాభా దాటిన ఆదిలాబాద్ పట్టణంలోనే సర్వే నిర్వహించామని, 60 మంది అనాథలు, నిరాశ్రయులను గుర్తించి వారి వివరాలు కేంద్రానికి పంపామనిచ మంచిర్యాల, నిర్మల్‌లో 2011లో జనాభా లక్ష లేకపోవడంతో సర్వే చేయలేదని తెలిపారు. తట్టుకోలేక.. తనువు చాలిస్తున్నారు..! ఇంటి నుంచి వెలివేయబడ్డ వారు.. అనాథలు.. ఎక్కడి నుంచో పని కోసం వచ్చి శరీరం సహకరించక భిక్షాటన చేస్తున్న వృద్ధులు, వికలాంగులు మంచిర్యాలలోనే ఆశ్రయం పొందుతున్నారు. రైల్వేస్టేషన్లు.. బస్టాండులు.. చౌరస్తాలు.. ప్రార్థన మందిరాల వద్ద యాచకులుగా దర్శనమిస్తున్నారు. జిల్లాలో వేసవికాలంలో భరించలేని వేడి.. శీతాకాలం ప్రాణాలు తీసే చలిని తట్టుకోలేక ఎంతో మంది చనిపోతున్నారు. మరెంతో మంది అనారోగ్యం పాలవుతున్నారు. అయినా.. వీరిని గురించి పట్టింపేవరికీ లేదు. ఇంత వరకు వీరి గురించి ఆలోచించిన నాధుడే లేడు. ఆరోగ్యం చెడిపోయినా వైద్యం చేయించుకోలేని దుస్థితి. పలు సందర్భాల్లో పోలీసులు లేనిపోని అనుమానంతో నిరాశ్రయులు.. అనాథలపై చేయి చేసుకోవడం అభాగ్యులను ఆవేదనకు గురి చేస్తోంది.