గత నెలలో విశాఖపట్నంలో నిర్వహించిన అర్బన్ మార్కెట్‌లోని స్టాళ్లు
సాక్షి, అమరావతి: పట్టణ మహిళల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తూ స్వయం సహాయక సంఘాల మహిళలు స్వయంగా తయారు చేసే ఉత్పత్తులకు మార్కెట్ కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ద్వారా పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ‘అర్బన్ మార్కెట్ల’ను ఏర్పాటు చేయనుంది.
పైలెట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం, విశాఖలో నెలకొల్పిన అర్బన్ మార్కెట్లు విజయవంతం కావడంతో రాష్ట్రంలోని 123 కార్పొరేషన్లు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఈ నెలలోనే వీటిని ఏర్పాటు చేయాలని మెప్మా నిర్ణయించింది.
మెప్మా రెండేళ్ల క్రితం 7 నగరాల్లో ఏర్పాటు చేసిన ‘జగనన్న మహిళా మార్టులు’ విజయవంతం కావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తగా అర్బన్ మార్కెట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సిటీ మిషన్ మేనేజర్లకు(సీఎంఎం)మెప్మా ఎండీ ఆదేశాలు జారీ చేశారు. దుకాణాల ఏర్పాటుకయ్యే ఖర్చును మెప్మా చెల్లించనుంది.
వీటిల్లో పొదుపు మహిళలు తయారు చేసిన వివిధ ఉత్పత్తులను విక్రయించుకునేలా ఏర్పాట్లు చేస్తారు. వైఎస్సార్ చేయూత, ఆసరాతోపాటు సున్నావడ్డీ రుణాలు తీసుకున్న పొదుపు సంఘాల మహిళలకు స్వయం ఉపాధి కల్పించేలా అర్బన్ మార్కెట్లను అందుబాటులోకి తెస్తున్నారు.
విశాఖ, విజయవాడలో స్థలాల ఎంపిక
పట్టణ స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు వివిధ రకాల ఉత్పత్తులను స్వయంగా తయారు చేస్తున్నారు. వీటి మార్కెటింగ్ కోసం రిసోర్స్ పర్సన్స్ వద్ద వివరాలు నమోదు చేసుకున్నారు. ఆయా పట్టణాలు, నగరాల్లో అనువైన ప్రదేశాలు, మున్సిపల్ భవనాలు, ఖాళీ స్థలాల్లో అర్బన్ మార్కెట్లను ఏర్పాటు చేయనున్నారు. మహిళలు తమ ఇళ్లల్లో తయారు చేసిన పచ్చళ్లు, ఆహారోత్పత్తులు, వస్త్రాలు, ఎంబ్రాయిడరీ వర్క్, హ్యాండీ క్రాఫ్టŠస్, బుట్టలు, జ్యూట్ బ్యాగులు, గృహాలంకరణ వస్తువులు, ఫ్యాన్సీ, వన్‌గ్రామ్ గోల్డ్ లాంటివి వీటిల్లో విక్రయించనున్నారు.
ఇప్పటికే విశాఖలో నాలుగు ప్రదేశాలను, విజయవాడలో రెండు ప్రాంతాలను ఇందుకు ఎంపిక చేశారు. మిగిలిన మున్సిపాలిటీల్లో ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఒక్కో పట్టణంలో 200 నుంచి 1,000 మంది వరకు దుకాణాల ఏర్పాటుకు ఆసక్తి చూపినట్టు మెప్మా ఎండీ విజయలక్ష్మి ‘సాక్షి’కి తెలిపారు. ఇది మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.
వీరందరికీ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ద్వారా వ్యాపార నిర్వహణ, నాణ్యత ప్రమాణాలపై శిక్షణ ఇస్తారు. పట్టణం స్థాయి, సభ్యుల సంఖ్యను బట్టి 20 – 40 స్టాళ్లను ఏర్పాటు చేస్తారు. ప్రతినెలా రెండు రోజులు తప్పనిసరిగా ఉండేలా పండగలు, ఎగ్జిబిషన్లు వంటి ప్రత్యేక దినాల్లో అదనపు రోజులు కొనసాగించనున్నారు. సభ్యులు అధికంగా ఉంటే రొటేషన్ పద్ధతిలో స్టాళ్లలో అవకాశం కల్పించనున్నారు.
అద్భుతమైన అవకాశం
ఇంట్లో మసాలాలు, కారప్పొడులు లాంటి 26 రకాల పొడులు తయారు చేస్తుంటా. గతంలో తెలిసినవారికి, బంధువులకు మాత్రమే విక్రయించగా రూ.2 వేలు కూడా వచ్చేవి కాదు. ఇటీవల విశాఖలో అర్బన్ మార్కెట్‌లో రెండు రోజులు స్టాల్ నిర్వహించగా రూ.17 వేల మేర వ్యాపారం జరిగింది. కొత్త వినియోగదారులు పరిచయం కావడంతో ఆన్‌లైన్‌లో కూడా ఆర్డర్లు వస్తున్నాయి. అర్బన్ మార్కెట్ ద్వారా అనూహ్యంగా వ్యాపారం పుంజుకోవడం చాలా ఆనందంగా ఉంది.
– జె.సత్యరాజ్యలక్ష్మి, విశాఖపట్నం ఎంటర్‌ప్రెన్యూర్
వేల మందికి స్వయం ఉపాధి
వైఎస్సార్ చేయూత, ఆసరాతోపాటు సున్నావడ్డీ రుణాలతో లబ్ధి పొందిన పొదుపు సంఘాల మహిళలకు స్వయం ఉపాధి కోసం అర్బన్ మార్కెట్లు చక్కటి వేదిక. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా మహిళలు ఆర్థికంగా ఎదిగేలా ప్రోత్సహించడం మెప్మా లక్ష్యం. పట్టణ స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులు నాణ్యతతో ఉన్నాయి. రానున్న రోజుల్లో మరింత మందికి మెప్మా ఆధ్వర్యంలో ఉపాధి కల్పిస్తాం.
– విజయలక్ష్మి, మెప్మా ఎండీ
Comments
Please login to add a commentAdd a comment