రెండేళ్ల క్రితం నిర్మించుకున్న మరుగుదొడ్లకూ బిల్లులు
► ఎస్ఎంసీ మెప్మా రాష్ట్ర అధికారి డాక్టర్ సుజాత
జోగిపేట: మున్సిపాలిటీల్లో రెండేళ్ల క్రితం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్నవారికీ బిల్లులు చెల్లిస్తామని ఎస్ఎంసీ మెప్మా రాష్ట్ర అధికారి డాక్టర్ సుజాత తెలిపారు. సోమవారం జోగిపేట నగర పంచాయతీ ఆధ్వర్యంలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని కళాకారుల బృందంచే ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సుజాత పాల్గొన్నారు. కార్యక్రమానికి చైర్పర్సన్ కవిత సురేందర్‌గౌడ్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ సుజాత మాట్లాడుతూ.. నగర పంచాయతీ పరిధిలో దాదాపు 400 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉందని, 10 రోజుల్లో వాటి నిర్మించుకోవాలన్నారు. కాంట్రాక్టర్లు మరుగుదొడ్లు నిర్మిస్తున్నా.. లబ్ధిదారులు సమైఖ్య గ్రూపుల్లో రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు రుణాలు తీసుకొని గుంతలు, పైపులు సమకూర్చుకోవాలన్నారు. అనంతరం నగర పంచాయతీ చైర్పర్సన్ కవిత మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నారు. మెప్మా డీఎంసీ ఇందిర మాట్లాడుతూ.. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రజలు సహకరించాలన్నారు. కార్యక్రమంలో కమిషనర్ దేవేందర్, మెప్మా ఏఓ ఆదిలక్ష్మి, కౌన్సిలర్లు ప్రదీప్‌గౌడ్, సునీల్‌కుమార్, గాజుల నవీన్‌కుమార్, శరత్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న కళాకారుల ప్రదర్శన
మరుగుదొడ్ల నిర్మాణాలపై నగర పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కళాబృందం ప్రదర్శన ఆకట్టుకుంది. కళాకారులు ఎన్.దుర్గేశ్, డి.రమేశ్, ఎస్.మల్లేశ్, ఎ.వినేశ్, బి.నవీన్, ఎ.సునీల్ తమ ఆటపాటలతో అలరించారు.