Meru Cabs
-
ధరలు తగ్గిస్తే తప్పేంటీ? నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఓలా గుత్తాధిపత్య ధరల విధానాన్ని అనుసరిస్తోందని దాఖలైన అప్పీలెంట్ పిటిషన్‌ను నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) కొట్టివేసింది. బెంగళూరు మార్కెట్లో ఓలా అసమంజస ధరల విధానాన్ని అవలంభిస్తోందని మేరు, ఫాస్ట్ ట్రాక్ కాల్ క్యాబ్ ఈ పిటిషన్లను దాఖలు చేశాయి. ఓలా బ్రాండ్ పేరుతో యాప్ ఆధారిత టాక్సీ సర్వీస్‌ను నడుపుతున్న ఏఎన్‌టీ టెక్నాలజీస్‌కు వ్యతిరేకంగా సంస్థలు ఈ అప్పీళ్లను దాఖలు చేశాయి. ఈ మేరకు సంస్థలు తొలుత దాఖలైన పిటిషన్లను కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) 2017 జూలైలో కొట్టివేసింది. దీనిపై ఆయా సంస్థలు అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా, అక్కడ కూడా వ్యతిరేక రూలింగ్ వచ్చింది. పిటిషన్లను తిరస్కరిస్తూ, బెంగళూరు మార్కెట్లో ఓలా ఆధిపత్య స్థానంలో లేదని ఎన్సీఎల్ఏటీ పేర్కొంది. అలాంటప్పుడు అసలు గుత్తాధిపత్య, దోపిడీ, అసమంజస ధరల ఆరోపణలే తప్పని రూలింగ్ ఇచ్చింది. ధరలు తగ్గించారు.. తమ పెట్టుబడిదారుల నుంచి నాలుగు సిరీస్‌లలో నిధులను స్వీకరించిన తర్వాత బెంగళూరులోని రేడియో ట్యాక్సీ సేవలపై గుత్తాధిపత్యం సాధించాలనే ఏకైక ఉద్దేశ్యంతో ఓలా వినియోగదారులకు తగ్గింపులు, డ్రైవర్లకు ప్రోత్సాహకాలను అందించిందని, తద్వారా దోపిడీ ధరలకు పాల్పడిందని మేరు, ఫాస్ట్ ట్రాక్ కాల్ క్యాబ్ తమ పిటిషన్లలో ఆరోపించాయి. ఆరోపణలు అర్థరహితం! అప్పీలేట్ ట్రిబ్యునల్ ప్రకారం ఓలా తన బ్రాండ్, నెట్‌వర్క్‌ను పటిష్టం చేసుకోడానికి తగిన వ్యూహాన్ని అవలంభించింది. వినియోగదారులకు సమర్థవంతమైన స్నేహపూర్వకమైన సేవలను అందించడం ద్వారా ప్రత్యర్థి సంస్థలకు పోటీని ఇవ్వడమే దీని లక్ష్యం తప్ప, దీనిని గుత్తాధిపత్య ధోరణిగా పరిగణించలేమని జస్టిస్ జరత్ కుమార్ జైన్ మరియు అలోక్ శ్రీవాస్తవలతో కూడిన అప్పీలేట్ ట్రిబ్యునల్ పేర్కొంది. ఇక డ్రైవర్లకు ఇచ్చిన ప్రోత్సాహకాల గురించి ప్రస్తావిస్తూ, ఇది కేవలం వారికి కేవలం ఒక ఎంపిక (ఆప్షనల్) అని వివరించింది. డిమాండ్ పెరిగిన సందర్భంలో ఓలా తన నెట్‌వర్క్‌లోకి ఎక్కువ మంది డ్రైవర్లను తీసుకురావడానికి మాత్రమే దీని ఉద్దేశ్యమని తెలిపింది. ఓలా కస్టమర్ డిస్కౌంట్ల ద్వారా డిమాండ్‌ను పెంచడానికి కృషి చేసిందని ఇక్కడ భావించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ దిశలోనే ఎక్కువ మంది డ్రైవర్లను నెట్‌వర్క్‌లోకి తీసుకురావడానికి ప్రయత్నించిందని పేర్కొంది. ఓలా–డ్రైవర్లు–కస్టమర్ల పరస్పర ప్రయోజనాలకు ఉద్దేశించి ఓలా చర్యలు ఉన్నాయని బెంచ్ అభిప్రాయపడింది. చదవండి:అనిల్ అగర్వాల్ చేజారిన వీడియోకాన్! -
రూ.625 కోట్లు సమీకరించనున్న మేరు క్యాబ్స్
న్యూఢిల్లీ: క్యాబ్ సేవల రంగంలో ఉన్న మేరు క్యాబ్స్ భారత్‌లో విస్తరిస్తోంది. దీనిలో భాగంగా మేరు క్యాబ్స్ ఏప్రిల్ నాటికి అమెరికా, హాంకాంగ్‌లకు చెందిన ఇన్వెస్టర్ల నుంచి దాదాపు రూ.625 కోట్లను సమీకరించనుంది. ఇటీవలే ఇన్వెస్టర్ల నుంచి దాదాపు రూ.310 కోట్లను సమీకరించామని మేరు క్యాబ్స్ సీఈఓ సిద్ధార్థ పహ్వా అన్నారు. ప్రస్తుత రూ.625 కోట్ల నిధుల సమీకరణ వచ్చే నెల నాటికి పూర్తి అవుతుందని చెప్పారు. క స్టమర్ల సంఖ్యను పెంచుకోవటం, ఆటో రిక్షా యూజర్లను ఆకర్షించటం, కొత్త పట్టణాలకు విస్తరించ డం అనే అంశాలపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించామని తెలిపారు. సేకరించిన నిధులను వీటికే వెచ్చిస్తామని అన్నారు. వచ్చే 3-4 ఏళ్లలో తమ కార్ల సంఖ్యను లక్షకు పెంచుతామని చెప్పారు. ప్రస్తుతం మేరు క్యాబ్స్ 15,000 కార్లను కలిగి, 20 పట్టణాలలో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. -
హైదరాబాద్‌లో ‘జినీ’ క్యాబ్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రవాణా సేవలందిస్తున్న మేరు క్యాబ్ తాజాగా ‘జినీ’ పేరుతో మధ్యతరగతి వారికోసం నూతన క్యాబ్ సర్వీసులను హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఏసీ సౌకర్యం ఉన్న జినీ క్యాబ్ సేవల్లో భాగంగా కిలోమీటరుకు రూ.16 చార్జీ చేస్తారు. రాత్రివేళ కిలోమీటరుకు రూ.20 వసూలు చేస్తారు. కస్టమర్లు ఒకటి రెండు కిలోమీటర్ల దూరం వెళ్లాలన్నా జినీ సేవలు వినియోగించుకోవచ్చు. కనీస చార్జీ రూ.100 మాత్రమే(గరిష్టంగా 6 కిలోమీటర్లు). ప్రస్తుతం హైదరాబాద్‌లో క్యాబ్ ఏజెన్సీలు కనీస చార్జీ రూ.150-200 వసూలు చేస్తున్నాయి. నగర రవాణా విభాగంలో జినీ సంచలనం సృష్టిస్తుందని మేరు క్యాబ్ ఎండీ నీరజ్ గుప్తా ఈ సందర్భంగా బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. నలుగురు ప్రయాణికులు కూర్చునే వీలున్న ఫోర్డ్ ఫిగో, టయోటా లివా వంటి కార్లను వినియోగిస్తామన్నారు. కాగా, ప్రారంభోత్సవ కార్యక్రమంలో సినీ నటి చార్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇతర నగరాలకూ: జినీ సేవల్లో భాగంగా హైదరాబాద్‌లో తొలుత 50 కార్లను ప్రవేశపెట్టారు. 9 నెల ల్లో వీటి సంఖ్యను 500కు చేరుస్తామని కంపెనీ సీఈవో సిద్ధార్థ పాహ్వా చెప్పారు. ‘రాష్ట్రంలో ఆటో చార్జీ కిలోమీటరుకు రూ.11 ఉంది. క్యాబ్‌కు రూ.21 చెల్లించాలి. రూ.11-21 మధ్య అంతరం చాలా ఉంది. అందుకే జినీ బ్రాండ్‌ను ప్రవేశపెట్టాం’ అని అన్నారు. వైజాగ్తోసహా దేశవ్యాప్తంగా ఇతర ప్రధాన నగరాలకు విస్తరిస్తామని తెలిపారు. మేరు క్యాబ్‌కు మొత్తం 5,500 కార్లున్నాయి. రాష్ట్రం నుంచి 20 శాతం ఆదాయం సమకూరుతోందని కంపెనీ డిప్యూటీ జీఎం వి.నాగ కిషోర్ పేర్కొన్నారు. ఖరీదైన వాహనాలతో కూడిన మేరు ప్లస్ సేవలను హైదరాబాద్‌లో ఆరు నెలల్లో పరిచయం చేయనున్నారు. దేశంలో టూర్, ట్యాక్సీ ఆపరేటర్ల వద్ద సుమారు 20 లక్షల కార్లున్నాయి.