న్యూఢిల్లీ: ఓలా గుత్తాధిపత్య ధరల విధానాన్ని అనుసరిస్తోందని దాఖలైన అప్పీలెంట్ పిటిషన్‌ను నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) కొట్టివేసింది. బెంగళూరు మార్కెట్‌లో ఓలా అసమంజస ధరల విధానాన్ని అవలంభిస్తోందని మేరు, ఫాస్ట్ ట్రాక్ కాల్ క్యాబ్ ఈ పిటిషన్‌లను దాఖలు చేశాయి. ఓలా బ్రాండ్ పేరుతో యాప్ ఆధారిత టాక్సీ సర్వీస్‌ను నడుపుతున్న ఏఎన్‌టీ టెక్నాలజీస్‌కు వ్యతిరేకంగా సంస్థలు ఈ అప్పీళ్లను దాఖలు చేశాయి. ఈ మేరకు సంస్థలు తొలుత దాఖలైన పిటిషన్లను కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) 2017 జూలైలో కొట్టివేసింది. దీనిపై ఆయా సంస్థలు అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా, అక్కడ కూడా వ్యతిరేక రూలింగ్ వచ్చింది. పిటిషన్లను తిరస్కరిస్తూ, బెంగళూరు మార్కెట్‌లో ఓలా ఆధిపత్య స్థానంలో లేదని ఎన్‌సీఎల్‌ఏటీ పేర్కొంది. అలాంటప్పుడు అసలు గుత్తాధిపత్య, దోపిడీ, అసమంజస ధరల ఆరోపణలే తప్పని రూలింగ్ ఇచ్చింది.
ధరలు తగ్గించారు..
తమ పెట్టుబడిదారుల నుంచి నాలుగు సిరీస్‌లలో నిధులను స్వీకరించిన తర్వాత బెంగళూరులోని రేడియో ట్యాక్సీ సేవలపై గుత్తాధిపత్యం సాధించాలనే ఏకైక ఉద్దేశ్యంతో ఓలా వినియోగదారులకు తగ్గింపులు, డ్రైవర్లకు ప్రోత్సాహకాలను అందించిందని, తద్వారా దోపిడీ ధరలకు పాల్పడిందని మేరు, ఫాస్ట్ ట్రాక్ కాల్ క్యాబ్ తమ పిటిషన్లలో ఆరోపించాయి.
ఆరోపణలు అర్థరహితం!
అప్పీలేట్ ట్రిబ్యునల్ ప్రకారం ఓలా తన బ్రాండ్, నెట్‌వర్క్‌ను పటిష్టం చేసుకోడానికి తగిన వ్యూహాన్ని అవలంభించింది. వినియోగదారులకు సమర్థవంతమైన స్నేహపూర్వకమైన సేవలను అందించడం ద్వారా ప్రత్యర్థి సంస్థలకు పోటీని ఇవ్వడమే దీని లక్ష్యం తప్ప, దీనిని గుత్తాధిపత్య ధోరణిగా పరిగణించలేమని జస్టిస్ జరత్ కుమార్ జైన్ మరియు అలోక్ శ్రీవాస్తవలతో కూడిన అప్పీలేట్ ట్రిబ్యునల్ పేర్కొంది. ఇక డ్రైవర్లకు ఇచ్చిన ప్రోత్సాహకాల గురించి ప్రస్తావిస్తూ, ఇది కేవలం వారికి కేవలం ఒక ఎంపిక (ఆప్షనల్) అని వివరించింది. డిమాండ్ పెరిగిన సందర్భంలో ఓలా తన నెట్‌వర్క్‌లోకి ఎక్కువ మంది డ్రైవర్‌లను తీసుకురావడానికి మాత్రమే దీని ఉద్దేశ్యమని తెలిపింది. ఓలా కస్టమర్ డిస్కౌంట్ల ద్వారా డిమాండ్‌ను పెంచడానికి కృషి చేసిందని ఇక్కడ భావించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ దిశలోనే ఎక్కువ మంది డ్రైవర్‌లను నెట్‌వర్క్‌లోకి తీసుకురావడానికి ప్రయత్నించిందని పేర్కొంది. ఓలా–డ్రైవర్లు–కస్టమర్ల పరస్పర ప్రయోజనాలకు ఉద్దేశించి ఓలా చర్యలు ఉన్నాయని బెంచ్ అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment